Telugu Global
Family

ఇంటి అందం.. మనసుకు ఆనందం

మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒంటితో పాటు ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు నీట్‌గా ఉండకపోతే.. మనకే కాదు ఇంటికి వచ్చిన వాళ్లు కూడా ఇబ్బంది పడతారు. అందుకే అప్పుడప్పుడు ఇంటిని డీక్లట్టర్ చేస్తుండాలి. రోజంతా పని చేసి, అలసిపోయి ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది. కానీ ఇంట్లో చూస్తే.. ఎక్కడి వస్తువులు అక్కడ పడేసి ఉంటాయి. వాటిని చూస్తే ప్రశాంతత మాట అటుంచి చిరాకేస్తుంది. ఇప్పుడు వాటినెక్కడ సర్దుతాంలే అని అలాగే వదిలేస్తాం. […]

ఇంటి అందం.. మనసుకు ఆనందం
X

మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒంటితో పాటు ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు నీట్‌గా ఉండకపోతే.. మనకే కాదు ఇంటికి వచ్చిన వాళ్లు కూడా ఇబ్బంది పడతారు. అందుకే అప్పుడప్పుడు ఇంటిని డీక్లట్టర్ చేస్తుండాలి.

రోజంతా పని చేసి, అలసిపోయి ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది. కానీ ఇంట్లో చూస్తే.. ఎక్కడి వస్తువులు అక్కడ పడేసి ఉంటాయి. వాటిని చూస్తే ప్రశాంతత మాట అటుంచి చిరాకేస్తుంది. ఇప్పుడు వాటినెక్కడ సర్దుతాంలే అని అలాగే వదిలేస్తాం. అలా రోజురోజుకీ ఇల్లంతా చిందరవందరగా తయారవుతుంది. అందుకే ఇంటిని పద్ధతిగా, అందంగా సర్దుకోవాలి. అవసరానికి తగ్గట్టు వస్తువులను ఒక ఆర్డర్‌‌లో అమర్చుకోవాలి. దీన్నే డీక్లట్టరింగ్ అంటారు.

డీక్లట్టరింగ్ అనేది ఒక కళ.. ఎందుకంటే అందంగా, నీట్‌గా ఉన్న ఇంటిని చూడగానే పదే పదే చూడాలనిపిస్తుంది. ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంటే.. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంట్లోకి రాగానే మనసు రిఫ్రెష్ అవుతుంది. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకునే వాళ్లలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు స్టడీలు కూడా చెప్తున్నాయి. అందుకే కనీసం రెండు వారాలకొకసారైనా ఇంటిని డీక్లట్టరింగ్ చేయాలి.

బెడ్ రూం
డీక్లట్టరింగ్ పక్కబట్టలతో మొదలుపెట్టాలి. ఏరోజుకారోజు పక్కదుప్పట్లు మడతపెట్టుకోవడం వల్ల బెడ్ రూం నీట్‌గా ఉంటుంది. బెడ్ రూమ్స్ అనేవి విశ్రాంతి కోసం ఉండేవి. రోజంతా పనిచేసి వచ్చాక పడకగదిలో రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి గదులు చిందరవందరగా ఉంటే బాగోదు. అందుకే బెడ్ రూం నీట్‌గా సర్దుకోవాలి. మంచం మీద ఒక్క దిండుమాత్రమే పెట్టాలి. బెడ్‌షీట్ అందంగా పరచి ఉండాలి. ప్రతివారం వీటిని మార్చుకుంటూ ఉండాలి. ముందురూమ్‌లోకాని లోపల గాని డస్ట్‌బిన్‌ను పెట్టుకోవాలి. చిన్న చిన్న కాగితాలు గాని, లేదా మందుల రేపర్లు చాక్లెట్ల కవర్స్ ల్లాంటివి చించి కింద పడయ్యకుండా ఆ డస్ట్‌బిన్‌లో వేసుకొనేలా చూడాలి. ప్రతిరోజు ఆ డస్ట్‌బిన్‌ను కూడా శుభ్రం చేయాలి.

హాల్
ఇంట్లో ఎన్ని గదులున్నా ఎక్కువసమయం గడిపేది హాల్‌లోనే.. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొస్తే కూర్చునేది కూడా హాల్‌లోనే.. అందుకే హాల్‌ని ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచాలి. హాల్‌ను క్షణాల్లో సర్దడమంటే అయ్యేపని కాదు. అందుకే ముందు హాల్‌లో ఉన్న వస్తువులన్నీ ఒక పెద్ద బాస్కెట్‌లో వేసి హాల్ ను ఖాళీ చేయాలి. తర్వాత నిజంగా హాల్‌లో ఏవేవి అవసరమో అవన్నీ నీట్ గా సర్దుకోవాలి. వీలైనంత వరకూ హాల్‌లో అలంకరణ వస్తువులు ఉంచితే ఇల్లు అందంగా కనిపిస్తుంది. సోఫాలు, కుర్చీలు, పూలకుండీలు, బొమ్మలు లాంటివే హాల్‌లో ఉంచాలి. ఫ్రిజ్, బీరువా లాంటివి హాల్‌లో కంటే గదుల్లో ఉంచడమే బెటర్.

ట్రాఫిక్
ప్రతీ ఇంట్లో కొన్ని ట్రాఫిక్ ఏరియాలు ఉంటాయి. అది షెల్ఫ్, ర్యాక్, ఫ్రిజ్ ఏదైనా కావొచ్చు. ఇంట్లో వస్తువులన్నీ కుప్పగా ఉండే ప్లేస్‌ను ట్రాఫిక్ ఏరియా అంటారు. ఇంట్లో ట్రాఫిక్ ఏరియాలు ఎక్కువగా ఉంటే అవసరమైనప్పుడు కావాల్సిన వస్తువుల కోసం గంటల తరబడి వెతుక్కోవాల్సొస్తుంది. ఆ వస్తువు ఎక్కడ పెట్టానో గుర్తే రావడం లేదంటూ ఇల్లంతా వెతకడం చూస్తూనే ఉంటాం. అలాంటి ట్రాఫిక్ ఏరియాలను కనిపెట్టి దాన్ని రెగ్యులర్‌‌గా శుభ్రపర్చాలి. అన్నీ ఒకేచోట పెట్టకుండా ఒకదానిపక్కన ఒకటి కంటికి కనిపించేలా, చేతికి అందేలా ఉంచుకోవాలి. అలాచేస్తే.. అవసరమైనప్పుడు వస్తువుల కోసం వెతకడం, వెతికే క్రమంలో మిగతా వస్తువలను చల్లాచెదురుగా పడేయడం లాంటివి జరగకుండా ఉంటాయి.

కొన్ని టిప్స్

  • దుమ్ము దులపడానికి మామూలు క్లాత్ కన్నా మైక్రోఫైబర్‌ క్లాత్‌ను ఉపయోగించడం మంచిది. దాంతో వేగంగా దుమ్ము దులపొచ్చు.
  • సామాన్లు సర్దాలనుకున్నప్పుడు ఒకేసారి సామానంత తీసి చుట్టూ పరుచుకోకూడదు. ఒక్కో అల్మరా తీసి సర్దుతూ పై అర నుంచి కిందికి రావాలి. సర్దేటప్పుడు పాత పేపర్లు, రసీదులు లాంటివి ఉంటే ఒకసారి చెక్ చేసుకుని పనికిరావనుకుంటే వెంటనే పారేయాలి.
  • న్యూస్ పేపర్స్‌లో నచ్చిన కథల కోసం, వ్యాసాల కోసం పుస్తకం మొత్తాన్ని దాచిపెట్టుకోకుండా కావలసిన పేజీలు కట్‌చేసి ఫైల్‌ చేసుకుంటే బెటర్. దానివల్ల సగం చెత్త తగ్గిపోతుంది.
  • వాడని చెప్పులు, విరిగిపోయిన బొమ్మలు, పాత వస్తువులు, పాత బట్టలు, బిగుతైన బట్టలు ఇంట్లో ఉంచుకోకూడదు. కావాలనుకుంటే వాటిని మూటకట్టి ఎవరికైనా అవసరమున్న వాళ్లకు ఇచ్చేయొచ్చు. లేదా బయట డస్ట్ బిన్‌లో పడేయొచ్చు. ఇలా ప్రతీ రెండు మూడు నెలలకొకసారి చేస్తూ ఉండాలి.
  • ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇంట్లోని అందరి బాధ్యత. అందుకే ఇంట్లో ఉండే అందరికీ శుభ్రత అలవాట్లు నేర్పాలి. అలాగే పిల్లలకు కూడా పేపర్లు, పుస్తకాలు, పెన్సిళ్లు లాంటివి ఎప్పటికప్పుడు వాళ్ల అల్మరాలో సర్దుకునేలా అలవాటు చేయాలి
First Published:  7 Jan 2021 7:44 AM IST
Next Story