బీజేపీ అజెండాని హైజాక్ చేసిన పవన్..
సమకాలీన రాజకీయాల్లో ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ కల్యాణ్.. ప్రతి రోజూ అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని, ఇప్పుడు జగన్ సర్కార్ పై పవన్ కి ఎందుకంత జలసీ అనేవాళ్లు ఉన్నా కూడా.. ప్రశ్నించేవారు లేకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడే లేదనే మాట మాత్రం వాస్తవం. పోటీ చేసిన రెండు చోట్లా ప్రజలు తిరస్కరించినా.. తాను నమ్ముకున్నవారు ఒక్కొక్కరే పార్టీని వీడుతున్నా.. జనసేనను ఇంకా లైమ్ లైట్లో ఉంచడానికి పవన్ […]
సమకాలీన రాజకీయాల్లో ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ కల్యాణ్.. ప్రతి రోజూ అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని, ఇప్పుడు జగన్ సర్కార్ పై పవన్ కి ఎందుకంత జలసీ అనేవాళ్లు ఉన్నా కూడా.. ప్రశ్నించేవారు లేకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడే లేదనే మాట మాత్రం వాస్తవం. పోటీ చేసిన రెండు చోట్లా ప్రజలు తిరస్కరించినా.. తాను నమ్ముకున్నవారు ఒక్కొక్కరే పార్టీని వీడుతున్నా.. జనసేనను ఇంకా లైమ్ లైట్లో ఉంచడానికి పవన్ చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకోకుండా ఉండలేం. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తిగా హిందూత్వాన్ని భుజానికెత్తుకోవడమే కాస్త కలవరపెడుతున్న అంశం.
హిందూత్వం అనేది పూర్తిగా బీజేపీ అజెండా. ఎవరు ఏమనుకున్నా, ఏ వర్గం వారు తమకు ఓట్లు వేయకపోయినా.. తాము మాత్రం మతాన్ని పక్కనపెట్టేది లేదని గొప్పగా చెప్పుకుంటారు బీజేపీ నేతలు. అలాంటి బీజేపీ శ్రేణులు కూడా ఆశ్చర్యపోయేలా ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రవర్తిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. గతంలో రాష్ట్రంలోని పలు సమస్యలపై తన గళం వినిపించే పవన్.. ఇప్పుడు పూర్తిగా ఆలయాల ఘటనలపై మాత్రమే స్పందిస్తున్నారు. రైతులకు తుపాను నష్టపరిహారం కోసం ఆమధ్య పరామర్శ యాత్ర చేసి, నిరాహార దీక్షకు కూడా దిగిన పవన్, ఇప్పుడా అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. ఒకవేళ ఏపీ రైతుల గురించి మాట్లాడితే, అక్కడ ఢిల్లీ బోర్డర్ లో ఉన్నవారి గురించి ఎవరైనా ప్రశ్నిస్తారని అనుకున్నారో ఏమో.. అన్నదాతల అంశాన్ని అటకెక్కించారు. అమరావతి నినాదాన్ని కూడా కొన్నాళ్లు భుజాన మోశారు పవన్. మూడు రాజధానులకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో తమ పార్టీ తరపున అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఇప్పుడా అంశాన్ని కూడా పవన్ లైట్ తీసుకున్నారు.
ప్రత్యేక హోదాపై కాస్త గట్టిగా మాట్లాడినవారిలో పవన్ కూడా ఒకరు. పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక ప్యాకేజీని తూర్పారబట్టి, ఢిల్లీని సైతం ప్రశ్నించారు కూడా. తీరా ఇప్పుడు బీజేపీతో కలిశాక, ప్రజలే హోదా అక్కర్లేదంటున్నారని కాడె పడేశారు. రైతు సమస్యలైనా, నిరుద్యోగ సమస్యలైనా, తనని కలవడానికి వచ్చిన ప్రతి వర్గానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి పంపేవారు పవన్. వారి తరపున ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు. కానీ ఇప్పుడా హడావిడి పూర్తిగా తగ్గిపోయింది. జనసేన తరపున ప్రెస్ నోట్ వస్తుందంటే.. కచ్చితంగా ఆలయాలు, హిందూత్వం, మతం.. అనే భావజాలంతోనే అది నిండిపోతోంది. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ ఇదే విషయంపై రోజుకో ప్రెస్ నోట్ తో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఏపీలో హిందువులకు, హిందూ దేవాలయాలకు, హిందూ దేవుళ్లకు రక్షణే లేకుండా పోయిందంటున్నారు. ఒకరకంగా పవన్.. పూర్తిగా కాషాయ అజెండాని భుజానికెత్తుకున్నారా అనే అనుమానం రాకమానదు. ఎన్నడూ లేనిది బొట్టు పెట్టి చంద్రబాబు విజయనగరం వెళ్లారంటే ఆయన రాజకీయ అవకాశవాదాన్ని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ నేతలు నిరసనలు చేస్తున్నారంటే అది వారి పార్టీ విధానం.
మరి పవన్ కల్యాణ్ ఎందుకు కొందరివాడిగా మిగిలిపోవాలనుకుంటున్నారు..? మత రాజకీయాలతో లాభంకంటే నష్టమే ఎక్కువ? మతాన్ని మాత్రమే నమ్ముకుని ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. బలమైన ప్రత్యర్థి లేకపోవడం, కాంగ్రెస్ తో ప్రజలు పూర్తిగా విసిగిపోవడమే మోదీ విజయం. ఏపీలో అలాంటి పరిస్థితులు అసలే లేవు. మరి పవన్ కల్యాణ్ పూర్తిగా హిందూ అజెండాతో ముందుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని పార్టీ శ్రేణుల్లో కూడా చర్చ మొదలైంది. బీజేపీతో కలసి ఉన్నంత మాత్రాన.. పూర్తిగా బీజేపీ అజెండాని భుజానికెత్తుకోవడం ఎంతవరకు సరైన నిర్ణయమో పవన్ కల్యాణే ఆలోచించుకోవాలి.