బాబు, పవన్... వేర్వేరు కాదంటున్న వైసీపీ...
చంద్రబాబుతో పొత్తు బంధాన్ని చాన్నాళ్ల క్రితమే తెంచేసుకున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. బీజేపీ, జనసేన మధ్య పాత స్నేహం చిగురించింది కానీ.. ఆ కూటమిలోకి బాబుని రానివ్వకుండా జాగ్రత్తపడ్డారు. టీడీపీకి అసలైన ప్రత్యామ్నాయం మేమేనంటూ చెప్పుకుంటారు ఇరు పార్టీల నేతలు. కానీ వైసీపీ మాత్రం పవన్ ని ఇంకా చంద్రబాబు ప్రతినిధిగానే భావిస్తోంది. రాష్ట్ర మంత్రులు నానీలపై ఇటీవల పవన్ వ్యంగ్యాస్త్రాలకు కాస్త గట్టిగానే కౌంటర్లు పడ్డాయి. కొడాలి నాని, వకీల్ సాబ్ కి కొత్త నిర్వచనం […]
చంద్రబాబుతో పొత్తు బంధాన్ని చాన్నాళ్ల క్రితమే తెంచేసుకున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. బీజేపీ, జనసేన మధ్య పాత స్నేహం చిగురించింది కానీ.. ఆ కూటమిలోకి బాబుని రానివ్వకుండా జాగ్రత్తపడ్డారు. టీడీపీకి అసలైన ప్రత్యామ్నాయం మేమేనంటూ చెప్పుకుంటారు ఇరు పార్టీల నేతలు. కానీ వైసీపీ మాత్రం పవన్ ని ఇంకా చంద్రబాబు ప్రతినిధిగానే భావిస్తోంది.
రాష్ట్ర మంత్రులు నానీలపై ఇటీవల పవన్ వ్యంగ్యాస్త్రాలకు కాస్త గట్టిగానే కౌంటర్లు పడ్డాయి. కొడాలి నాని, వకీల్ సాబ్ కి కొత్త నిర్వచనం ఇవ్వగా, పేర్ని నాని చిడతల నాయుడంటూ మరింత పరుషంగా బదులిచ్చారు. మరో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఎనీ సెంటర్ చర్చలకు సిద్ధం అంటూ పవన్ కి సవాల్ విసిరారు. సినిమాల్లో వకీల్ సాబ్, బైట పకీర్ సాబ్ అంటూ.. మంత్రి వెల్లంపల్లి కూడా ఘాటుగా బదులిచ్చారు.
సీఎం జగన్ కూడా పవన్ కల్యాణ్ విమర్శలపై స్పందించడం విశేషం. అయితే వైసీపీ రియాక్షన్ లో ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది. మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా పవన్ పేరు ప్రస్తావిస్తూనే పనిలో పనిగా చంద్రబాబుని కూడా సీన్ లోకి తెచ్చారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే పవన్ ఇలా మాట్లాడుతున్నారంటూ తేల్చేశారు. పళ్లు ఇచ్చే చెట్లపైనే రాళ్లు వేస్తున్నారని, ఏనాడూ రైతులను పట్టించుకోని చంద్రబాబు తాము సాయంచేస్తున్నట్టు ప్రకటించగానే తన పుత్రుడిని, దత్త పుత్రుడిని రంగంలోకి దించుతున్నారని అన్నారు.
చంద్రబాబు నీడనుంచి బైటకు రావాలని, ఎవరితో సంబంధం లేకుండా జనసేనకు ప్రత్యేక పార్టీగా గుర్తింపు తేవాలని పవన్ కల్యాణ్ ఎంతగా ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడటంలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని ఒకే గాటన కట్టేస్తూ.. సందర్భం వచ్చినప్పుడల్లా వారిద్దరికీ కలిపి వార్నింగ్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. తనని తాను ఎంతగా హైలెట్ చేసుకోవాలని చూస్తున్నా పవన్ కి సాధ్యపడటంలేదు.
జనసేనానిని బాబు ఏజెంట్ గానే భావిస్తూ, అదే పేరుతో విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఒకరకంగా పవన్ పై వైసీపీ మైండ్ గేమ్ ఇది. చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రశ్నించకుండా సైలెంట్ గా ఉండి, వైసీపీ అధికారంలోకి రాగానే జనసేనాని ప్రశ్నల వర్షం కురిపించడమే దీనికి కారణం. అప్పుడు లేవని నోరు, ఇప్పుడు లేస్తుండే సరికి.. వైసీపీ నేతలు పవన్ పై దత్తపుత్రుడనే ముద్రను బలంగా వేస్తున్నారు.