నిమ్మగడ్డ భుజంపై నుంచి పేల్చారు...
జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తొలినుంచి మొండిగానే వ్యవహరించింది. హైకోర్టు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా అందులో రాజ్యాంగ పరమైన చిక్కు ఉందంటూ సుప్రీం కోర్టుకు వెళ్లింది. హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు పదేపదే నిరాకరించినా ఆయన్ను నియమించే విషయంలో ప్రభుత్వం ముందుకు రాలేదు. చివరకు హైకోర్టు సూచన మేరకు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. దాంతో నిమ్మగడ్డ సంగతేంటో పరిశీలించండి అంటూ సీఎస్‌కు గవర్నర్ […]
జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తొలినుంచి మొండిగానే వ్యవహరించింది. హైకోర్టు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా అందులో రాజ్యాంగ పరమైన చిక్కు ఉందంటూ సుప్రీం కోర్టుకు వెళ్లింది. హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు పదేపదే నిరాకరించినా ఆయన్ను నియమించే విషయంలో ప్రభుత్వం ముందుకు రాలేదు. చివరకు హైకోర్టు సూచన మేరకు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. దాంతో నిమ్మగడ్డ సంగతేంటో పరిశీలించండి అంటూ సీఎస్‌కు గవర్నర్ లేఖ రాశారు.
ఆసమయంలోనూ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ… వ్యవహారం సుప్రీం కోర్టులో ఉందని… ఆ విషయాన్నే గవర్నర్‌కు వివరిస్తామని చెప్పారు. దాంతో సుప్రీంకోర్టులో ఆఖరి తీర్పు వచ్చే వరకు నిమ్మగడ్డ నియామకం ఉండదు అని అంతా భావించారు. కానీ గురువారం అర్థరాత్రి హఠాత్తుగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను పునర్ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొందరికి ఈ పరిణామం నిమ్మగడ్డ విజయంగా కనిపించింది. కానీ లోతుగా ఆలోచించిన కొందరు టీడీపీ పెద్దలకు మాత్రం ఇది తమకు ఎదురుకాబోయే ఎదురుదెబ్బకు సూచనగా అనిపించింది.
టీడీపీ పత్రికలు నిన్న ఉదయం మొదటి పేజీలోనే నిమ్మగడ్డ విజయం అంటూ హర్షం వ్యక్తం చేశాయి. టీడీపీ మీడియా నిమ్మగడ్డ విజయం, జగన్‌కు ఎదురుదెబ్బ అని హడావుడి చేశాయో గానీ… చంద్రబాబుగానీ, ఇతర కీలక నేతలు గానీ నిమ్మగడ్డ నియామకంపై పెద్దగా హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటనలేమీ విడుదల చేయలేదు.
జగన్ ఒక్కసారిగా నిమ్మగడ్డ విషయంలో వెనక్కు తగ్గారంటే ఏదో జరగబోతోందని అవతలి పక్షం అప్పటికే గ్రహించి ఉండవచ్చు. వారు ఊహించినట్టే జరిగింది. గవర్నర్ చెప్పిన తర్వాత కూడా నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం లెక్క చేయడం లేదని… జగన్‌మోహన్ రెడ్డికి గవర్నర్ అంటే కూడా గౌరవం లేదా అంటూ టీడీపీ తొలుత ప్రచారం చేసింది. ఒక విధంగా జగన్‌మోహన్ రెడ్డిపై గవర్నర్‌లోనూ వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నించారు.
అయితే ఆ ప్రయత్నం విజయవంతం కాకుండా అధికార పక్షం ఎత్తు వేయగలిగింది. కొన్ని నెలలుగా అన్ని అంశాలను వదిలేసి కేవలం నిమ్మగడ్డ కోసమే పోరాటం చేస్తూ, ఫోకస్ మొత్తం నిమ్మగడ్డకే పరిమితం చేసిన టీడీపీకి ఊరటనిస్తూ అర్థరాత్రి జీవో విడుదల చేసింది. నిమ్మగడ్డను నియమించడం ద్వారా గవర్నర్ సూచనల పట్ల ఏపీ ప్రభుత్వం గౌరవాన్ని ప్రదర్శించినట్టు అయింది. గవర్నర్ పెద్దరికానికి దెబ్బతగలకుండా జాగ్రత్తపడింది. అప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా మూడు రాజధానుల అంశం ఏపీ పరిధిలోనిదే అని స్పష్టత ఇవ్వడంతో గవర్నర్ స్వేచ్చగా నిర్ణయం తీసుకోగలిగారు.
నిమ్మగడ్డను నియమించే అంశాన్ని పరిశీలించండి అంటూ ఇటీవల గవర్నర్ ఆదేశిస్తే వెంటనే స్వాగతించిన టీడీపీ… ఇప్పుడు గవర్నర్‌ను తప్పుపట్టలేని పరిస్థితికి వచ్చింది. పైగా తక్షణం ఆమోదించకుండా బిల్లులపై న్యాయ నిపుణుల నుంచి వివరాలు కూడా తీసుకుని జాగ్రత్తగానే గవర్నర్ అడుగులు వేశారు.
చంద్రబాబుతో పాటు వివిధ పార్టీలు రాసిన లేఖలను పరిశీలించడంతో పాటు శానసమండలిలో పరిణామాలపై మండలి కార్యదర్శి నుంచి లిఖితపూర్వకంగా నివేదిక తెచ్చుకుని, దాన్ని పరిశీలించి ఆ తర్వాత బిల్లులకు ఆమోదం తెలిపారు. టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంపైనా, గవర్నర్‌పైనా విమర్శలు చేస్తోంది.
మొత్తం మీద నిమ్మగడ్డ విషయంలో ఒక అడుగు వెనక్కు వేసినా… మూడు రాజధానులతో మూడు అడుగులు ముందుకు దూకినట్టు అయింది.