Telugu Global
Health & Life Style

అదేపనిగా ఫోన్... అది డోపమైన్ పని !

ఉదయాన్నే లేవటం… ఉరుకులు పరుగులతో స్కూళ్లకు కాలేజీలకు వెళ్లటం, ఇంటికి రాగానే హోంవర్కులు చేయటం, ట్యూషన్లకు వెళ్లటం….ఇవేమీ లేవు ఇప్పుడు పిల్లల జీవితాల్లో. వాళ్లకు నచ్చినప్పుడు నిద్రలేవటం, రోజంతా స్మార్ట్ ఫోన్, టీవీ, కంప్యూటర్ లాంటి వాటితో కాలక్షేపం చేయటం, తమకు నచ్చిన వినోద కార్యక్రమాలు చూడటం, ఎప్పుడో వేళదాటి పోయాక తినటం, లేకపోతే అసలు తినకపోవటం… ఏ అర్థరాత్రి దాటాకో నిద్రపోవటం… ఇప్పుడు చాలా ఇళ్లలో పిల్లల దినచర్య ఇలాగే ఉంటోంది.  ఇంటికి అవసరమైన పనులు […]

అదేపనిగా ఫోన్... అది డోపమైన్ పని !
X

ఉదయాన్నే లేవటం… ఉరుకులు పరుగులతో స్కూళ్లకు కాలేజీలకు వెళ్లటం, ఇంటికి రాగానే హోంవర్కులు చేయటం, ట్యూషన్లకు వెళ్లటం….ఇవేమీ లేవు ఇప్పుడు పిల్లల జీవితాల్లో. వాళ్లకు నచ్చినప్పుడు నిద్రలేవటం, రోజంతా స్మార్ట్ ఫోన్, టీవీ, కంప్యూటర్ లాంటి వాటితో కాలక్షేపం చేయటం, తమకు నచ్చిన వినోద కార్యక్రమాలు చూడటం, ఎప్పుడో వేళదాటి పోయాక తినటం, లేకపోతే అసలు తినకపోవటం… ఏ అర్థరాత్రి దాటాకో నిద్రపోవటం… ఇప్పుడు చాలా ఇళ్లలో పిల్లల దినచర్య ఇలాగే ఉంటోంది. ఇంటికి అవసరమైన పనులు ఏవైనా చేయమన్నా, చదువుకోమన్నా, భవిష్యత్తుకి పనికొచ్చేది ఏదైనా నేర్చుకోమన్నా అబ్బా బోర్… అంటున్నారు.

రోజంతా ఏదో ఒక వినోదాన్ని ఇచ్చే ప్రోగ్రాములను చూడటం, సోషల్ మీడియాలో ఉండటం మాత్రం బోర్ గా అనిపించడం లేదు… ఇందుకు కారణం వారి మెదడులోని డోపమైన్ అంటున్నారు మానసిక నిపుణులు. డోపమైన్ నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేసే ఒక రసాయనం. దీనిని ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్ మీటర్ గా చెబుతారు. ఇది మెదడులో స్రవిస్తున్నప్పుడు ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఆనందంగా ఉండగలుగుతాం.

మనకు నచ్చిన ఆహారం తిన్నప్పుడు, చాలా ఆనందాన్ని ఇచ్చే పనులు చేసినప్పుడు మెదడులో డోపమైన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మరీ ఎక్కువైనా, లేదా మరీ తక్కువైనా శారీరక మానసిక సమస్యలకు దారితీస్తుంది. డోపమైన్ తక్కువగా ఉన్నవారు ఆల్కహాల్, డ్రగ్స్ లాంటి అడిక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. అదేపనిగా వినోదాన్నిచ్చే పనులను మాత్రమే చేయాలని అనుకునేవారిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది.

డోపమైన్ ప్రభావం వల్లనే పదేపదే ఇన్ స్టాగ్రామ్ చెక్ చేసుకోవటం నుండి డ్రగ్స్ వాడటం వరకు….జరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మనలో ఉత్తేజాన్ని నింపి, లక్ష్యసాధనవైపు మళ్లించే శక్తి ఉన్న డోపమైన్ ని… మనం మన జీవితానికి పనికొచ్చేలా వినియోగించుకోవాలి. కానీ అదేపనిగా స్మార్ట్ ఫోన్ లో సోషల్ మీడియాలో ఉంటూ ఆనందాన్నిచ్చే పనులను మాత్రమే చేస్తుంటే… డోపమైన్ మరింత కావాలనిపిస్తుంది. దాంతో వినోదాన్నిచ్చే పనులకు మరింత అడిక్ట్ అయిపోయి, పనికొచ్చే పనులు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంలో మరింత డోపమైన్ పెరిగి ఆరోగ్య సమస్యలకు సైతం దారితీస్తుంది.

ఇలాంటి పరిస్థితులకు గురికాకుండా ఉండాలంటే… డోపమైన్ డిటాక్స్ పాటించాలి. అంటే తమకు ఏ పనులు తాత్కాలిక ఎంజాయిమెంట్ ని ఇస్తున్నాయో వాటికి ఒక రోజంతా దూరంగా ఉండాలి. ఫోన్, లాప్ టాప్, టీవీ… ఇవేమీ చూడకూడదు. దీనివలన చాలా బోర్ గా అనిపిస్తుంది. అప్పుడు అంతకుముందు బోర్ అనిపించిన పనులు చేయాలనే ఉత్సాహం కలుగుతుంది.

మరొక విధంగా కూడా చేయవచ్చు. మనం కష్టమని మానేసిన మంచి పనులను చేశాక… మనకు ఆనందాన్ని ఇచ్చే … అంటే డోపమైన్ ని పెంచే పనులు చేయాలి…అనే నిర్ణయం తీసుకోవాలి. ఇది కూడా డోపమైన్ డిటాక్స్ గా పనిచేస్తుంది. ఫోన్లో… సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నపుడు మనలో ఉండే క్యూరియాసిటీ కి కారణం డోపమైనే. అదే మోటివేషన్ ని, ఉత్సాహాన్ని, కుతూహలాన్ని పనికొచ్చే పనులకు సైతం వినియోగించుకోవచ్చని, వాటి ద్వారా డోపమైన్ ని పొందటం మంచిదని గుర్తించాలి.

First Published:  6 Aug 2020 8:36 AM IST
Next Story