Telugu Global
Business

రైతు ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరవుతున్న రిలయెన్స్

రైతు ఉద్యమంపై కార్పోరేట్ కంపెనీల ఎదురుదాడి మొదలైంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన అవిరామంగా కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఎండా, వానా, చలిని కూడా లెక్కచేయకుండా లక్షలాది మంది రైతులు నెల రోజులకు పైగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతూనే మరోవైపు కార్పోరేట్ సంస్థల ఉత్పత్తుల బహిష్కరణకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ […]

రైతు ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరవుతున్న రిలయెన్స్
X

రైతు ఉద్యమంపై కార్పోరేట్ కంపెనీల ఎదురుదాడి మొదలైంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన అవిరామంగా కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఎండా, వానా, చలిని కూడా లెక్కచేయకుండా లక్షలాది మంది రైతులు నెల రోజులకు పైగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతూనే మరోవైపు కార్పోరేట్ సంస్థల ఉత్పత్తుల బహిష్కరణకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యారా రాష్ట్రాల్లో రిలయెన్స్ టెలికాం సంస్థకు చేదు అనుభవం ఎదురవుతోంది. ఇప్పటికే 1500కు పైగా జియో టవర్లను రైతులు ధ్వంసం చేశారు. దీంతో రిలయెన్స్ గ్రూప్ కోర్టును ఆశ్రయించింది.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ పంజాబ్, హర్యానా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కొందరు జియోకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ, జియో టవర్లపై దాడులకు ప్రేరేపిస్తున్నారని పిటిషన్ లో పేర్కొంది. ఈ దాడులపై దర్యాప్తు జరిపించి, వాటి వెనక గల స్వార్థ శక్తులను గుర్తించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరింది. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునే చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరింది.

వ్యవసాయ చట్టాలు అంబానీ, అదానీ లాంటి బడా కార్పోరేట్లకే మేలు చేస్తాయని ఆరోపిస్తున్న రైతులు రిలయెన్స్, అదానీ గ్రూప్ ఉత్పత్తుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రిలయెన్స్ ప్రెష్, రిలయెన్స్ డిజిటల్ తో పాటు జియో టెలికాం సేవలకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో తమకు వ్యతిరకంగా కుట్ర జరుగుతోందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారంటూ కోర్టు మెట్లెక్కింది రిలయెన్స్. రైతుల ఆందోళనను అడ్డుపెట్టుకొని తమ సంస్థలపై దాడులు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

రైతు ఉద్యమం నేపథ్యంలో రిలయెన్స్ సంస్థ ఇప్పటికే స్వరాన్ని మార్చింది. తనను తాను జాతీయవాదానికి ప్రతీకగా చెప్పుకునే ప్రయత్నం ఆరంభించింది. ఆత్మనిర్భర్ భారత్ కి అనుగుణంగా ఉత్పత్తులను రూపొందిస్తున్నామని, తాము మాత్రమే చైనా పరికరాలని వాడకుండా టెలికాం సేవలందిస్తున్నామని ప్రకటించింది. అలాంటి తమ సంస్థపై కొందరు కావాలని దాడులు చేస్తున్నారని ఆరోపించింది. కార్పొరేట్ ఫార్మింగ్ పై తమకు ఆసక్తి లేదని తెలిపింది.

రైతు ఉద్యమం నేపథ్యంలో మార్కెట్ లో తమకు పోటీగా భావిస్తున్న ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలపై కేంద్ర టెలికాం విభాగం, టెలికామ్ రెగ్యులేటర్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. తమ వినియోగదారులను ఎయిర్ టెల్, వొడాఫోన్-ఇండియా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. భారీ సంఖ్యలో మొబైల్ పోర్టబులిటీకి యత్నిస్తున్నాయని పేర్కొంది. ఇప్పుడు నేరుగా దాడులపై కోర్టునే ఆశ్రయించింది. మొత్తానికి రైతు ఉద్యమం కార్పోరేట్ శక్తులకు గట్టి చురకనే అంటిస్తోంది. అటు కార్పోరేట్ శక్తుల మధ్య పోరు, ఇటు ప్రజల నుంచి తిరస్కరణ ఏకకాలంలో మొదలయ్యాయి. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

First Published:  5 Jan 2021 6:08 AM IST
Next Story