మనదేశంలో... కరోనాలో జ్వరం లక్షణం తక్కువ!
ఒళ్లు వెచ్చబడి చిన్నపాటి జ్వరం రావటం అనేది ఎప్పుడైనా ఎవరి విషయంలో అయినా జరగవచ్చు. కానీ ఇప్పుడు కోవిడ్ 19 మహమ్మారి ప్రవేశం తరువాత దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరం లాంటి మామూలు లక్షణాలే ప్రాణాంతకంగా కనబడుతున్నాయి. కొంచెం జ్వరమొచ్చినా అది కరోనానేమో అనే అనుమానంతో భయ భ్రాంతులకు గురవుతున్నారు చాలామంది. అలాంటి వారికి ధైర్యాన్నిచ్చేలా ఒక విషయాన్ని వెల్లడించింది ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్). జ్వరమొక్కటే ఉంటే దానిని కోవిడ్ […]
ఒళ్లు వెచ్చబడి చిన్నపాటి జ్వరం రావటం అనేది ఎప్పుడైనా ఎవరి విషయంలో అయినా జరగవచ్చు. కానీ ఇప్పుడు కోవిడ్ 19 మహమ్మారి ప్రవేశం తరువాత దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరం లాంటి మామూలు లక్షణాలే ప్రాణాంతకంగా కనబడుతున్నాయి. కొంచెం జ్వరమొచ్చినా అది కరోనానేమో అనే అనుమానంతో భయ భ్రాంతులకు గురవుతున్నారు చాలామంది. అలాంటి వారికి ధైర్యాన్నిచ్చేలా ఒక విషయాన్ని వెల్లడించింది ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్). జ్వరమొక్కటే ఉంటే దానిని కోవిడ్ 19 లక్షణంగా పరిగణించలేమని తెలిపింది.
ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్ లో హర్యానాలోని జాజ్జర్ ఎయిమ్స్ లో కోవిడ్ 19 తో చేరిన 144 మందిపైన ఇటీవల అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చిలో ప్రచురించారు.
‘మనదేశంలో కోవిడ్ పేషంట్లలో జ్వరం ఎక్కువగా కనిపించడం లేదు. అధ్యయనంలో చూసిన పేషంట్లలో 17శాతం మందిలో మాత్రమే జ్వరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వెల్లడవుతున్న వివరాలను బట్టి చూస్తే ఇది చాలా తక్కువ. చైనాలో కూడా హాస్పటల్ లో చేరేటప్పుడు 44 శాతం మంది కోవిడ్ 19 పేషంట్లలో, హాస్పటల్ లో చేరిన తరువాత 88శాతం మందిలో జ్వరం ఉంటోంది. మనదేశంలో కరోనా పాజిటివ్ వచ్చి హాస్పటల్ లో చేరుతున్నవారిలో దాదాపు 44శాతం మందిలో అసలు ఏ లక్షణాలు ఉండటం లేదు. అంతేకాదు వారు హాస్పటల్ లో ఉన్నన్ని రోజులు కూడా లక్షణాలు ఉండటం లేదు.’ అధ్యయన నివేదిక చెబుతున్న విషయాలు ఇవి.
జ్వరముంటేనే కరోనా ఉన్నట్టని భావించడం వలన… కరోనా ఉండీ జ్వరం లేనివారు చాలామంది బయట యధేచ్చగా తిరుగుతూ వైరస్ ని వ్యాప్తి చేస్తున్నారని పరిశోధకులు అంటున్నారు. అధ్యయన ఫలితాలను బట్టి 44.4శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. 34.7శాతం మందిలో దగ్గు ఉంటోంది. 17.4శాతం మందిలో జ్వరం ఉండగా రెండుశాతం మందిలో ముక్కుకి సంబంధించిన లక్షణాలు కనిపించాయి.
జ్వరం ఒక్కటే ఉన్నపుడు దానిని పూర్తిస్థాయిలో కరోనా లక్షణంగా మనం పరిగణించలేమని, అలాగే ఇతర లక్షణాలు ఉండి జ్వరం లేకపోతే కరోనా లేనట్టేనని భావించడమూ తగదని దీనిని బట్టి తెలుస్తోంది. మనదేశంలో అసలే లక్షణాలు లేకుండానే ఇది ఎక్కువగా వ్యాపిస్తోంది కనుక… నిరంతరం అప్రమత్తంగా ఉండటం అవసరం.