Telugu Global
Health & Life Style

టీకా కొట్లాటలోకి కార్పొరేట్ కంపెనీలు..

అనుకున్నంతా అయింది.. మా టీకా గొప్పదంటే మా టీకాయే గొప్పదంటూ గొడవ మొదలైంది. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాక్సిన్ కి మూడోదశ ప్రయోగాలు పూర్తి కాకముందే అనుమతులివ్వడంతో దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. దీంతో అసలు గొడవ మొదలైంది. కొవాక్సిన్ గొప్పదనాన్ని చెప్పుకోడానికి రంగంలోకి దిగిన భారత్ బయోటెక్ పరిధి మించి మాట్లాడటమే ఇప్పుడు సంచలనంగా మారింది. తమ టీకా సురక్షితం అని చెప్పుకునే క్రమంలో కొవిషీల్డ్ టీకాపై భారత్ బయోటెక్ యాజమాన్యం విమర్శలు చేయడమే ఇక్కడ […]

టీకా కొట్లాటలోకి కార్పొరేట్ కంపెనీలు..
X

అనుకున్నంతా అయింది.. మా టీకా గొప్పదంటే మా టీకాయే గొప్పదంటూ గొడవ మొదలైంది. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాక్సిన్ కి మూడోదశ ప్రయోగాలు పూర్తి కాకముందే అనుమతులివ్వడంతో దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. దీంతో అసలు గొడవ మొదలైంది. కొవాక్సిన్ గొప్పదనాన్ని చెప్పుకోడానికి రంగంలోకి దిగిన భారత్ బయోటెక్ పరిధి మించి మాట్లాడటమే ఇప్పుడు సంచలనంగా మారింది. తమ టీకా సురక్షితం అని చెప్పుకునే క్రమంలో కొవిషీల్డ్ టీకాపై భారత్ బయోటెక్ యాజమాన్యం విమర్శలు చేయడమే ఇక్కడ కొస మెరుపు.

భారత్ బయోటెక్ కంపెనీ 26వేలమందిపై ప్రయోగాలు చేసిందని, కొవిషీల్డ్ టీకాను తయారు చేస్తున్న కంపెనీ భారత్ లో కేవలం 100మందిపైనే ప్రయోగాలు చేసిందని విమర్శలకు దిగారు. బ్రిటన్‌లో జరిగిన పరీక్షల ఆధారంగా, మనదేశంలో అనుమతులిచ్చారని అంటున్నారు భారత్ బయోటెక్ ప్రతినిధులు. భారత్ బయోటెక్ టీకా వల్ల సైడె ఎఫెక్ట్స్ 10శాతం లోపేనని, కొవిషీల్డ్ వల్ల 60శాతం మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కలిగాయని కూడా తీవ్ర విమర్శలు చేశారు. వాలంటీర్లలో దుష్ఫలితాలు బైటపడకుండా వారికి పారాసెట్మాల్ ఇచ్చారని కూడా అంటున్నారు.అయితే అంతర్జాతీయ నిపుణులు వీటిని అర్థంలేని ఆరోపణలుగా కొట్టి పారేస్తున్నారు. ఇన్ని విషయాలు తెలిస్తే.. ముందుగా ఎందుకు చెప్పలేదని, వివాదం వచ్చినప్పుడే తమ తప్పులు కప్పిపుచ్చుకోడానికి భారత్ బయోటెక్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందనే వారు కూడా ఉన్నారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా తయారు చేసిన కొవిషీల్డ్ టీకా సమర్థతను ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు గుర్తించాయి. మనకంటే ముందుగా బ్రిటన్ లో అనుమతి లభించింది. అంతే కాకుండా.. దీనిని నిల్వ చేయడానికి అతిశీతల ఉష్ణోగ్రతలు అవసరం లేకపోవడం మరో అనుకూలత. అందుకే అన్ని ప్రయోగ దశలుదాటుకున్న కొవిషీల్డ్ కి భారత నిపుణుల బృందం తొలుత అనుమతులిచ్చింది. అయితే అనుకోకుండా కొవాక్సిన్ తెరపైకి రావడం, రెండిటికీ కలిపి ఒకేసారి డీసీజీఐ అనుమతులిచ్చేయడంతో వివాదం మొదలైంది. మూడో దశ ప్రయోగాలలో ఉన్న కొవాక్సిన్ సామర్థ్యంపై ప్రతిపక్ష పార్టీలు సహా సామాన్య జనం కూడా సందేహం వెలిబుచ్చుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలే దీనికి తార్కాణం. అయితే ప్రభుత్వం మాత్రం తన చర్యలను సమర్థించుకుంటోంది. మరోవైపు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ భారత్ బయోటెక్ రంగంలోకి దిగడం, దీనికి ఓ వర్గం మీడియా వత్తాసు పలకడం విశేషం.

మొత్తమ్మీద నిన్న మొన్నటి వరకు రాజకీయ పార్టీల మధ్యే ఉన్న విమర్శలు.. సామాన్య జనంలోకి రావడం, ఇప్పుడు ఏకంగా కంపెనీలే రంగంలోకి దిగడంతో.. డీసీజీఐ అనుమతులు ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తోంది. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ టీకాపై భారత్ బయోటెక్ విమర్శలు గుప్పిస్తున్నా.. ఆ సంస్థ తరపున ఇంకా ఎవరూ స్పందించలేదు. మొత్తమ్మీద టీకా కంపెనీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First Published:  5 Jan 2021 6:15 AM IST
Next Story