Telugu Global
National

వైసీపీ వర్సెస్ బీజేపీ... మంత్రి కొడాలి ఎందుకు కవ్వించారు...?

చైనానుంచి వచ్చింది అసలు కరోనా వైరస్ అయితే.. భారత్ లో బీజేపీ లాంటి రాజకీయ కరోనా ఉందని, అది అసలు వైరస్ కంటే ప్రమాదకరమని ఓ ఇంటర్వూలో ఘాటుగా వ్యాఖ్యానించారు మంత్రి కొడాలి నాని. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో స్థానిక పార్టీలను రాజకీయ కరోనా మింగేస్తోందని అన్నారాయన. దీనికి బీజేపీ కూడా కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. వెస్ట్ బెంగాల్, త్రిపురలో బీజేపీ సొంతగా ఎదిగిందని, అవినీతి, కుటుంబ పాలనతో ఏపీని పట్టి పీడిస్తున్న టీడీపీ, వైసీపీలాంటి […]

వైసీపీ వర్సెస్ బీజేపీ... మంత్రి కొడాలి ఎందుకు కవ్వించారు...?
X

చైనానుంచి వచ్చింది అసలు కరోనా వైరస్ అయితే.. భారత్ లో బీజేపీ లాంటి రాజకీయ కరోనా ఉందని, అది అసలు వైరస్ కంటే ప్రమాదకరమని ఓ ఇంటర్వూలో ఘాటుగా వ్యాఖ్యానించారు మంత్రి కొడాలి నాని. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో స్థానిక పార్టీలను రాజకీయ కరోనా మింగేస్తోందని అన్నారాయన.

దీనికి బీజేపీ కూడా కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. వెస్ట్ బెంగాల్, త్రిపురలో బీజేపీ సొంతగా ఎదిగిందని, అవినీతి, కుటుంబ పాలనతో ఏపీని పట్టి పీడిస్తున్న టీడీపీ, వైసీపీలాంటి ప్రాంతీయ వైరస్ లకు దేశవ్యాప్త వ్యాక్సిన్ బీజేపీ అంటూ బీజేపీ సోషల్ మీడియా విభాగం నుంచి ప్రతిస్పందన వచ్చింది. ఇప్పటి వరకు ఏపీలో బీజేపీ, వైసీపీ మధ్య ఈస్థాయిలో నేరుగా మాటల యుద్ధం జరగలేదు.

కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పార్టీ టార్గెట్ కేవలం వైసీపీనే. సీఎం జగన్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీడీపీకి వంతపాడుతూ ఉండేవారు. సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక తమ టార్గెట్ కేవలం టీడీపీయే అంటూ వచ్చారు. అయితే అంతలోనే బీజేపీపై మంత్రి కొడాలి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.

సీఎం జగన్ ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే దానికి వెంటనే కౌంటర్ ఇవ్వడానికి ముందు వరసలో ఉండే నాయకుల్లో కొడాలి నాని ఒకరు. ఇటీవల కాలంలో సొంతపార్టీ నేత ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేరుగా జగన్ ని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. ప్రతిరోజూ ఏదోఒక సాకుతో ప్రెస్ మీట్ పెట్టి సీఎం నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టీడీపీ అనుకూల మీడియా విపరీతంగా ప్రచారం కల్పిస్తోంది.

అయితే ఈ వ్యవహారమంతటికీ బీజేపీ అండదండలు ఉన్నాయనేది వైసీపీ అనుమానం. కారణాలేవయినా, వైసీపీనుంచి బైటకెళ్లి బీజేపీతో కలవడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు రఘురామ కృష్ణంరాజు. వేటు వేయించుకోవాలని ఆయన, తమ చేతికి మట్టి అంటకుండా బైటకు సాగనంపాలని పార్టీ.. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.

రఘురామకృష్ణంరాజు లాంటి వారందరినీ అక్కున చేర్చుకోడానికి బీజేపీ ఏమాత్రం వెనకాడదు. అంతే కాదు.. మంత్రి పదవి అందని ద్రాక్షలా మారిన కొంతమంది అసంతృప్త సీనియర్ నేతలకు కూడా బీజేపీ గాలం వేస్తోందనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. 151సీట్లతో వైసీపీ బలంగా ఉండబట్టి సరిపోయింది కానీ, లేకపోతే.. ఏపీకి కూడా కర్నాటక, మధ్యప్రదేశ్ లాంటి గతి పట్టదని గ్యారెంటీ ఏమీ లేదు.

అందుకే ఏపీలో కొంతమంది బీజేపీ కరోనా బారిన పడ్డారని, వైరస్ అంటించుకున్నారని టీడీపీతోపాటు పరోక్షంగా రఘురామకృష్ణంరాజుని టార్గెట్ చేస్తూ బీజేపీకి చురకలంటించారు మంత్రి నాని. అయితే కొడాలి మాటలు కాస్త ఘాటుగా ఉండటంతో.. వెంటనే బీజేపీ నాయకత్వం కూడా రంగంలోకి దిగింది.

టీడీపీ, వైసీపీయే ప్రాంతీయ వైరస్ లని, బీజేపీ దేశవ్యాప్త వ్యాక్సిన్ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందో లేక కొనసాగుతుందో వేచి చూడాలి.

First Published:  11 Aug 2020 4:20 AM IST
Next Story