మాస్క్ తో రన్నింగ్ చేస్తే... ప్రాణాపాయమా?!
జాగింగ్, రన్నింగ్ చేసేటప్పుడు నోరు, ముక్కును కవర్ చేసే మాస్క్ ధరించాలా వద్దా… ఈ సందేహం ఒకటి ఇప్పుడు చాలామందిలో ఉంది. ఆటోమొబైల్ రంగంలో ఎగ్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తున్న వ్యక్తి ఒకరు మాస్క్ ధరించి రన్నింగ్ చేస్తూ… తీవ్రమైన గుండెపోటుతో మరణించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఉదయం సాయంత్రం వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేసేవారంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ లను ధరించి వ్యాయామాలు చేశారంటే ఇక అంతే సంగతులనే ప్రచారం వాట్సప్ గ్రూపుల్లో జరుగుతోంది. లాక్ […]
జాగింగ్, రన్నింగ్ చేసేటప్పుడు నోరు, ముక్కును కవర్ చేసే మాస్క్ ధరించాలా వద్దా… ఈ సందేహం ఒకటి ఇప్పుడు చాలామందిలో ఉంది. ఆటోమొబైల్ రంగంలో ఎగ్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తున్న వ్యక్తి ఒకరు మాస్క్ ధరించి రన్నింగ్ చేస్తూ… తీవ్రమైన గుండెపోటుతో మరణించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.
ఉదయం సాయంత్రం వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేసేవారంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ లను ధరించి వ్యాయామాలు చేశారంటే ఇక అంతే సంగతులనే ప్రచారం వాట్సప్ గ్రూపుల్లో జరుగుతోంది. లాక్ డౌన్ మొదలైన రోజులనుండే ఈ చర్చ ఉంది. అయితే దీనిపై భిన్న అభిప్రాయాలు, సలహాలు వ్యక్తమవుతున్నాయి.
రన్నింగ్, జాగింగ్ చేసేటప్పుడు తప్పకుండా మాస్క్ ధరించే తీరాలి. అయితే రోజువారీ రన్నింగ్ జాగింగ్ చేసేవారు తమ పరుగు వేగం కాస్త తగ్గించుకోవాలని… చెన్నైకి చెందిన ఒక ఫిజియో థెరపిస్టు అంటున్నారు.
గురుగ్రామ్ కి చెందిన జనరల్ ఫీజిషియన్ డాక్టర్ జోయేత బసు ఈ విషయంపై ట్విట్టర్లో స్పందిస్తూ…‘మాస్క్ లేకుండా రన్నింగ్ చేయటం వల్లనే ఆ ఎగ్జిక్యూటివ్ మరణించారంటూ వాట్సప్ లో ఆందోళనా భరితంగా స్పందిస్తున్నారు చాలామంది. కానీ మాస్క్ ధరించడం వలన ఆక్సిజన్ అందని పరిస్థితి హైపోక్సియా సంభవించదు. ఆయన సడన్ కార్డియాక్ డెత్ కి గురై ఉండవచ్చు. మాస్క్ ధరించి కరోనా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి’ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇందుకు భిన్నంగా పేర్కొంది. వ్యాయామం చేసేటప్పుడు మాస్క్ ని ధరిస్తే దానివలన సౌకర్యంగా శ్వాస తీసుకోలేని పరిస్థితి ఉండవచ్చని హెచ్చరించింది. వ్యాయామంలో మాస్క్ ధరిస్తే త్వరగా చెమట పట్టేసి అది తడిసి పోవటం వలన బ్యాక్టీరియా పెరగవచ్చని కూడా డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. వ్యాయామం చేసేవారందరూ తప్పనిసరిగా ఇతరులనుండి ఆరు అడుగుల దూరం పాటించి తీరాలని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ఇచ్చింది.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఈ విషయంపై ట్వీట్ చేస్తూ వ్యాయామం చేసేవారు ఆ సమయంలో మాస్క్ లు ధరించవద్దని… మాస్క్ వలన శ్వాస తీసుకోవటంలో సమస్యలు రావచ్చని అన్నారు.
మొత్తంమీద మాస్క్ తో వ్యాయామం చేయవచ్చా లేదా… అనే ప్రశ్నకు భిన్నమైన సమాధానాలు ఉన్నా…ఇరుకుగా ఉన్న ప్రదేశంలో ఎక్కువమంది మనుషులు ఉన్నపుడు తప్పకుండా మాస్క్ ని ధరించే తీరాలని, జనం చాలా పలుచగా ఉన్న ప్రదేశాల్లో మాస్క్ లేకుండానే జాగింగ్ చేసే అవకాశం ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. శ్వాస అసౌకర్యంగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడటం కూడా అవసరమే. మాస్క్ ధరించడం, శ్వాస సౌకర్యంగా ఉండేలా చూసుకోవటం… ఇవి రెండూ ముఖ్యమేనని గుర్తుంచుకోవాలి.