Telugu Global
International

ఆక్స్ ఫర్డ్ టీకాకు భారత నిపుణుల బృందం అనుమతి

నూతన సంవత్సరం తొలి రోజున.. భారత్ లో కొవిడ్ టీకా పంపిణీపై తొలి అడుగు పడింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభిస్తే ఆక్స్ ఫర్డ్ తయారీ కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను పంపిణీ చేయడానికి మార్గం సుగమం అయినట్టే. ఈమేరకు భారత ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం కొవిషీల్డ్ టీకా పేరుని డీసీజీఐ అనుమతికోసం ప్రతిపాదించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ సంయుక్తంగా డెవలప్ చేసిన ఈ టీకాను సీరమ్ […]

ఆక్స్ ఫర్డ్ టీకాకు భారత నిపుణుల బృందం అనుమతి
X

నూతన సంవత్సరం తొలి రోజున.. భారత్ లో కొవిడ్ టీకా పంపిణీపై తొలి అడుగు పడింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభిస్తే ఆక్స్ ఫర్డ్ తయారీ కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను పంపిణీ చేయడానికి మార్గం సుగమం అయినట్టే. ఈమేరకు భారత ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం కొవిషీల్డ్ టీకా పేరుని డీసీజీఐ అనుమతికోసం ప్రతిపాదించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ సంయుక్తంగా డెవలప్ చేసిన ఈ టీకాను సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్ లో తయారు చేస్తోంది. చివరి దశ అనుమతులు లభిస్తే.. కరోనాపై భారత్ ప్రయోగించే తొలి అస్త్రం కొవిషీల్డ్ టీకానే కావొచ్చు.

ఆక్స్ ఫర్డ్ టీకాయే ఎందుకు..?
ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థలు కరోనా టీకాను తయారు చేస్తున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాక్సిన్ ఇందులో ఒకటి. పైగా ఈ వ్యాక్సిన్ తయారీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా భాగస్వామి కావడం విశేషం. అయితే ప్రస్తుతం కొవాక్సిన్ తుది దశ ప్రయోగాల్లో ఉంది. ఇవి పూర్తయిన తర్వాత టీకా మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఫైజర్ కంపెనీ తయారు చేస్తున్న టీకా.. భారత నిపుణుల బృందానికి పూర్తి సమాచారం ఇవ్వడానికి మరికొంత గడువు కోరింది. ఈ నేపథ్యంలో 5కోట్ల టీకా డోసులు పంపిణీకి సిద్ధం చేసుకుంటున్న ఆక్స్ ఫర్డ్ తయారీ కొవిషీల్డ్ వ్యాక్సిన్ వైపే భారత నిపుణుల బృందం మొగ్గు చూపింది.

ఆక్స్ ఫర్డ్ టీకా ప్రత్యేకత ఏంటి..?
మిగతా అన్ని టీకాల మాదిరిగానే ఇది కూడా రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం 5కోట్ల డోసుల్ని సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేసింది. మార్చి నాటికి మరో 10కోట్ల డోసుల తయారీకి సన్నాహాలు చేసుకుంటున్నట్టు సీరం ఇన్ స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అదార్ పూనావాలా తెలిపారు. మిగతా టీకాలతో పోల్చి చూస్తే దీని రవాణాకు ఎక్కువ ప్రయాసపడక్కర్లేదు. కొవిషీల్డ్ నిల్వకోసం అత్యంత శీతల వాతావరణం అవసరం లేదు. సాధారణంగా టీకాలను భద్రపరిచే శీతల పరిస్థితుల్లో కూడా కొవిషీల్డ్ నిల్వ చేయవచ్చు. బ్రిటన్ ప్రభుత్వం కూడా ఫైజర్ తోపాటు, కొవిషీల్డ్ టీకాకు అనుమతి ఇచ్చింది.

ఎప్పటినుంచి పంపిణీ..?
వ్యాక్సినేషన్ పై కేంద్రం పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన నేపథ్యంలో ఈ నెలాఖరులోగా భారత్ లో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డ్రైరన్ ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో మొదలైంది. ప్రయోగాత్మకంగా దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ మొదలు పెట్టగా.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ముందస్తు ట్రయల్స్ జరుగుతున్నాయి. డీసీజీఐ అనుమతి వచ్చిన వెంటనే కేంద్రం సదరు కంపెనీతో ఒప్పందం పూర్తి చేసుకుని టీకా కొనుగోలు చేస్తుంది. ఆ వెంటనే టీకా పంపిణీ ఏర్పాట్లు మొదలవుతాయి. కేంద్రం ఇచ్చిన సూచనలతో గతంలోనే వివిధ రాష్ట్రాలు టీకా పంపిణీ ప్రక్రియకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నాయి. తొలి దశలో ఎవరెవరికి టీకాలు ఇవ్వాలి, ఎవరి ద్వారా టీకాలు వేయించాలి అనే విషయంపై పక్కా ప్రణాళికతో ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే భారత్ లో మరికొన్ని రోజుల వ్యవధిలోనే టీకా పంపిణీ మొదలవుతుంది.

First Published:  2 Jan 2021 2:21 AM IST
Next Story