Telugu Global
National

అన్నా డీఎంకే తీరుపై అసంతృప్తి.. కూటమిలో కొనసాగడంపై డీఎండీకే తర్జన భర్జన

ప్రస్తుతం తమిళనాట అధికార అన్నాడీఎంకే వెంట నడుస్తున్న విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై కొత్త ఎత్తులు వేస్తోంది. అధికార పార్టీతో చెలిమి కొనసాగించాలా..? లేక మరో దారి చూసుకోవాలా..? అనే విషయమై తర్జన భర్జనలు పడుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు డీఎండీకే మూడు ఎన్నికలను ఎదుర్కొంది. 2006లో తొలిసారిగా ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో పార్టీ అధినేత విజయకాంత్ మాత్రమే విజయం సాధించారు. ఇతర […]

అన్నా డీఎంకే తీరుపై అసంతృప్తి.. కూటమిలో కొనసాగడంపై డీఎండీకే తర్జన భర్జన
X

ప్రస్తుతం తమిళనాట అధికార అన్నాడీఎంకే వెంట నడుస్తున్న విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై కొత్త ఎత్తులు వేస్తోంది. అధికార పార్టీతో చెలిమి కొనసాగించాలా..? లేక మరో దారి చూసుకోవాలా..? అనే విషయమై తర్జన భర్జనలు పడుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు డీఎండీకే మూడు ఎన్నికలను ఎదుర్కొంది. 2006లో తొలిసారిగా ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో పార్టీ అధినేత విజయకాంత్ మాత్రమే విజయం సాధించారు. ఇతర అభ్యర్థులు ఓటమి పాలవగా.. పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు శాతం ఓట్లు సాధించింది.

ఆ తరువాత అన్నా డీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్న విజయకాంత్ 2011లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా ప్రతిపక్ష స్థానం సాధించారు. ఆ ఎన్నికల్లో అన్నా డీఎంకే, డీఎండీకే జోరుకు కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ఘోర పరాజయం పాలయ్యింది. కరుణానిధి వంటి దిగ్గజ రాజకీయ నేత ఎమ్మెల్యే స్థానానికే పరిమితం కాగా విజయకాంత్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, విజయకాంత్ మధ్య వివాదం తలెత్తడంతో అన్నా డీఎంకే కూటమి నుంచి వైదొలిగారు. 2016లో విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమి ఏర్పాటు చేసి చిన్న పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్ళగా ఘోర పరాజయం పాలయ్యారు.

అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎండీకే తిరిగి అన్నా డీఎంకే మిత్రపక్షంగా మారింది. అయితే సీఎం పళని స్వామి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తమకు ప్రాధాన్యం తగ్గిస్తున్నారని సీట్ల విషయం కూడా ఎటూ తేల్చడం లేదని డీఎండీకే అసంతృప్తితో ఉంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్నా డీఎంకేతో కలసి ఎన్నికల్లో పోటీ చేయాలా.. లేక మరో మార్గం చుసుకోవాలా.. అనే విషయమై డీఎండీకే తర్జన భర్జన పడుతోంది. గత ఎన్నికల సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకనే ఎన్నికల్లో పరాజయం పొందాల్సి వచ్చిందని, ఈ సారి మాత్రం ఎలాగైనా తగినన్ని స్థానాలు పొంది సత్తా చాటాలని డీఎండీకే చూస్తోంది. మూడేళ్ళుగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన విజయకాంత్ ఈ ఎన్నికల్లో ఎలా నెగ్గుకు వస్తారో చూడాల్సి ఉంది.

First Published:  7 Jan 2021 2:29 PM IST
Next Story