మనం ఎవరికి నచ్చాలి?!
తెల్లగా, నల్లగా, పొడుగ్గా, పొట్టిగా, లావుగా, సన్నగా, అందంగా, ఆకర్షణీయంగా, మామూలుగా, అందవికారంగా… మనుషులు ఇలా రకరకాలుగా ఉంటారు. పుట్టుకతో వచ్చే రూపం అనేది మనం నిర్ణయించేది కాదు. అందుకే మనం ఎలా ఉన్నా మనల్ని మనం ఇష్టపడి తీరాలి. అలా ఇష్టపడకుండా మనలోని లోపాలను పదేపదే గుర్తు చేసుకుంటూ బాధ పడుతున్నా, సిగ్గుపడుతున్నా… మనపై మనకు ప్రేమ లేనట్టే. అది అనేక మానసిక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు మరింతగా తమ […]
తెల్లగా, నల్లగా, పొడుగ్గా, పొట్టిగా, లావుగా, సన్నగా, అందంగా, ఆకర్షణీయంగా, మామూలుగా, అందవికారంగా… మనుషులు ఇలా రకరకాలుగా ఉంటారు. పుట్టుకతో వచ్చే రూపం అనేది మనం నిర్ణయించేది కాదు. అందుకే మనం ఎలా ఉన్నా మనల్ని మనం ఇష్టపడి తీరాలి. అలా ఇష్టపడకుండా మనలోని లోపాలను పదేపదే గుర్తు చేసుకుంటూ బాధ పడుతున్నా, సిగ్గుపడుతున్నా… మనపై మనకు ప్రేమ లేనట్టే. అది అనేక మానసిక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు మరింతగా తమ రూపం గురించి ఆందోళన పడుతుంటారు. మరి మనమీద మనకు ప్రేమ ఉందా… లేదా అనేది ఎలా తెలుసుకోవాలి… అందుకోసం ఉపయోగపడే ఓ చిన్న క్విజ్…..ఈ క్రింది ప్రశ్నలకు ముందు సమాధానాలు చెప్పుకోండి…
- అద్దంలో చూసుకున్నపుడు …
ఎ. మీ శరీరంలోని నచ్చని విషయాలపైకే మీ ధ్యాస పోతుందా?
బి. మీలో మీకు నచ్చిన అంశాలను చూసి సంతోషపడుతుంటారా?
- మీరు వ్యాయామం ఎందుకు చేస్తున్నారు?
ఎ. బరువు తగ్గించుకోడానికా…
బి. ఫిట్ గా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనా…
- ఇలా కాకుండా మరోలా ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉండేవాడిని (ఉండేదాన్ని) అనుకుంటున్నారా?
ఎ. అవును
బి. అలాంటిదేమీ లేదు
- మీ దృష్టిలో అందమైన శరీరం అంటే ఏమిటి?
ఎ. చక్కని శరీర కొలతలతో శిల్పంలా ఉండటం
బి. ఎలాంటి అనారోగ్యం లేకుండా శక్తిమంతంగా ఉండటం
- అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో తినకుండా ఎప్పుడైనా కడుపు మాడ్చుకున్నారా?
ఎ. అవును కొన్ని సందర్భాల్లో…
బి. ఎప్పుడూ లేదు.
- మీకు నచ్చిన దుస్తులను, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని పక్కన పెట్టిన సందర్భాలున్నాయా?
ఎ. అవును ఉన్నాయి.
బి. లేదు… నాకు నచ్చితే చాలు…ధరిస్తాను
- ఒక అందమైన సెలబ్రిటీని చూసినప్పుడు మీకేమనిస్తుంది?
ఎ. నేను కూడా అలా ఉంటే బాగుండేదని…
బి. ఆమె లేదా అతను చాలా బాగున్నారు…వారికి అలా కనిపించాల్సిన అవసరం ఉంది.
- మీ రూపం లేదా దుస్తులను గురించి ఎవరైనా నెగెటివ్ కామెంట్లు చేస్తే…
ఎ. అలా అన్నవారిని ద్వేషిస్తాను… ఏడుపు వచ్చేస్తుంది.
బి. పట్టించుకోను… వారి అభిప్రాయం వలన నాకు వచ్చే నష్టం కానీ లాభం కానీ ఏమీ లేదనుకుంటాను.
- ఇతరుల రూపం కానీ, డ్రస్సింగ్ కానీ నచ్చకపోతే… కామెంట్ చేశారా?
ఎ. అవును… చేశాను
బి. లేదు ఎప్పుడూ చేయలేదు
- ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు వాటిని మరింత అందంగా కనిపించేలా మార్చుతున్నారా?
ఎ. అవును…
బి. కొన్నిసార్లు / లేదు… ఎప్పుడూ చేయలేదు
- మీకు అవకాశం వస్తే… ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారా?
ఎ. అవును… ఎందుకు చేయించుకోకూడదు
బి. లేదు…అసలు అలాంటి ఆలోచనే లేదు.
పై ప్రశ్నల్లో చాలావాటికి మీ సమాధానం ‘ఎ’ అయితే… మీకు మీపై ప్రేమ పూర్తిస్థాయిలో లేదనే చెప్పాలి. మీ ఆలోచనా విధానంలో లోపముందని కూడా గ్రహించాలి. ఎప్పుడూ ఎదుటివారికి నచ్చేలా బతకాలని తపన పడుతుంటే మనకు మనం నచ్చకుండా పోతామని గుర్తుంచుకోవాలి.