సీనియర్ ఐపిఎస్ అధికారి.... భార్యను కొట్టి కుటుంబ గొడవన్నాడు !
ఈ దేశంలో స్త్రీలను కాపాడేందుకు చాలా చట్టాలున్నాయి. కానీ… తమ భార్యని తాము పెట్టే హింస ఏ చట్టపరిధిలోకి రాదని ఇప్పటికీ ఎంతోమంది భర్తలు నమ్ముతున్నారు. ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి కూడా అలాగే అనుకున్నాడు. తన బలమంతా ఉపయోగించి భార్యను చావబాదాడు. ఆ వీడియో సోమవారం బయటకు వచ్చి వైరల్ అయ్యింది… ఈ సంఘటన వెనుక ఉన్న కారణాలు… తరువాత జరిగిన పరిణామాలు ఇవి… మధ్యప్రదేశ్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ప్రాసిక్యూషన్) పురుషోత్తమ శర్మ […]
![సీనియర్ ఐపిఎస్ అధికారి.... భార్యను కొట్టి కుటుంబ గొడవన్నాడు ! సీనియర్ ఐపిఎస్ అధికారి.... భార్యను కొట్టి కుటుంబ గొడవన్నాడు !](https://www.teluguglobal.com/h-upload/old_images/116650-ips-purushottam-sharma-video-viraljpeg.webp)
ఈ దేశంలో స్త్రీలను కాపాడేందుకు చాలా చట్టాలున్నాయి. కానీ… తమ భార్యని తాము పెట్టే హింస ఏ చట్టపరిధిలోకి రాదని ఇప్పటికీ ఎంతోమంది భర్తలు నమ్ముతున్నారు. ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి కూడా అలాగే అనుకున్నాడు. తన బలమంతా ఉపయోగించి భార్యను చావబాదాడు. ఆ వీడియో సోమవారం బయటకు వచ్చి వైరల్ అయ్యింది… ఈ సంఘటన వెనుక ఉన్న కారణాలు… తరువాత జరిగిన పరిణామాలు ఇవి…
మధ్యప్రదేశ్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ప్రాసిక్యూషన్) పురుషోత్తమ శర్మ తన భార్యని విపరీతంగా కొడుతున్న వీడియో సోమవారం వైరల్ అయ్యింది. శర్మ వివాహేతర సంబంధం గురించి భార్య ప్రశ్నించడంతో ఆయన ఆమెపై హింసకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. శర్మ కొడుకు పార్థ్ (ఈయన ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నాడు) తండ్రి తల్లిని కొడుతున్న వీడియోని రాష్ట్ర హోం శాఖా మంత్రి నరోత్తమ్ మిశ్రాకు, ఇంకా మరికొందరు ఉన్నతాధికారులకు పంపి… తన తండ్రిపై కేసు నమోదు చేయాల్సిందిగా కోరాడు.
ఈ అంశంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ… ‘ ఆ అధికారిని విధులనుండి తప్పిస్తున్నాం. బాధ్యతగల హోదాలో ఉండి… చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అక్రమాలకు పాల్పడేవారిపై తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది’ అని పేర్కొన్నట్టుగా పిటిఐ వార్త సంస్థ తెలిపింది. రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ… శర్మని మంగళవారం ఐదుగంటల లోపు వివరణ ఇవ్వాల్సిందిగా కోరిందని, దానిని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.
ఈ విషయంపై శర్మ మీడియాతో మాట్లాడుతూ… అది తమ కుటుంబ గొడవ అని నేరం కాదని చెప్పారు. తన భార్య తనను అనవసరంగా అనుమానిస్తోందని, ఇంట్లో కెమెరాలను ఏర్పాటు చేసిందన్నారు. తమకు పెళ్లయి 32 ఏళ్లవుతోందని, ఆమె 2008లో తనపై ఫిర్యాదు చేసిందని, కానీ ఆమె ఇప్పటికీ తన ఇంట్లోనే ఉంటూ తన ద్వారా వచ్చిన అన్ని వసతులు సౌకర్యాలు పొందుతూ తన డబ్బుతో విదేశాలకు వెళుతూ విలాసవంతంగా జీవిస్తోందని తెలిపారు. తాను వేధించే మనిషినైతే ఆమె అలా ఉండేది కాదన్నారు. ఇది కుటుంబ గొడవని, తాను నేరస్తుడిని కానని దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితిలో చిక్కుకున్నానని తెలిపారు. శర్మపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని పిటిఐ … హోం మంత్రిని ప్రశ్నించిగా… లిఖిత పూర్వకమైన ఫిర్యాదు అందితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తాను కూడా ఆ వీడియోని చూశానన్నారాయన.