Telugu Global
Health & Life Style

టీకా సంస్థలు భాయ్.. భాయ్.. లోగుట్టు కేంద్రానికే ఎరుక..

భారత్ లో టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ నుంచి అనుమతి పొందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న గంటల వ్యవధిలోనే వారిమధ్య సయోధ్య కుదరడం విశేషం. ప్రభుత్వం జోక్యం చేసుకుందో లేక.. పోరు నష్టం, పొందు లాభం అనుకున్నారో ఏమో కానీ.. టీకా పంపిణీలో రెండు కంపెనీలు ఇకపై కలసి పనిచేస్తామంటూ సంయుక్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఈమేరకు సీరం సంస్థ సీఈవో అదార్ పూనావాలా, భారత్ బయోటెక్ […]

టీకా సంస్థలు భాయ్.. భాయ్.. లోగుట్టు కేంద్రానికే ఎరుక..
X

భారత్ లో టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ నుంచి అనుమతి పొందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న గంటల వ్యవధిలోనే వారిమధ్య సయోధ్య కుదరడం విశేషం. ప్రభుత్వం జోక్యం చేసుకుందో లేక.. పోరు నష్టం, పొందు లాభం అనుకున్నారో ఏమో కానీ.. టీకా పంపిణీలో రెండు కంపెనీలు ఇకపై కలసి పనిచేస్తామంటూ సంయుక్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఈమేరకు సీరం సంస్థ సీఈవో అదార్ పూనావాలా, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల పేరుతో ప్రకటన బైటకొచ్చింది.

ప్రజల్ని మోసం చేసినట్టేనా..?
నిన్నగాక మొన్న.. టీకా ప్రయోగాల్లో సీరం సంస్థ నిబంధనలు పాటించలేదని, లండన్లో చేసిన ప్రయోగాల వల్లే వారికి అనుమతి వచ్చిందని, భారత్ లో సరైన సంఖ్యలో వాలంటీర్లు లేరని, కొవిషీల్డ్ టీకాతో 60శాతం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినవారికి పారా సెట్మాల్ వేసి కవర్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు భారత్ బయోటెక్ సీఎండీ. గంటల వ్యవధిలోనే ఆయన మాట మార్చేశారు. గత వారం రోజులుగా రెండు కంపెనీల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలను, సమాచారం లోపంతో ఎదురైన ఇబ్బందులను పూర్తిగా పక్కన పెడుతున్నట్లు చెప్పారు. కొవిడ్‌-19 టీకా తయారీలో రెండు కంపెనీల శ్రమ, సాంకేతిక సత్తాను పరస్పరం గుర్తించి, గౌరవిస్తున్నట్లు తెలిపారు. మనదేశానికి, ప్రపంచ దేశాల ప్రజలకు టీకా అందించాల్సిన బాధ్యతను గుర్తించి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. అంటే ఇప్పటి వరకూ చేసిన ఆరోపణలు తప్పు అని భారత్ బయోటెక్ ఒప్పుకున్నట్టేనా. తప్పుడు ఆరోపణలో ప్రజల్ని ఆ కంపెనీ మోసం చేసినట్టేనా..? కేవలం తమపై వస్తున్న ఆరోపణల్ని కప్పి పుచ్చుకునేందుకే సీరం ఇన్ స్టిట్యూట్ పై భారత్ బయోటెక్ విమర్శలు ఎక్కుపెట్టిందా..? ఈ ప్రశ్నలకు మాత్రం బదులు లేదు.

100 కోట్లమందికి పైగా ఆరోగ్యానికి సంబంధించిన టీకా వ్యవహారంపై చేయాల్సిన ఆరోపణలన్నీ చేసేసి.. చివరకు సమాచార లోపం అనే చిన్న మాటతో సరిపెట్టారు భారత్ బయోటెక్ సీఎండీ. హడావిడిగా కొవాక్సిన్ కి అనుమతిచ్చేసి విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం కూడా ప్రజారోగ్యాన్ని లక్ష్యపెట్టేలా కనిపించడంలేదు. ఓవైపు ప్రతిపక్షాలనుంచి, ప్రజలనుంచి పెద్ద ఎత్తున టీకా సమర్థతపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని తీర్చాల్సిన బాధ్యతని పక్కనపెట్టి తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది కేంద్రం. టీకా వినియోగంలో కాదు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే టీకాకు అనుమతిచ్చిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అనుకూల మీడియాను అడ్డు పెట్టుకుని విమర్శలను ఎదుర్కోవచ్చు కానీ, సోషల్ మీడియా వేదికగా ప్రజలనుంచి వస్తున్న నిరసనలను కేంద్రం తప్పించుకోలేకపోతోంది. ప్రజలలో అపోహలు తొలగించాలంటే.. కొవాక్సిన్ తొలి టీకాని ప్రధాని, ఆ తర్వాత టీకాని అమిత్ షా వేయించుకోవాల్సిందే.

First Published:  5 Jan 2021 10:00 PM GMT
Next Story