పేరుకు తగ్గ సినిమా ‘గువ్వ గోరింక’
సినిమా : గువ్వ గోరింక రేటింగ్ : 3/5. బ్యానర్ : ఆకార్ మూవీస్ తారాగణం : సత్యదేవ్ , ప్రియాలాల్ ,ప్రియదర్శి, చైతన్య, ప్రభాకర్, ఫిష్ వెంకట్ తదితరులు సంగీతం : సురేష్ బొబ్బిలి కెమెరా : మైలేసం రంగస్వామి ఎడిటింగ్ : ప్రణవ్ మిస్త్రీ నిర్మాతలు : దామూరెడ్డి కొసనం, జీవన్ రెడ్డి రచన , దర్శకత్వం : మోహన్ బమ్మిడి విడుదల : డిసెంబర్ 17, అమెజాన్ ప్రైమ్ ప్రేమకు ఎన్నో నిర్వచనాలు. […]
సినిమా : గువ్వ గోరింక
రేటింగ్ : 3/5.
బ్యానర్ : ఆకార్ మూవీస్
తారాగణం : సత్యదేవ్ , ప్రియాలాల్ ,ప్రియదర్శి, చైతన్య, ప్రభాకర్, ఫిష్ వెంకట్ తదితరులు
సంగీతం : సురేష్ బొబ్బిలి
కెమెరా : మైలేసం రంగస్వామి
ఎడిటింగ్ : ప్రణవ్ మిస్త్రీ
నిర్మాతలు : దామూరెడ్డి కొసనం, జీవన్ రెడ్డి
రచన , దర్శకత్వం : మోహన్ బమ్మిడి
విడుదల : డిసెంబర్ 17, అమెజాన్ ప్రైమ్
ప్రేమకు ఎన్నో నిర్వచనాలు. సినిమా ప్రేమంటే అమ్మాయి వెనుక అబ్బాయి పడడం- హీరోయిజం చూపించడం- ఇంప్రెస్ చెయ్యడం- మొత్తానికి ఏదోలా ఎలాగోలా పడెయ్యడం. లేదూ అమ్మాయి చాలా క్యూట్‌గా స్పెషల్‌గా క్లవర్‌గా వుండి మనాడి మనసు దోచెయ్యడం. ఇద్దరూ తంటాలు పడి ఒక్కటవుదామంటే కాదూ కూడదూ అని ఇక పెద్దవాళ్ళు కులమో మతమో వర్గమో అంతస్తో చెప్పి అడ్డుపడడం. కాదని వీళ్ళు కథాఖరికి ఒక్కటి కావడం. ఇదీ మన తెలుగు సినిమా! ఇదివరకటి తెలుగు సినిమా!
ఇప్పుడు పాత గీతల్ని చెరిపేసుకొని కొత్త అంశాలని కొత్త దర్శకులు పట్టుకొని ముందుకు వస్తూ ఆశావహంగా నిలుస్తున్నారు. అలాంటి ఆశను కలిగిస్తూ వచ్చిందే గువ్వ గోరింక.
ప్రేమంటే లవ్ ఎట్ ఫస్ట్ కాదు. ఎట్రాక్షన్ కాదు అని ఆలోచనని రేకెత్తించే కొత్త ప్రేమ కథ ఇది. చూసుకోకుండా ప్రేమలో పడడం ఎలా? చూసుకుంటే మాత్రం ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుస్తుందా? డేటింగ్‌లు జడ్జ్ చెయ్యగలుగుతున్నాయా? సహజీవనం సాఫీగా సాగుతోందా? అసలీ బంధాలన్నీ ట్రాషా? ఇలా ఎన్నో ప్రశ్నల్నీ జవాబుల్నీ జీవితంలోంచి ఇంకా చెప్పాలంటే కొత్తతరం ఆలోచనలలోంచి మలచిన కథ.
గువ్వ గోరింక భిన్న జాతులు. ఇక్కడ కూడా భిన్న తత్వాలు. ఏకత్వం ఎలా కుదిరింది? పైగా కథానాయిక శిరీషా (ప్రియాలాల్) కు సంగీతం అంటే మక్కువ. అసలు సంగీతమే కాదు శబ్దం అంటేనే గిట్టని కథానాయకుడు సదానంద్ (సత్యదేవ్). భిన్న ధ్రువాలు వికర్షించుకున్నట్టే ఇద్దరూ వికర్షించుకొని ఆకర్షించుకున్నారు. అయితే వాళ్ళు తమ తమ సమస్యలని పరిష్కరించుకొనే క్రమంలో వారి వారి లోపాలను అంటే బలహీనతలతో ఒకరికి ఒకరు అర్థం అవుతారు. బలం కన్నా బలహీనతని బయట పెట్టుకుంటారు. అది పోగొట్టుకుంటే కాని వాళ్ళ సమస్యలు పరిష్కారం కావు. అంచేత ఒకరికి ఒకరు బలమయ్యేలా సహకరించుకుంటారు. ఒకరు లేకుండా ఒకరు లేరు అనేదాకా వస్తారు. అలా నిజమైన ప్రేమలో పడతారు.
ఈ మెయిన్ ట్రాక్‌కు విరుద్ధమైన సబ్ ట్రాక్‌లో మరోజంట ఆర్య(చైతన్య), ప్రియాంక(మధుకృష్ణ) సహజీవనంలో వుంటూ కూడా వాళ్ళ నడుమ దూరాన్ని చెప్పడం ద్వారా దగ్గరి తనానికి ఏది దగ్గరి దారో చెప్పకుండా చూపిస్తాడు దర్శకుడు. అయితే ఎందుకో ఈ ట్రాక్ అసంపూర్తిగా వుంటుంది. రిలేషన్లే లేవనే రఘు(ప్రియదర్శి) రిలేషన్లోకి రావడం బంధాలకు వుండే విలువని చెప్పడానికే అని అర్థమవుతుంది. ఈ మూడో ట్రాక్ ద్వారా ఎంటర్టైన్మెంట్‌ను అందివ్వడం బావుంది.
తొలి చిత్రం అయినా దర్శకుడు సున్నితమైన కథాంశాన్ని జాగ్రత్తగానే డీల్ చేశాడు. తక్కువ పాత్రలతో కథ నడిపినా చిన్న పాత్రలకూ పెద్ద ప్రాధాన్యమిచ్చి అది కూడా ఫిష్ వెంకట్, ప్రభాకర్‌లాంటి నటులనుండి రాబట్టుకోవడం మెచ్చుకోవచ్చు. హీరో సత్యదేవ్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన పాత్రలో లీనమయిపోవడమే కాదు, ఈ సినిమాలో చాలా యంగ్‌గా కూడా కనిపించారు. ప్రియాలాల్ తన పాత్రలో ఒదిగిపోయారు.
ఈ సినిమాకు కెమెరా, మ్యూజిక్ రెండు కళ్ళులా పనిచేశాయి. మైలేసం రంగస్వామి కెమెరా పనితనం చాలా బాగుంది. కొన్ని చోట్ల మణిరత్నం సినిమా గుర్తుకు వస్తుంది. ఇక ఆర్ట్ వర్క్ గురించి చెప్పాలంటే సినిమాకు జీవం పోశాడు సాంబ. మ్యూజిక్ విషయానికి వస్తే సురేష్ బొబ్బిలి అందించిన పాటలు అన్నీ దేనికదిగా ఆకట్టుకున్నాయి. ‘కళ్ళూ కళ్ళు కలిసే’ స్టెప్పులు లేకుండా మనసును లాగేస్తే, ‘తినగా తినగా’ పాట పాత పాటల్ని గుర్తుకు తెస్తూ ఇప్పటికే విన్నట్టు బాగుంది. సినిమాలో ఇమడకపోయినా ఆండ్రాయిడ్ పాట కూడా బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. తనకిది తొలి సినిమా అయినా దర్శకుడు కథని నేరేట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు.
బలం: సత్యదేవ్ నటన, కెమెరా, మ్యూజిక్, ఆర్ట్
బలహీనతలు: సబ్ ప్లాట్, ఆరంభ సన్నివేశాలు,అతికించి నట్టు ఉండే కామెడీ సీన్లు
బాటమ్ లైన్: కుటుంబంతో చూడతగ్గ గువ్వ గోరింక