నేను లైలా.. వాళ్లు మజ్నూలు.. ఒవైసీ వెస్ట్ బెంగాల్ లవ్ స్టోరీ
సీరియస్ గా సాగుతున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల రాజకీయాలను.. లైలా జోక్ తో కూల్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. తాను జానపద కథల్లో లైలా లాంటి వాడిననని.. తనను ఇష్టపడే మజ్నూలు చాలామందే ఉంటారని, అలాంటి మజ్నూలంతా తన ప్రయత్నాలతో లాభపడాలని చూస్తుంటారని, దానికి లైలా ఎలా బాధ్యురాలవుతుందని అన్నారు. బీజేపీ బీ-టీమ్ అంటూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చేస్తున్న విమర్శలను అసదుద్దీన్ తిప్పి కొట్టారు. బీహార్ ఫలితాలను బెంగాల్ లో రిపీట్ చేస్తామని […]
సీరియస్ గా సాగుతున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల రాజకీయాలను.. లైలా జోక్ తో కూల్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. తాను జానపద కథల్లో లైలా లాంటి వాడిననని.. తనను ఇష్టపడే మజ్నూలు చాలామందే ఉంటారని, అలాంటి మజ్నూలంతా తన ప్రయత్నాలతో లాభపడాలని చూస్తుంటారని, దానికి లైలా ఎలా బాధ్యురాలవుతుందని అన్నారు. బీజేపీ బీ-టీమ్ అంటూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చేస్తున్న విమర్శలను అసదుద్దీన్ తిప్పి కొట్టారు. బీహార్ ఫలితాలను బెంగాల్ లో రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బెంగాల్ లో ఎంఐఎం అధినేత రహస్య పర్యటన..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు వస్తేనే.. పశ్చిమ బెంగాల్ లో చేదు అనుభవం ఎదురైంది. అలాంటిది.. తమ బంగారు పుట్టలో వేలు పెట్టేందుకు ఎంఐఎం వస్తుందంటే.. తృణమూల్ నేతలు ఊరుకుంటారా..? అందుకే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రహస్యంగా బెంగాల్ లో పర్యటించి వచ్చారు. అక్కడి ముస్లిం మతనేత అబ్బాస్ సిద్ధిఖీతో భేటీ అయ్యారు అసదుద్దీన్. బెంగాల్ లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న 30శాతం ముస్లిం ఓట్లలో చీలిక లేకుండా చూడాలని, ఎంఐఎంతో కలసి పనిచేయాలని ఆయనను కోరారు. ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు ముగిశాయని బెంగాల్ ఎంఐఎం నేతలు చెబుతున్నారు.
బెంగాల్ పై బీహార్ ఎఫెక్ట్..
ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో.. లోక్ జనశక్తి పార్టీ పుంజుకుంటుందని, బీజేపీ ప్లాన్ బి అదేనని అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎంఐఎం ఐదు అసెంబ్లీ సీట్లు ఎగరేసుకుపోయింది. సంకీర్ణ కొట్లాటల్లో ఈ ఐదు సీట్లు ఎంతకీలకం అనేది బీజేపీకి బాగా తెలుసు. ఇప్పుడు బెంగాల్ లో కూడా ఎంఐఎం అడుగు పెట్టడానికి ఇదే కారణం. 294 అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్ కి 211 మంది ఎమ్మెల్యేలున్నారు. 44 స్థానాలతో కాంగ్రెస్ రెండో అతి పెద్ద పార్టీగా ఉంది. బీజేపీ బలం అక్కడ కేవలం 3 సీట్లు మూత్రమే. అలాంటి బెంగాల్ లో ఏకపక్షంగా అధికారం చేజిక్కించుకోవడం బీజేపీకి అసాధ్యం. అందుకే వీలైనంత మేర మమత ఓటు బ్యాంకులో చీలికలు తేవాలనేది కమలదళం ప్లాన్. బీజేపీ ప్లాన్ తోటే ఎంఐఎం బెంగాల్ లో అడుగు పెడుతుందని చెప్పలేం కానీ.. అసద్ రాక పరోక్షంగా బీజేపీకి లాభదాయకమనే విషయం మాత్రం స్పష్టం. అందుకే బెంగాల్ సీఎం మమత, ఎంఐఎం రాకతో అంతగా ఇదైపోతున్నారు. బీజేపీ, ఎంఐఎం కుమ్మక్కయ్యారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా ఇదేరకమైన ఆరోపణలు చేస్తోంది. బీజేపీ మాత్రం తమకు బీ టీమ్, సీ టీమ్ అవసరం లేదని.. సొంతంగా అధికారంలోకి వస్తామని సవాళ్లు విసురుతోంది. మొత్తమ్మీద ఎంఐఎం రాకతో.. పశ్చిమ బెంగాల్ రాజకీయం మరో మలుపు తిరిగినట్టయింది.