Telugu Global
National

ఆశకు పోయి అరెస్టయిన అఖిలప్రియ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. హఫీజ్‌పేట్‌లోని ఓ భూ తగాదాయే కిడ్నాప్ కి ప్రధానకారణంగా పోలీసులు గుర్తించారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ప్రమేయమున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అఖిల ప్రియ అరెస్టుతో కిడ్నాప్ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. గురువారం రాత్రి కేసీఆర్ బంధువులు ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఐటీ అధికారులమంటూ […]

ఆశకు పోయి అరెస్టయిన అఖిలప్రియ
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. హఫీజ్‌పేట్‌లోని ఓ భూ తగాదాయే కిడ్నాప్ కి ప్రధానకారణంగా పోలీసులు గుర్తించారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ప్రమేయమున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అఖిల ప్రియ అరెస్టుతో కిడ్నాప్ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది.

గురువారం రాత్రి కేసీఆర్ బంధువులు ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి వచ్చిన వారు బలవంతంగా వారిని తీసుకెళ్లారు. ఐటీ అధికారులమని చెప్పిన కిడ్నాపర్లు ఇంట్లోని విలువైన పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు కూడా తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన వాహనాలను గుర్తించారు. ఈ లోగా నార్సింగి సమీపంలో కిడ్నాపర్లు ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను వదిలివేయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

హఫీజ్‌పేటలోని 50 ఏకరాల భూ వివాదమే కిడ్నాప్ కి కారణమని బాధితులు అంటున్నారు. వంద కోట్ల విలువ చేసే ఈ భూమి విషయంలో భూమా కుటుంబం గతంలో కూడా బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. కాగా… కిడ్నాప్ కేసులో పోలీసులు ఇప్పటికే 8మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అఖిల ప్రియ భర్త భార్గవరామ్ సోదరుడు చంద్రబోస్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియ ప్రమేయంపై పోలీసులు ఫోకస్ పెట్టారు.

భూమా అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి కాలం నుంచే హఫీజ్‌పేటలోని భూమి విషయంలో తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. బాధితులు ప్రవీణ్ రావు, అతడి సోదరులు నవీన్ రావు, సునీల్ రావు మాత్రం ఆ భూవివాదంలో తమకెలాంటి ప్రమేయం లేదంటున్నారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, అఖిల ప్రియ తన భాగస్వాములతో తేల్చుకోవల్సింది పోయి తమని టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. కేసు దర్యాప్తులో భాగంగా కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిల ప్రియను అరెస్టు చేసిన పోలీసులు
విచారణ కోసం బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

భూమా అఖిల ప్రియ, ఆమె భర్త గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అఖిల ప్రియ దంపతులు తనను చంపడానికి ప్రయత్నించారంటూ ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి గతంలో ఆరోపించారు. అందుకోసం కోటి రూపాయలతో సుపారీ మాట్లాడుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా కిడ్నాప్ కేసులో అఖిల పేరు బయటపడడంతో ఆమె రాజకీయంగా మరింత అప్రతిష్టను ప్రోదిచేసుకున్నట్లయ్యింది.

First Published:  6 Jan 2021 10:48 AM IST
Next Story