Telugu Global
National

సీసీ కెమేరాల నిఘాలో ప్రపంచంలోనే హైదరాబాద్ టాప్ 16

హైదరాబాద్ నగరంలో రోడెక్కితే చాలు మనం సీసీ కెమేరాల నిఘాలో ఉంటాం. నగరంలోని ప్రధాన రోడ్లపై 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. కనీసం 20 సీసీ కెమేరాలను దాటాల్సి ఉంటుంది. బ్రిటన్‌కు చెందిన ‘కంపారిటెక్’ అనే టెక్నాలజీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 150 నగరాల్లో సీసీ కెమేరాలపై అధ్యయనం చేసింది. దీనిపై ఒక నివేదిక రూపొందించగా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ 1000 మందిలో అత్యధిక కెమేరాలు కల్గిన నగరాల్లో టాప్ 16లో హైదరాబాద్ ఉంది. లండన్ మూడో స్థానంలో […]

సీసీ కెమేరాల నిఘాలో ప్రపంచంలోనే హైదరాబాద్ టాప్ 16
X

హైదరాబాద్ నగరంలో రోడెక్కితే చాలు మనం సీసీ కెమేరాల నిఘాలో ఉంటాం. నగరంలోని ప్రధాన రోడ్లపై 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. కనీసం 20 సీసీ కెమేరాలను దాటాల్సి ఉంటుంది.

బ్రిటన్‌కు చెందిన ‘కంపారిటెక్’ అనే టెక్నాలజీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 150 నగరాల్లో సీసీ కెమేరాలపై అధ్యయనం చేసింది. దీనిపై ఒక నివేదిక రూపొందించగా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ 1000 మందిలో అత్యధిక కెమేరాలు కల్గిన నగరాల్లో టాప్ 16లో హైదరాబాద్ ఉంది. లండన్ మూడో స్థానంలో ఉండగా, హైదరాబాద్ 16వ స్థానంలో ఉంది. టాప్ 20 మిగతా నగరాలన్నీ చైనాకు సంబంధించినవే ఉండటం గమనార్హం.

ప్రభుత్వాల దగ్గర ఉన్న నివేదికలు, పోలీసు వెబ్‌సైట్లు, ఇతర రిపోర్టులను క్రోఢీకరించి ఈ సీసీ కెమెరాల సంఖ్యను రూపొందించింది. ముఖ్యంగా పోలీస్, ప్రభుత్వ శాఖలు ప్రజల కోసం ఉపయోగిస్తున్న సీసీ టీవీలపై ప్రత్యేక దృష్టిపెట్టి ఆ సంఖ్యను రాబట్టి వార్షిక నివేదికలో పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా నేరాలు పెరిగిపోతున్న సమయంలో సీసీకెమేరాల ఆవశ్యకత ఎంతో ప్రధానంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రైవేటు సంస్థలు కలిపి చాలా చోట్ల సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటన్నింటినీ ఒకే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయడం ద్వారా ప్రజల భద్రతను పెంచినట్లైంది.

ప్రపంచంలోని టాప్ 20 నగరాల్లో 18 నగరాలు చైనాకు చెందినవే ఉన్నాయి. ప్రతీ 1000 మందికి ఎన్ని సీసీ కెమేరాలు ఉన్నాయనే దాని ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. లండన్ మూడో స్థానంలో, తెలంగాణ 16వ స్థానంలో ఉండగా.. ఇండియాలో మాత్రం హైదరాబాద్ నగరమే టాప్ పొజిషన్‌లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 77 కోట్ల సీసీ కెమేరాలు ఉండగా.. వాటిలో 41.58 కోట్ల సీసీ కెమేరాలు చైనాలోనే ఉన్నాయి. ఇక 2021 కల్లా ప్రపంచంలో సీసీ కెమేరాల సంఖ్య 100 కోట్లకు చేరుకుంటుందని.. చైనాలో 54 కోట్ల కు చేరుకుంటాయని సంస్థ అంచనా వేసింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సీసీ కెమేరాలను నేరాల నివారణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, క్రమబద్దీకరణ వంటి పనులకు ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉన్న కెమేరాలే. చాలా చోట్ల ఈ కెమేరాలు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా మనుషులను గుర్తు పడుతున్నాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా తప్పించుకుకొని తిరిగే నేరస్థులను కూడా పట్టు కోవడం సాధ్యమవుతున్నది. అంతే కాకుండా తప్పిపోయిన చిన్నారులు, పెద్దలను కూడా సీసీ కెమేరాల సాయంతో వెతకడం సులభంగా మారింది.

ప్రపంచ వ్యాప్తంగా తీసిన లెక్కల ప్రకారం ఇండియాలో హైదరాబాద్ తర్వాత, చెన్నై, ఢిల్లీలోనే అత్యధిక సీసీ కెమేరాలు ఉండటం గమనార్హం. హైదరాబాద్‌లో మొత్తం 3 లక్షల సీసీ కెమేరాలు ఉన్నాయి. అంటే ప్రతీ 1000 మందికి 29.99 సీసీ కెమేరాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కాగా, ఈ టాప్ 20 నగరాల్లో క్రైమ్ రేటు ఎక్కువగా ఉన్నది కూడా హైదరాబాద్‌లోనే.

హైదరాబాద్‌లో సీసీ కెమేరాలు ఎక్కువగానే ఉన్నా క్రైమ్ రేట్ 47 శాతం ఉంది. టాప్ 50 నగరాల్లో చెన్నైలో 2.8 లక్షల కెమేరాలు ఉండగా.. ఇక్కడ ప్రతీ వెయ్యి మందికి 25.52 కెమేరాలు ఉన్నాయి. క్రైమ్ ఇండెక్స్ రేటు 40.38 శాతంగా ఉంది. ఇక ఢిల్లీలో ప్రతీ వెయ్యి మందికి 14.18 కెమేరాలు ఉండగా.. క్రైమ్ రేటు కూడా హైదరాబాద్ కంటే ఎక్కవగా 58.69గా నమోదైంది. దేశ ఆర్థిక రాజధానిలో ప్రతీ వెయ్యి మందికి 0.48 కెమేరాలే ఉండటం గమనార్హం.

First Published:  24 July 2020 4:21 AM IST
Next Story