Telugu Global
National

లంచ్ బాక్స్ బిజినెస్.... నెలకు 45 లక్షల ఆదాయం !

కొన్ని నిజాలు నమ్మలేనట్టుగానే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. గత ఏడేళ్లుగా చెన్నైకి  చెందిన కృపా ధర్మరాజ్…. తన ఖాతాదారులకు లంచ్ బాక్సులను అందిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఐటి జాబ్ వదిలేసి ఈ స్టార్టప్ ని ప్రారంభించిన ఆమె… అందులో నూరుశాతం విజయం సాధించారు. ప్రతి రోజు పోషకాలతో నిండిన ఆహారంతో వెయ్యికి పైగా లంచ్ బాక్సులను సిద్దం చేస్తున్నారు ఆమె టీమ్. ఇందులో ఆపరేషన్స్ టీమ్, టెక్ టీమ్, చెఫ్ లు, డైటీషియన్లు… ఇలా రకరకాల […]

లంచ్ బాక్స్ బిజినెస్.... నెలకు 45 లక్షల ఆదాయం !
X

కొన్ని నిజాలు నమ్మలేనట్టుగానే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. గత ఏడేళ్లుగా చెన్నైకి చెందిన కృపా ధర్మరాజ్…. తన ఖాతాదారులకు లంచ్ బాక్సులను అందిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఐటి జాబ్ వదిలేసి ఈ స్టార్టప్ ని ప్రారంభించిన ఆమె… అందులో నూరుశాతం విజయం సాధించారు.

ప్రతి రోజు పోషకాలతో నిండిన ఆహారంతో వెయ్యికి పైగా లంచ్ బాక్సులను సిద్దం చేస్తున్నారు ఆమె టీమ్. ఇందులో ఆపరేషన్స్ టీమ్, టెక్ టీమ్, చెఫ్ లు, డైటీషియన్లు… ఇలా రకరకాల విభాగాల వారు మొత్తం కలిపి యాభై మందికి పైగా ఉన్నారు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లలకు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు పోషకాలతో కూడిన సంతులన ఆహారాన్ని అందిస్తున్నారు వారు.

అంతేకాదు చెన్నైలోని చాలా స్కూళ్లలో కృప… పిల్లలకోసం గ్రీన్ క్యాంటీన్లను నడుపుతున్నారు. వీటిలో సైతం పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం కృపా ధర్మరాజ్ సంస్థ ఎమ్ సీస్ లంచ్ బాక్స్ సంపాదన నెలకు దాదాపు నలభై అయిదు లక్షలు. ఒక్క చిన్న ఆలోచనతో మొదటి అడుగు వేసిన ఆమె ఈ స్థాయికి రావడానికి అంతులేని కృషి చేశారని వేరే చెప్పాల్సిన పని లేదు కదా.

ఇంజినీరింగ్ చదివిన కృపా ధర్మరాజ్ తరువాత ఒక ఐటి కంపెనీలో పనిచేశారు. అప్పుడే వివాహం అయ్యింది. ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారి. కృపా కూడా భర్తకు వ్యాపారంలో సహాయం చేస్తుండేవారు. అప్పుడే ఆమెకు బిజినెస్ పరంగా తెలివితేటలు నైపుణ్యం ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వలన ప్రభావితమై తాను కూడా సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నారామె.

2010లో కృపా ధర్మరాజ్ కు కుమారుడు మాఘీ పుట్టాడు. చిన్న పిల్లలు చక్కగా పెరగాలంటే ఎలాంటి ఆహారం ఇవ్వాలి… అనేది ఆ సమయంలో ఆమెకు సమస్యగా కనిపించేది. ఈ క్రమంలోనే పిల్లలకు పోషకాహారం అందించే వ్యాపారం… ఆలోచన వచ్చింది. అదే మాఘీస్ లంచ్ బాక్స్ గా రూపు దాల్చింది. కంపెనీని మొదలుపెట్టక ముందు కృపా చాలామంది తల్లులతో తమ పిల్లలకు ఇచ్చే లంచ్ బాక్స్ గురించి మాట్లాడారు. అయితే దాదాపు అందరూ… పిల్లలు కడుపు నిండా తింటే చాలు అన్నట్టుగానే చెప్పారు. పోషక విలువలు అనే ఆలోచనే వారిలో లేకపోవటం గమనించిన కృపా…. ఆ గ్యాప్ ని తమ కంపెనీ ద్వారా భర్తీ చేయవచ్చని భావించారు.

తమ కంపెనీని మొదలు పెట్టడానికి ప్రారంభ సన్నాహంగా… రెండువేల లంచ్ బాక్సులకు కొన్ని స్కూళ్లకు ఉచితంగా పంచిపెట్టారు. ఆ తరువాత వారికి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావటం మొదలైంది. ఒకేరకం కాకుండా భిన్నరకాల ఆహారం లంచ్ బాక్సు ల్లో అందిస్తున్నారు వారు. ఎవరికి నచ్చిన మెనూని వారు ఎంపిక చేసుకోవచ్చు. స్కూళ్లకు లేదా ఆఫీస్ లకు ఆయా వ్యక్తుల పేర్లతో వారు ఎంపిక చేసుకున్న ఆహారంతో లంచ్ బాక్స్ వెళుతుంది.

మూడు చపాతీలు, పప్పు, కూర, బాస్మతీ రైస్ తో అన్నం, తియ్యని పెరుగు, పచ్చడి, అప్పడాలు… ఇవన్నీ కలిపితే ఒక రకం లంచ్ బాక్స్. ఒక్క రొట్టే, రెండు రకాల అన్నాలు, పెరుగన్నం, రెండు కూరలు, పచ్చడి, స్వీటు… ఇది మరొక రకం లంచ్ బాక్స్. కూరగాయలు, స్వీట్లు, అన్నం రకాలు మార్చుతుంటారు. ఒక్కో లంచ్ బాక్స్ ఖరీదు రూ. 150 నుండి 200 వరకు ఉంటుంది. రెగ్యులర్ ఆర్డర్లతో పాటు… అప్పుడప్పుడు వచ్చే రిటైల్ ఆర్డర్లను సైతం తీసుకుని ఆహారం తయారు చేస్తుంటారు.

ఒక్క సంవత్సరంలోనే తమకు బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ కూడా కావాలని చాలామంది అడిగారని కృపా ధర్మరాజ్ అన్నారు. త్వరలోనే మధుమేహం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా ఆహారం తయారుచేయాలనుకుంటున్నామని కృపా భర్త మేయిల్ అన్నారు.

ఈ ఏడాది జనవరి నుండి మరొక కొత్త ప్రాజెక్టుని సైతం మొదలుపెట్టారు కృపా ధర్మరాజ్. ఎవరికి ఎలాంటి ఆహారం అవసరం అనే విషయంలో సలహాలు, కౌన్సెలింగ్ ఇచ్చే ఈ ప్రాజెక్టుని తను సంపాదించిన అనుభవం, విజ్ఞానంతో రూపొందించారామె. వ్యక్తుల బరువు, ఆరోగ్యం, వారి బాడీ మాస్ ఇండెక్స్, ఆహారపు అలవాట్లు తదితర వివరాలను తెలుసుకుని ఆయా వ్యక్తులు ఏం తినాలో సూచిస్తున్నారు. కేవలం డబ్బుకోసం కాకుండా ఇష్టంతో తపనతో పనిచేసినప్పుడు జనం మనల్ని నమ్ముతారని… అంటారు కృపా ధర్మరాజ్.

First Published:  20 July 2020 10:55 AM IST
Next Story