ఊపిరితిత్తుల కోసం వ్యాయామాలు
శరీరం ధృఢంగా ఉండడం కోసం ఎన్నో వ్యాయామాలు చేస్తాం. కానీ ఈ టైంలో అన్నింటికంటే హెల్దీగా ఉండాల్సింది ఊపిరితిత్తులు. మరి వాటి కోసం ఎలాంటి వ్యాయామాలు చేస్తున్నారు? ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం కూడా కొన్ని వ్యాయామాలున్నాయన్న సంగతి తెలుసా.. బ్రీతింగ్ ఒక్కటి సరిగ్గా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతోపాటు ఒత్తిడి, యాంగ్జైటీ లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అందుకే రోజువారి వ్యాయామాలతో పాటు కొన్ని శ్వాస వ్యాయామాలు కూడా చేయాలి.ఈ శ్వాస వ్యాయామాల్లో చాలా రకాలున్నాయి. అయితే వీటిలో […]
శరీరం ధృఢంగా ఉండడం కోసం ఎన్నో వ్యాయామాలు చేస్తాం. కానీ ఈ టైంలో అన్నింటికంటే హెల్దీగా ఉండాల్సింది ఊపిరితిత్తులు. మరి వాటి కోసం ఎలాంటి వ్యాయామాలు చేస్తున్నారు? ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం కూడా కొన్ని వ్యాయామాలున్నాయన్న సంగతి తెలుసా..
బ్రీతింగ్ ఒక్కటి సరిగ్గా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతోపాటు ఒత్తిడి, యాంగ్జైటీ లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అందుకే రోజువారి వ్యాయామాలతో పాటు కొన్ని శ్వాస వ్యాయామాలు కూడా చేయాలి.ఈ శ్వాస వ్యాయామాల్లో చాలా రకాలున్నాయి. అయితే వీటిలో ఏవైనా రెండింటిని రోజూ ప్రాక్టీస్ చేస్తే చాలు.
నదీ శోధన ప్రాణాయామం
నదీ శోధన ప్రాణాయామం వలన ఊపిరితిత్తులతో పాటు శరీరంలోని కండరాలకు కూడా శక్తి లభిస్తుంది. ఈ వ్యాయామం చేయడం కోసం ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. తర్వాత మనసుని శ్వాసపై ఉంచాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఫోకస్డ్‌గా గమనిస్తూ ఉండాలి. అలా కొంత సేపు చేసిన తర్వాత ఒక చేతి బొటన వేలు, చూపుడు వేలుతో ముక్కుని మూయాలి. ఇప్పుడు ఒక రంధ్రం నుంచి గాలి తీసుకుంటూ.. రెండో రంధ్రం నుంచి వదులుతూ ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు, వదిలిన తర్వాత కొన్ని సెకన్లపాటు హోల్డ్ చేయాలి ఇలా పది నుంచి పన్నెండు సార్లు చేయాలి
478 విధానం
ఈ వ్యాయామంలో ముందుగా నోటి ద్వారా శ్వాసను బయటకు వదలాలి. తర్వాత నోటిని మూసి, ముక్కు ద్వారా శ్వాస పీల్చుకుంటూ నాలుగు అంకెలు లెక్కపెట్టాలి. తర్వాత శ్వాసను బిగబట్టి ఏడంకెలు లెక్కబెట్టాలి. ఆ తర్వాత ఎనిమిది అంకెలు లెక్కపెడుతూ శ్వాసను నోటి ద్వారా బయటకు వదులాలి. ఈ మొత్తం ప్రాసెస్‌ను మూడు నుంచి ఐదు సార్లు రిపీట్ చేయాలి. ఇలా రోజుకి రెండు సార్లు చేయాలి.
కోబ్రా పోజ్ బ్రీతింగ్
ఈ వ్యాయామం చేసేముందు భుజంగాసనంలో ఉండాలి. నేలపై బోర్లా పడుకుని, చేతులు ఛాతి దగ్గర ఉంచి, నడుము భాగాన్ని పైకి లేపి ఉంచాలి. ఈ పోజ్ లో ఉండి కాసేపు నార్మల్‌గా బ్రీత్ తీసుకుంటూ రిలాక్స్ అవ్వాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ ఛాతి, తలను కిందికి దించి రిలాక్స్ అవ్వాలి. మళ్లీ మెల్లగా శ్వాస తీసుకుంటూ ఛాతిని పైకి లేపాలి. ఇలా ఈ వ్యాయామం మూడు సార్లు చేయొచ్చు. ఈ వ్యాయామం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
బెల్లీ బ్రీతింగ్
పొట్టతో శ్వాస తీసుకునే విధానాన్ని బెల్లీ బ్రీతింగ్ లేదా డయాఫ్రాం బ్రీతింగ్ అంటారు. ఈ వ్యాయామం కోసం నిటారుగా కూర్చోవాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ గాలితో పొట్ట నింపాలి. ఆ తర్వాత గాలిని బలంగా బయటకు వదలాలి. ఇలా చేసినప్పుడ పొట్ట ఒక్కసారిగా లోపలికి వెళ్లాలి. ఇలా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాసతో పాటే పొట్టకూడా లోపలికి బయటకు కదులుతుండాలి. ఈ వ్యాయామం చేయడం కుదరకపోతే కడుపు నొప్పి రావొచ్చు. అందుకే మెల్లగా ప్రాక్టీస్ చేయాలి.
శ్వాస వ్యాయామాలు ఏవైనా నిటారుగా కూర్చుని ఎలాంటి రొప్పు, ఆయాసం లేకుండా ఉన్నప్పుడు చేయాలి. వ్యాయామం చేయడం వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే వ్యాయామాన్ని ఆపి రిలాక్స్ అవ్వాలి. ఈ వ్యాయామాలాన్ని మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తొందరపడకూడదు