Telugu Global
National

అందుకోసమే చినజీయర్ అపాయింట్‌మెంట్ కోరా " రేవంత్ రెడ్డి

చినజీయర్ స్వామిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరిన మాట వాస్తవమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. చినజీయర్ స్వామి ఒక రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారన్నారు. అతడు కట్టే గృహాలను కొనండి అంటూ ప్రచారం చేశారన్నారు. చినజీయర్ చెప్పడంతో వందల మంది వెళ్లి అక్కడి వెంచర్లలోని వందల ప్లాట్లు కొనుగోలు చేశారన్నారు. అవన్నీ అక్రమ నిర్మాణాలు అని రేవంత్ రెడ్డి వివరించారు. చెరువులు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలకు చినజీయర్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారన్నారు. […]

అందుకోసమే చినజీయర్ అపాయింట్‌మెంట్ కోరా  రేవంత్ రెడ్డి
X

చినజీయర్ స్వామిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరిన మాట వాస్తవమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. చినజీయర్ స్వామి ఒక రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారన్నారు. అతడు కట్టే గృహాలను కొనండి అంటూ ప్రచారం చేశారన్నారు. చినజీయర్ చెప్పడంతో వందల మంది వెళ్లి అక్కడి వెంచర్లలోని వందల ప్లాట్లు కొనుగోలు చేశారన్నారు. అవన్నీ అక్రమ నిర్మాణాలు అని రేవంత్ రెడ్డి వివరించారు. చెరువులు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలకు చినజీయర్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారన్నారు.

ఆధారాలు తాను బయట పెట్టగానే కొందరు తన వద్దకు వచ్చి కష్టపడిన సొమ్మును పెట్టి కొన్నామని… ఇప్పుడు వివాదం అయితే తాము ఆత్మహత్యలు చేసుకోవాల్సి ఉంటుందని ఒక బృందం వచ్చి విజ్ఞప్తి చేసిందన్నారు. చినజీయర్ మాటలు నమ్మి కొనుగోలు చేశామని వారు వివరించారన్నారు. మైహోం అవతార్‌ మొత్తం చెరువులో కట్టేశారన్నారు. చిన్న వాన వచ్చినా ఆరడుగుల మేర నీరు నిలబడుతుందన్నారు. వాటిని చెరువులో కట్టారని తాను ఆధారాలు చూపగానే బాధితులు వచ్చి చినజీయర్ వల్లే తాము కొనుగోలు చేశామని వివరించారన్నారు.

ఇలాంటివి చాలా వెంచర్లు ఉన్నాయన్నారు. వాటన్నింటికి చినజీయర్‌ స్వామే ప్రారంభోత్సవం చేస్తున్నారన్నారు. అలాంటి పనులు చేయవద్దని సూచించేందుకే తాను చినజీయర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. వెళ్లి మూడు నాలుగు గంటల పాటు ఈ వివరాలన్నీ పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇవ్వాలనుకుంటున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు.

రామానుజ స్వామి విగ్రహం కోసం కూడా చాలా మంది వద్ద చందాలు వసూలు చేశారన్నారు. కానీ వారెవరూ చినజీయర్‌కు తెలియదన్నారు. మాటీవీ రాజు కోట్ల రూపాయలు విగ్రహం కోసం ఇచ్చారన్నారు. ఈ విషయం ఆయనే స్వయంగా తనకు చెప్పారన్నారు. ఈ విషయాన్ని కూడా చినజీయర్‌కు వివరించి విగ్రహం ఎవరో ఒకరి సొమ్ముతో కాలేదని… చాలా మంది డబ్బులు ఇచ్చారని చెప్పాలన్నదే తన ఆలోచన అన్నారు.

చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని కూడా వ్యాపారానికి వాడుతున్నారన్నారు. ఆశ్రమం వస్తే అక్కడ చుట్టూ కొనుగోలు చేసిన వేల ఎకరాలకు విలువ పెరుగుతుందని ఆలోచన కొందరు చేశారన్నారు. ఇలాంటి వ్యాపార చట్రంలో ఇరుక్కోవద్దని వివరించేందుకు చినజీయర్‌ను కలవాలనుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. చినజీయర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే త్వరలో మీడియా ముందే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇస్తానన్నారు.

తెలంగాణ ప్రస్తుతం కేసీఆర్‌ అనుకూలమైన శక్తులు, వ్యతిరేక శక్తులుగా ఉన్నాయన్నారు. కేసీఆర్‌కు అనుకూలమైన శక్తులకు రేవంత్ రెడ్డి ఒక శత్రువుగా కనిపిస్తున్నారన్నారు. కేసీఆర్‌ వ్యతిరేక శక్తులకు రేవంత్ రెడ్డి ఒక ఆశగా కనిపిస్తున్నారన్నారు. కేసీఆర్‌ లాంటి రాక్షసుడిని ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి పనికొస్తాడని… ఉడతా భక్తిగా సాయంగా ఉండాలని కేసీఆర్‌ వ్యతిరేక శక్తులు భావిస్తున్నాయన్నారు.

తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం తన మీద ఆంధ్రా ముద్ర వేసి దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్నారు. తాను కాంగ్రెస్‌లో నిలదొక్కుకోవడం కేసీఆర్‌కు ఇష్టం లేదని… అందుకే లేనిపోని ప్రచారం చేయిస్తున్నారన్నారు. దానికి తోడు తనకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఆఫీస్‌కు పెద్దెత్తున ఫిర్యాదులు పంపిస్తున్నారన్నారు. వాట్సాప్‌, ఈ-మెయిల్‌ గురించి తెలియని పాతకాలం వాళ్లు తనపై నిత్యం ఫిర్యాదులు చేస్తుండడంతో… వారి కోసమే ఏఐసీసీ కార్యాలయంలో కొత్తగా ఫ్యాక్స్ మిషన్‌ను ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు.

కేసీఆర్‌ మీద పోరాటం చేస్తున్నాను కాబట్టే తనపై అత్యధిక కేసులు నమోదు అయ్యాయని… వాటిని కూడా పార్టీకి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఇప్పుడు కొత్తగా రాహుల్‌ గాంధీ గ్రూప్‌ను వదిలేసి ప్రియాంక గాంధీ గ్రూప్‌లో చేరిపోయానని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసి పరోక్షంగా కేసీఆర్‌కు మంచి చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.

రేవంత్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు కాబట్టి అతడిని పరిగణలోకి తీసుకోవద్దు… పదవులు తమకు ఇచ్చేయండి అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో ఎవరికి వారు కథ రాసుకుంటున్నారని… ఆ కథలో వారికి వారే హీరోలుగా ఊహించుకుంటున్నారని… రేవంత్ రెడ్డిని దెబ్బతీస్తే ఇంకా పరిస్థితి అనుకూలంగా ఉంటుందన్న ఆలోచనతో కొందరు పనిచేస్తున్నారన్నారు.

కొందరు మీడియా అధినేతలు తమకు గుజరాత్‌లో, కర్నాటక, తమిళనాడు, కేరళ ఇలా దేశమంతా టీవీ చానళ్లు ఉన్నాయి… కావాలంటే అన్ని చోట్ల ప్రచారం చేస్తాం… కానీ రేవంత్ రెడ్డికి మాత్రం పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వొద్దని ఢిల్లీకి వెళ్లి పెద్దమనుషులను కలిసి చెప్పారన్నారు. టీఆర్ఎస్‌ అనుకూల టీవీ చానళ్ల ప్రతినిధులను అసలు గాంధీ భవన్‌కే రానివ్వకూడదని తమ పార్టీ నాయకులకు చెప్పానన్నారు.

First Published:  5 Sept 2020 6:10 AM IST
Next Story