వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్ను మూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆయన సొంతింటిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 77 ఏళ్లు. దశాబ్దాలుగా ప్రజలను చైతన్య పరిచేందుకు తన ఆటపాటతో వంగపండు ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటు తనంపై గజ్జెకట్టి ఆడిపాడారాయన. ”ఏం పిల్లడో ఎల్దామొస్తవా ” అంటూ వంగపండు వదిలిన జానపదం దశాబ్దాలుగా ప్రజలను ఉత్తేజపరుస్తూనే ఉంది. ”ఏం పిల్లడో ఎల్దామొస్తవా” అన్న పాట దాదాపు […]
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్ను మూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆయన సొంతింటిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 77 ఏళ్లు.
దశాబ్దాలుగా ప్రజలను చైతన్య పరిచేందుకు తన ఆటపాటతో వంగపండు ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటు తనంపై గజ్జెకట్టి ఆడిపాడారాయన. ”ఏం పిల్లడో ఎల్దామొస్తవా ” అంటూ వంగపండు వదిలిన జానపదం దశాబ్దాలుగా ప్రజలను ఉత్తేజపరుస్తూనే ఉంది. ”ఏం పిల్లడో ఎల్దామొస్తవా” అన్న పాట దాదాపు 30 భాషాల్లో అనువాదం అయిందని వంగపండు గర్వంగా చెప్పుకునే వారు.
ఇలాంటి ఎన్నో వందల జానపదాలను వంగపండు స్వయంగా రాసి, ఆలపించారు. అనేక పాటలు వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి. వంగపండు పాటలు విని చాలా మంది యువత అప్పట్లో విప్లవం వైపు వెళ్లారు. పోలీసుల విచారణలో పట్టుబడిన పలువురు ఇదే విషయాన్ని చెప్పేవారు. దాంతో ఒక దశలో వంగపండు బృందంపై పోలీసులు ఆంక్షలు పెట్టారు.
తాము పాటలు పాడుతున్నారని తెలిస్తే పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వదిలేసేవారని వంగపండు గతంలో వివరించారు. చుట్టూజనం మధ్య రోడ్డు మీదే పాటలు పాడేవారు వంగపండు. 1972లో జననాట్యమండలిని వంగపండు స్థాపించారు.
నారాయణమూర్తి సినిమాలకి వంగపండు పాటలు రాశారు. అర్థరాత్రి స్వాతంత్రం, చీమలదండు, భూమిపోరాటం వంటి సినిమాల్లో వంగపండు పాటలు రాశారు. 2017లో కళారత్న పురస్కారం అందుకున్నారు. పాటను ప్రపంచ పటంలోకి తీసుకెళ్లిన ఘనత వంగపండుకే దక్కుతుందని ప్రజా గాయకుడు గద్దర్ వ్యాఖ్యానించారు. వంగపండు పాటలు ప్రజల గుండెచప్పుడిని వినిపించేవన్నారు.