అమరావతి రైతుల్ని ఇంకా మోసం చేస్తారా..?
అమరావతి అనేది ముగిసిన అధ్యాయం. కనీసం గవర్నర్ ఆమోదముద్రతో అయినా అమరావతిపై ఆశలు వదులుకోవాల్సిందే. అయినా సరే టీడీపీ, దాని అనుకూల మీడియా, టీడీపీ సోషల్ మీడియా వింగ్.. ఇంకా అమరావతి రైతుల్ని భ్రమల్లోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. అమరావతి కథ ముగిసిపోలేదని, న్యాయపోరాటం చేస్తున్నామని మరింతగా రెచ్చగొడుతున్నాయి. రైతుల పేరుతో మొదలైన ఉద్యమం కరోనా కష్టకాలం తర్వాత ఒకరిద్దరు పలకలు పట్టుకుని ఇచ్చే ప్రదర్శనలకు పరిమితమైంది. రాష్ట్రవ్యాప్త మద్దతు అసలు అమరావతి ఉద్యమానికి లేనే లేదు. […]

అమరావతి అనేది ముగిసిన అధ్యాయం. కనీసం గవర్నర్ ఆమోదముద్రతో అయినా అమరావతిపై ఆశలు వదులుకోవాల్సిందే. అయినా సరే టీడీపీ, దాని అనుకూల మీడియా, టీడీపీ సోషల్ మీడియా వింగ్.. ఇంకా అమరావతి రైతుల్ని భ్రమల్లోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అమరావతి కథ ముగిసిపోలేదని, న్యాయపోరాటం చేస్తున్నామని మరింతగా రెచ్చగొడుతున్నాయి. రైతుల పేరుతో మొదలైన ఉద్యమం కరోనా కష్టకాలం తర్వాత ఒకరిద్దరు పలకలు పట్టుకుని ఇచ్చే ప్రదర్శనలకు పరిమితమైంది. రాష్ట్రవ్యాప్త మద్దతు అసలు అమరావతి ఉద్యమానికి లేనే లేదు.
ఉత్తరాంధ్ర వాసులు శాసన రాజధానిని ఎందుకు వద్దనుకుంటారు. రాయలసీమవాళ్లు తమకు హైకోర్టు వద్దు అమరావతిలోనే పెట్టండి అని ఎందుకు చెబుతారు. ఎవరి ప్రాంతం అభివృద్ధి చెందాలని వారు అనుకోవడం సహజం.
అయితే ఆ అభివృద్ధి అంతా తమ ప్రాంతానికే పరిమితం కావాలనుకోవడం స్వార్థం. సరిగ్గా అలాంటి స్వార్థ ప్రయోజనాలకే బాటలు వేసింది టీడీపీ. అమరావతి పేరుతో చుట్టుపక్కల భూములతో వ్యాపారం మొదలు పెట్టింది. దీంట్లో లాభపడిందంతా టీడీపీ నాయకులు, వారి అనుయాయులు.
ఐదేళ్ల పాలనలో కేవలం తాత్కాలిక భవనాలతో సరిపెట్టిన బాబు… ప్రజలు మరో ఐదేళ్లు అవకాశమిచ్చి ఉంటే అమరావతి పేరుతో మరింత షో చేసేవారు. అసలు చంద్రబాబు హయాంలో అమరావతికి రూపురేఖలు పూర్తిగా వచ్చేస్తే, ఇక జగన్ కి రాజధాని తరలింపు ఆలోచన ఎందుకొస్తుంది. తాత్కాలిక భవనాలతో మోసం చేశారు కాబట్టే.. జగన్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం లభించింది.
అభివృద్ధి వికేంద్రీకరణతో మూడు ప్రాంతాలకు లాభం చేకూరుతుందనే విషయం తెలిసినా కూడా అమరావతి బిజినెస్ దెబ్బతింటుందని టీడీపీ ఉద్యమాన్ని ప్రేరేపించింది. రైతుల్ని రెచ్చగొట్టి కొన్నాళ్లు హడావిడి చేసింది. ఇప్పుడా హడావిడి తగ్గిపోయింది. రాగా పోగా.. రాజధాని తరలిపోతే తమ భూముల విలువలు పడిపోతాయని బాధపడే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకే కష్టమంతా.
తాజాగా గవర్నర్ రాజముద్రతో ఇక అమరావతి విషయంలో రెండో ఆలోచనకు తావులేదని అర్థమవుతోంది. శాసన సభ ఆమోదించి, గవర్నర్ ఆమోదించి చట్టంగా మారిన బిల్లులో కోర్టులు జోక్యం చేసుకుంటాయనుకోవడం అవివేకం. అయినా సరే రైతుల్ని రెచ్చగొట్టి మరికొన్నాళ్లు ఈ సమస్యను పచ్చిపుండులా మార్చాలని చూస్తున్నారు టీడీపీ నేతలు. గవర్నర్ ప్రకటన రాగానే.. కథ ఇంకా మిగిలే ఉందంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు.