Telugu Global
National

ఆమె ఆటోకి... అమ్మమనసుంది !

పెర్నాన్ కిలా కర్ణాటకలోని ఒక పల్లెటూరు. ఆ ఊళ్లో ఒక గర్భిణికి తెల్లవారుజామున మూడింటికి నొప్పులొచ్చాయి. వెంటనే ఆమెని హాస్పటల్ కి తీసుకుని వెళ్లడానికి ఆటో కోసం ఫోన్ చేశారు ఆమె తాలూకూ వాళ్లు. కాసేటికి ఆమె ఇంటి ముందు ఆటో సిద్ధంగా ఉంది. ఆ ఆటో డ్రైవర్ ఒక మహిళ. ఆమె పేరు రాజీవి (53). అంతకుముందు రోజే అదే గర్భిణిని ఆమె ఉడిపిలోని ప్రభుత్వ ప్రసూతి హాస్పటల్ కి తన ఆటోలోనే తీసుకుని వెళ్లింది. […]

ఆమె ఆటోకి... అమ్మమనసుంది !
X

పెర్నాన్ కిలా కర్ణాటకలోని ఒక పల్లెటూరు. ఆ ఊళ్లో ఒక గర్భిణికి తెల్లవారుజామున మూడింటికి నొప్పులొచ్చాయి. వెంటనే ఆమెని హాస్పటల్ కి తీసుకుని వెళ్లడానికి ఆటో కోసం ఫోన్ చేశారు ఆమె తాలూకూ వాళ్లు. కాసేటికి ఆమె ఇంటి ముందు ఆటో సిద్ధంగా ఉంది. ఆ ఆటో డ్రైవర్ ఒక మహిళ. ఆమె పేరు రాజీవి (53). అంతకుముందు రోజే అదే గర్భిణిని ఆమె ఉడిపిలోని ప్రభుత్వ ప్రసూతి హాస్పటల్ కి తన ఆటోలోనే తీసుకుని వెళ్లింది. తరువాత రోజే నొప్పులు రావటంలో రాజీవి కోసం కాల్ చేశారు ఆ గర్భిణి తాలూకూ వాళ్లు.

తెల్లవారక ముందే రాజీవి ఆమెని హాస్పటల్ కి చేర్చింది. ఆటోని నిదానంగా జాగ్రత్తగా నడిపింది. కొన్ని గంటల్లో ఆడపిల్ల జన్మించింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. దాంతో రాజీవి హాయిగా ఆనందంగా ఊపిరి పీల్చుకుంది. ఇంత చేసిన రాజీవి ఆ నొప్పులు పడుతున్న అమ్మాయికి బంధువో లేదా తెలిసిన వ్యక్తో కాదు. వాళ్లకి ఆమెని దగ్గర చేసింది రాజీవిలోని సహాయ గుణం. గర్భిణులను ఉచితంగా హాస్పటల్స్ కి తీసుకుని వెళ్లటం, ఎప్పుడు కావాలన్నా వారికి అందుబాటులో ఉండటం రాజీవికి అలవాటు.

రాజీవి ఆషా వర్కర్ గా పనిచేస్తోంది. మధ్యాహ్నం నుండి ఆటో నడుపుతుంటుంది. గర్భిణులు ఆటో ఎక్కితే డబ్బు తీసుకోదు ఆమె. ‘ఇప్పటివరకు నా ఆటోలో దాదాపు 150మంది గర్భిణులను హాస్పటల్స్ కి తీసుకుని వెళ్లి ఉంటాను. కరోనా కారణంగా ఆషా వర్కర్ గా ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావటం వలన ఇప్పుడు ఎక్కువ సమయం ఆటో నడపటం లేదు’ అంటున్నారామె.

రాజీవికి ఇద్దరు పిల్లలు. భర్త అయిదేళ్ల క్రితం మరణించాడు. ఇరవై ఏళ్లుగా ఆమె ఆటో నడుపుతోంది. భర్త కూడా ప్రోత్సహించేవాడు. పదేళ్ల క్రితం ఒక ప్రభుత్వ వైద్యుని సలహా మేరకు ఆషా వర్కరుగా చేరింది. ఆటో డ్రైవరుగా, ఆషా వర్కరుగా పనిచేస్తూ కుటుంబాన్ని నడుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు రాజీవి కుమార్తెకు వివాహం అయ్యింది. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. పెర్నాన్ కిలా లో మారుమూల ప్రాంతాల్లో బస్ సర్వీస్ లేని చోట్ల రాజీవి ఆటో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ముఖ్యంగా గర్భిణులను సమయానికి హాస్పటల్ కి చేర్చుతూ… అదీ ఉచితంగా తీసుకువెళుతూ ఆమె తనలోని సేవా స్ఫూర్తిని చాటుతున్నారు.

First Published:  25 July 2020 12:12 PM IST
Next Story