పవన్ కి రాజకీయ పార్టీని నడిపే సత్తా ఉందా..?
రాజకీయ పార్టీని నడపాలంటే దానికి చాలా కసరత్తు అవసరం. అధినేత మనసు కఠినంగా లేకపోయినా.. పైకి మనిషి కఠినంగా కనిపించాలి. కార్యకర్తలను కాపాడుకుంటూనే.. తోకజాడించిన నేతలపై నిర్దాక్షిణ్యంగా వేటు వేయగలగాలి. అలకలను బుజ్జగిస్తూనే, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేవారిపై అదురుదెబ్బ వేయాలి. అలా చేయకపోతే, అలాంటివి చేతకాకపోతే రాజకీయ పార్టీని నడపడం కష్టం. గతంలో చిరంజీవి కూడా ఇలానే మెత్తగా ఉండే సరికి పార్టీని వీడేవారంతా ఆయన్ని ఓ అసమర్థుడిగా చిత్రీకరించి బైటకెళ్లిపోయారు. అయినా అప్పటి ప్రజారాజ్యం అధినేత […]
రాజకీయ పార్టీని నడపాలంటే దానికి చాలా కసరత్తు అవసరం. అధినేత మనసు కఠినంగా లేకపోయినా.. పైకి మనిషి కఠినంగా కనిపించాలి. కార్యకర్తలను కాపాడుకుంటూనే.. తోకజాడించిన నేతలపై నిర్దాక్షిణ్యంగా వేటు వేయగలగాలి. అలకలను బుజ్జగిస్తూనే, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేవారిపై అదురుదెబ్బ వేయాలి. అలా చేయకపోతే, అలాంటివి చేతకాకపోతే రాజకీయ పార్టీని నడపడం కష్టం.
గతంలో చిరంజీవి కూడా ఇలానే మెత్తగా ఉండే సరికి పార్టీని వీడేవారంతా ఆయన్ని ఓ అసమర్థుడిగా చిత్రీకరించి బైటకెళ్లిపోయారు. అయినా అప్పటి ప్రజారాజ్యం అధినేత వారిని పల్లెత్తు మాట కూడా అనలేదు. సరిగ్గా ఇప్పుడు జనసేన విషయంలో కూడా అదే జరుగుతోంది.
నిన్న మొన్నటి వరకూ చాలామంది నేతలు, పవన్ సన్నిహితులు పార్టీని వదిలి వెళ్లిపోయారు. వారంతా పవన్ పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు గుప్పించారు. ఇక్కడ కూడా పవన్ నోరు మెదపలేకపోయారు. జనసేనకు చెందిన ఇతర నేతలు కాస్తో కూస్తో ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ పవన్ మాత్రం నిందల్ని మౌనంగా భరించారు.
ఇప్పుడు జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా తాను ఆ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని బహిరంగంగా చెప్పేశారు. తనని వైసీపీ ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ అనుచరులకు సూచించారు రాపాక. గతంలో కూడా జనసేన ఎమ్మెల్యే రాపాక సీఎం జగన్ ని ప్రశంసల్లో ముంచెత్తేవారు. సీఎం ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు, ర్యాలీల్లో పాల్గొన్నారు కూడా. అప్పట్లో పవన్ ఏంచేయాలో తెలియక సతమతమయ్యారు. మీటింగుల్లో మా ఎమ్మెల్యే ఉన్నారో లేదో అంటూ గొణుక్కునేవారు కానీ, బహిరంగంగా కామెంట్ చేయడానికి వెనకాడేవారు.
ఇప్పుడు ఏకంగా నేను మీ పార్టీ కాదు అనేశారు రాపాక. వైసీపీ టికెట్ ఇవ్వకపోతే, జనసేన నాయకులు బతిమిలాడితే ఆ పార్టీ తరపున పోటీచేశానని చెప్పారు. పార్టీ అధినేతే రెండుచోట్ల ఓడిపోతే.. ఇక ఆ పార్టీ సంగతి వేరే చెప్పాలా అని సెటైర్లు వేశారు. కనీసం ఇప్పుడయినా పవన్ కల్యాణ్ స్పందించకపోతే ఏం బాగుంటుంది. వ్యక్తిగతంగా రాపాక చేసిన పని తప్పా, ఒప్పా అనే పాయింట్ అనవసరం. పార్టీని, పార్టీ నియమావళిని గౌరవించారా లేదా అనేదే పాయింట్.
ఇలాంటి టైమ్ లో కూడా జనసేన అధినేత మౌనాన్నే ఆశ్రయిస్తే.. పార్టీపై ఆయనకి పట్టు ఉన్నట్టా లేనట్టా అనే అనుమానం రాకమానదు. రాపాక విమర్శలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్న టైమ్ లో, జనసైనికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు కానీ జనసేనాని సైలెంట్ గా ఉన్నారు.
ఇలాంటి వైఖరితో అసలు పవన్ రాజకీయ పార్టీని నడపగలరా? ఒక్క ఎమ్మెల్యేనే అదుపులో పెట్టుకోలేని అధినేత, రేపు 10మంది ఎమ్మెల్యెేలు గెలిస్తే ఏం చేస్తారనే అనుమానం రాకమానదు.