శిఖరంపైన చదువు... శిఖరమంత ఆశయం !
జీవితంలో అనుకోకుండా వచ్చే కష్టనష్టాలు, మార్పులు… అన్నింటికీ మనిషి నిదానంగా అయినా అలవాటు పడాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే మార్పుని జీర్ణించుకోవడమే ప్రగతి. అయితే అలా జీర్ణించుకోవటం అంత సులువు కాదు. అందుకు చాలా మానసిక పరిణితి కావాలి. రాజస్థాన్ కి చెందిన పన్నెండేళ్ల కుర్రాడు హరీష్ లో అలాంటి పరిణితే కనబడుతోంది. హరీష్ జవహర్ నవోదయా విద్యాలయంలో ఏడవ తరగతి చదువుతున్నాడు. పాచ్ పద్రా అనే గ్రామం ఇతనిది. లాక్ డౌన్ కారణంగా స్కూళ్లకు నేరుగా […]
జీవితంలో అనుకోకుండా వచ్చే కష్టనష్టాలు, మార్పులు… అన్నింటికీ మనిషి నిదానంగా అయినా అలవాటు పడాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే మార్పుని జీర్ణించుకోవడమే ప్రగతి. అయితే అలా జీర్ణించుకోవటం అంత సులువు కాదు. అందుకు చాలా మానసిక పరిణితి కావాలి. రాజస్థాన్ కి చెందిన పన్నెండేళ్ల కుర్రాడు హరీష్ లో అలాంటి పరిణితే కనబడుతోంది. హరీష్ జవహర్ నవోదయా విద్యాలయంలో ఏడవ తరగతి చదువుతున్నాడు. పాచ్ పద్రా అనే గ్రామం ఇతనిది.
లాక్ డౌన్ కారణంగా స్కూళ్లకు నేరుగా వెళ్లే పరిస్థితి లేకపోవటం వలన ప్రస్తుతం హరీష్ కి ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అయితే తన ఇంట్లో కూర్చుని పాఠాలు నేర్చుకుందామంటే నెట్ వర్క్ అందటం లేదు. దాంతో ప్రతిరోజు పుస్తకాలు టేబుల్ కుర్చీ ఫోన్ వగైరాలన్నీ మోసుకుని పావుగంటపాటు ఎత్తయిన కొండలు ఎక్కుతున్నాడు. సిగ్నల్స్ అందే ప్రదేశానికి చేరుకుని అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని చదువుకుంటున్నాడు. ఎండయినా వానయినా… వాతావరణం ఎలా ఉన్నా హరీష్ క్లాసులు మాత్రం మిస్ కావటం లేదు.
తను కూడా అదే చెబుతున్నాడు ‘ఒక్క క్లాసు కూడా వదలకుండా హాజరవుతున్నాను. పాఠాలు వినకపోతే ఆ సబ్జక్టుల్లో నేను వెనుకబడి పోతాను… అది నాకు ఇష్టం లేదు. అవును… లాక్ డౌన్ మనందరి జీవితాల్లో ఏదో ఒక రకంగా కష్టాలను తీసుకొచ్చింది. అయితే ఈ మార్పులను మనం అంగీకరించాలి. ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న పరిస్థితులనే నా కొత్త సాధారణ జీవనశైలిగా నేను భావిస్తున్నాను’ అంటున్నాడు హరీష్.
సైన్స్ తనకు ఇష్టమైన సబ్జక్టు అంటున్న హరీష్ భవిష్యత్తులో యుపిఎస్ సి పరీక్షలు రాసి ఐఏఎస్ కావాలని ఆశిస్తున్నాడు. ‘నేను గొప్ప విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తానో లేదో తెలియదు కానీ… మారుమూల పల్లెలకు సైతం టెక్నాలజీని, సౌకర్యాలను అందిస్తాను. ఇప్పుడున్న కరోనా పరిస్థితులను చూశాక… ప్రభుత్వ అధికారులు తలచుకుంటే తమ పాలసీల ద్వారా మంచి మార్పులను తీసుకురాగలరని నాకు అర్థమవుతోంది’ అంటున్నాడీ భావిభారత పౌరుడు.
హరీష్ ఎత్తయిన కొండపై చదువుకుంటూ స్థానిక విలేకరుల కంటబడటంతో అతని వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ హరీష్ గురించి చేసిన ట్వీట్ కి వేల కొద్దీ రీ ట్వీట్లు, లైకులు వస్తున్నాయి.
హరీష్ తండ్రి వీరమ్ తన కొడుకుకి చదువు అంటే చాలా ఇష్టమని చెబుతూ… ‘ మా ఇంటి దగ్గర మొబైల్ నెట్ వర్క్ అందటం లేదు. హరీష్ దానిని సాకుగా చూపించి పాఠాలు ఎగ్గొట్టకుండా ఇలా కష్టపడి చదువుకోవటం నాకు చాలా గర్వంగా ఉంది’ అంటున్నాడు.
వీరమ్ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తమకు వచ్చే ఆదాయంతో రెండుపూటలా తినడమే కష్టంగా ఉందని… హరీష్ ఆన్ లైన్ చదువుకోసం చేస్తున్న ఇంటర్నెట్ కనెక్షన్ ఖర్చు తమకు భారంగా ఉందని అతనన్నాడు. ప్రభుత్వం కానీ లేదా స్కూలు కానీ ఈ కష్టకాలం పోయే వరకు ఉచిత డాటా ఇవ్వాలని వీరమ్ కోరుతున్నాడు.