Telugu Global
International

విమానాశ్రయం మధ్యలో వ్యవసాయం... కోట్లు ఇస్తామన్నా భూమిని వదలని రైతు

విమానాశ్రయాలు కట్టడానికి, ప్రాజెక్టులు నిర్మించడానికి, రోడ్లు వేయడానికి ఎంతో మంది రైతుల పొలాలను ప్రభుత్వం భూసేకరణ పేరుతో తీసుకోవడం చూస్తుంటాం. బెదిరించో, బతిమిలాడో రైతుల నుంచి పొలాలను లాక్కునే ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. కానీ జపాన్‌కు చెందిన ఒక రైతు నుంచి పొలాన్ని తీసుకోలేక ఏకంగా దాని చుట్టూ విమానాశ్రయాన్ని నిర్మించారు. అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను ఆనుకొని ఆ రైతు వ్యవసాయం చేస్తున్నాడు. టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే విమానాల రణగొణ ధ్వనుల మధ్య ఆ రైతు కూరగాయలు, […]

విమానాశ్రయం మధ్యలో వ్యవసాయం... కోట్లు ఇస్తామన్నా భూమిని వదలని రైతు
X

విమానాశ్రయాలు కట్టడానికి, ప్రాజెక్టులు నిర్మించడానికి, రోడ్లు వేయడానికి ఎంతో మంది రైతుల పొలాలను ప్రభుత్వం భూసేకరణ పేరుతో తీసుకోవడం చూస్తుంటాం. బెదిరించో, బతిమిలాడో రైతుల నుంచి పొలాలను లాక్కునే ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. కానీ జపాన్‌కు చెందిన ఒక రైతు నుంచి పొలాన్ని తీసుకోలేక ఏకంగా దాని చుట్టూ విమానాశ్రయాన్ని నిర్మించారు. అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను ఆనుకొని ఆ రైతు వ్యవసాయం చేస్తున్నాడు. టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే విమానాల రణగొణ ధ్వనుల మధ్య ఆ రైతు కూరగాయలు, పండ్లు పండిస్తున్నాడు.

జపాన్‌లోని అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాల్లో నరిత అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. న్యూ టోక్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని కూడా దీన్ని పిలుస్తారు. 1960ల్లో ఈ విమానాశ్రయం నిర్మించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. టోక్యో శివారులోని నరిత గ్రామ పరిసరాల్లో విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ ప్రారంభమయ్యింది. ఆ సమయంలో నరిత, చుట్టు పక్కల గ్రామాల్లో ప్రజా ఉద్యమం మొదలైంది. రైతులు, గ్రామస్తులు, విద్యార్థులు, లెఫ్ట్ పార్టీలు భారీ ఎత్తున విమానాశ్రయ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. దీన్నే ‘సన్రిజుకా స్ట్రగుల్’ అని పిలుస్తారు.

అలా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతు టకావో షిటో తండ్రి కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు తీసుకొని అనేక మంది రైతులు విమానాశ్రయానికి భూములు రాసిచ్చారు. కానీ టకావో షిటో తండ్రి మాత్రం ఆ భూమిని అమ్మనే అమ్మనని భీష్మించుకొని కూర్చున్నాడు.

షిటో గ్రామంలో 28 ఇళ్లు, సమీపంలోని గ్రామంలో మరో 66 ఇళ్లు ఉండేవి. ప్రస్తుతం విమానాశ్రయం నిర్మించిన ప్రాంతంలో ఐదు కుటుంబాలు నివసిస్తూ ఉండేవి. దాంట్లో షిటో తండ్రి తప్ప అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరకు కోర్టులో కేసు వేసినా.. అది షిటో కుటుంబానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో ఆ భూమిని ఏమీ చేయలేక దాని చుట్టూ విమానాలు తిరిగేందుకు వీలుగా రన్‌వేను నిర్మించారు.

100 ఏళ్లకు పైగా ఆ భూమిలో షిటో కుటుంబం వ్యవసాయం చేస్తున్నది. షిటోకు 48 ఏళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో తన రెస్టారెంట్ వ్యాపారాన్ని మూసేసి వ్యవసాయాన్ని కొనసాగించాడు. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ పండ్లు కూరగాయలు పండించి నగరంలోని పెద్ద రెస్టారెంట్లకు అమ్ముతుంటాడు. ఇప్పటికీ విమానాశ్రయ యాజమాన్యం దాదాపు రూ. 13 కోట్లు ఇస్తామని షిటో వెంటపడుతుంది. కానీ అతను మాత్రం వ్యవసాయం చేయడానికే మొగ్గు చూపుతున్నాడు. వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్న చిన్న ఇంటిలో అతనితో పాటు వ్యవసాయంలో సాయం చేయడానికి వచ్చే వలంటీర్లతో కలసి ఉంటాడు. ఖాళీ సమయాల్లో తాగుతూ, డ్యాన్సులు చేస్తూ కనిపిస్తుంటారు.

First Published:  21 Aug 2020 8:01 AM IST
Next Story