Telugu Global
National

విగ్రహాల విధ్వంసం.. కేరాఫ్ తిరుపతి ఉప ఎన్నిక..

విగ్రహాల విధ్వంసాన్ని ఆపలేకపోతోందంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలన్నీ పనిలో పనిగా తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీకి బుద్ధి చెప్పాలంటూ మరో వాదన తెరపైకి తెస్తున్నాయి. ఇన్నాళ్లూ.. తిరుపతి బై పోల్ కోసం సరైన పాయింట్ దొరక్క అవస్థ పడుతున్న ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా విగ్రహాల వివాదాలను నెత్తి కెత్తుకున్నాయి. ఈ వ్యవహారం ఏ మలుపు తిరిగి ఎవరు దోషులుగా బైటపడ్డా.. ప్రస్తుతానికి ప్రభుత్వంపై బురదజల్లేందుకు, పనిలో పనిగా తిరుపతి ఉప ఎన్నికలకు ముందస్తు ప్రచారం […]

విగ్రహాల విధ్వంసం.. కేరాఫ్ తిరుపతి ఉప ఎన్నిక..
X

విగ్రహాల విధ్వంసాన్ని ఆపలేకపోతోందంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలన్నీ పనిలో పనిగా తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీకి బుద్ధి చెప్పాలంటూ మరో వాదన తెరపైకి తెస్తున్నాయి. ఇన్నాళ్లూ.. తిరుపతి బై పోల్ కోసం సరైన పాయింట్ దొరక్క అవస్థ పడుతున్న ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా విగ్రహాల వివాదాలను నెత్తి కెత్తుకున్నాయి. ఈ వ్యవహారం ఏ మలుపు తిరిగి ఎవరు దోషులుగా బైటపడ్డా.. ప్రస్తుతానికి ప్రభుత్వంపై బురదజల్లేందుకు, పనిలో పనిగా తిరుపతి ఉప ఎన్నికలకు ముందస్తు ప్రచారం చేసుకోడానికి దీన్ని బాగా వాడుకుంటున్నాయి. ఎప్పుడూ లేనిది చంద్రబాబు నుదుటిన బొట్టు పెట్టుకుని విజయనగరంలో హడావిడి చేసింది కూడా ఈ ప్రచారంలో భాగమేనని అర్థమవుతోంది. ఈ వ్యవహారాన్ని కేవలం విజయనగరానికే పరిమితం చేయకుండా.. రాష్ట్రవ్యాప్తంగా హిందువుల మనోభావాలు రెచ్చగొడుతూ, రోజూ ఏదో ఒక మారుమూల జరిగిన చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపుతూ నిత్యాగ్నిహోత్రంలా అగ్గి చల్లారకుండా చూస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల వరకూ ఈ వేడి కంటిన్యూ చేయాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది ప్రతిపక్షాల ఆలోచనగా తెలుస్తోంది. బీజేపీ నేతల సహనాన్ని పరీక్షించొద్దు అంటూ తెలంగాణ గడ్డపైనుంచి ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసిరిన తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా.. తిరుపతి ఉప ఎన్నికలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలని, తద్వారా హిందవుల ఐక్యత చాటి చెప్పాలన్నారు. అంటే ఓ వ్యూహం ప్రకారం ప్రతిపక్ష పార్టీలన్నీ.. ఉప ఎన్నికల వైపుకి ఈ వ్యవహారాన్ని లాక్కొస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ లేనిది పవన్ కల్యాణ్ కూడా హిందూ తత్వాన్ని అంత ఇదిగా భుజానికెత్తుకోవడం, ఉప ఎన్నికలకోసమేనంటున్నారు అధికార పక్షం నేతలు.

అయితే ప్రతిపక్షాలు ఊహించినట్టు తిరుపతి ఉప ఎన్నికల్లో మతాల ప్రస్తావన ఎందుకొస్తుందనేదే అనుమానం. తిరుపతికి టెంపుల్ సిటీ గా పేరున్నా.. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే వారంతా హిందువులు కారు. అలాగని మతం పేరు చెబితే రెచ్చిపోయి, బొట్టు పెట్టుకుని ప్రచారానికి వస్తే కరిగిపోయి.. వన్ సైడ్ గా కమలం పువ్వుకి పట్టం కట్టే ఉత్తరాది వ్యవహారం ఇక్కడ లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎంని బూచిగా చూపి, కేసీఆర్, అసదుద్దీన్ ఎప్పటికైనా ఒకటేననే.. భావనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలికారు కాబట్టే.. హిందూ వర్గం ఓట్లు బీజేపీకి కలిసొచ్చాయని అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఏపీ ప్రజలు ఇంకా మత రాజకీయాల స్థాయికి దిగజారలేదు. వారినలా దిగజార్చాలనుకుంటున్న పార్టీల పప్పులు ఇప్పుడల్లా ఇక్కడ ఉడకవు. అందులోనూ ఉప ఎన్నికల ఓటింగ్ నాటికి.. విగ్రహాల ఆగ్రహాలు, ఆవేశాలు పూర్తిగా చల్లారి చప్పబడిపోతాయనడంలో సందేహం లేదు.

First Published:  6 Jan 2021 3:19 AM IST
Next Story