Telugu Global
International

'ఐసీఎంఆర్ సర్వే నిజమైతే... ఇండియాలో కరోనా వైరస్ కేసులు 14 కోట్లు ఉండొచ్చు'

ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దేశంలో చేసిన సిరలాజికల్ (యాంటీ బాడీస్ టెస్ట్) సర్వే ఫలితాలు కనుక నిజమైనవే అయితే ఇండియాలో ఇప్పటికే 14 కోట్ల మందికి కరోనా వైరస్ సోకి ఉంటుందని డాక్టర్ షాహిద్ జమీల్ అభిప్రాయపడ్డారు. గత నెల 11న ఈ సర్వే ఫలితాలను ఐసీఎంఆర్ వెల్లడించిందని, ఆ గణాంకాలను పరిశీలిస్తే 140 నుంచి 150 మిలియన్ ఇండియన్లు కరోనా బారిన పడినట్లేనని ఆయన చెప్పారు. వైరస్ అధ్యయన శాస్త్రంలో […]

ఐసీఎంఆర్ సర్వే నిజమైతే... ఇండియాలో కరోనా వైరస్ కేసులు 14 కోట్లు ఉండొచ్చు
X

ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దేశంలో చేసిన సిరలాజికల్ (యాంటీ బాడీస్ టెస్ట్) సర్వే ఫలితాలు కనుక నిజమైనవే అయితే ఇండియాలో ఇప్పటికే 14 కోట్ల మందికి కరోనా వైరస్ సోకి ఉంటుందని డాక్టర్ షాహిద్ జమీల్ అభిప్రాయపడ్డారు.

గత నెల 11న ఈ సర్వే ఫలితాలను ఐసీఎంఆర్ వెల్లడించిందని, ఆ గణాంకాలను పరిశీలిస్తే 140 నుంచి 150 మిలియన్ ఇండియన్లు కరోనా బారిన పడినట్లేనని ఆయన చెప్పారు. వైరస్ అధ్యయన శాస్త్రంలో దేశంలోనే ప్రముఖులైన వారిలో డాక్టర్ షాహిద్ జమీల్ ఒకరు. ఆయన 2000లో ప్రఖ్యాత శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును అందుకున్నారు. తాజాగా ఆయన ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కరోనాకు సంబంధించి అనేక విషయాలు వెల్లడించారు.

దేశంలో కరోనా ఎంత మందికి సోకిందో అంచనా వేయడానికి మూడు పద్దతులను అనుసరించవచ్చు. ఇందులో మొదటిది మరణాల రేటును గణాంకాలతో పోల్చి చూడటం ద్వారా ఒక అంచనాకు రావచ్చు. గత వారం వరకు కోవిడ్-19తో మరణించిన వాళ్ల సంఖ్య 23,727గా ఉంది. అంటే కరోనా బారిన పడిన వారిలో 0.08 శాతం మంది మరణించారు. దీని సహాయంతో గణిస్తే.. దేశంలో ప్రస్తుతం 3 కోట్ల మందికి వైరస్ సోకి ఉంటుందని జమీల్ అన్నారు.

ఇక రెండో పద్దతిలో అయితే.. లాన్సెట్ జర్నల్ ప్రచురించిన విధానంలో ఈ రోజు సంభవించిన మరణాల రేటు ప్రకారం గణించడం. అంటే ప్రస్తుతం మరణాల రేటు 0.5 శాతం అనుకుంటే ఇప్పటికే 80 లక్షల నుంచి 1 కోటి మంది వైరస్ బారిన పడి ఉంటారు.

ఇక బ్రిటన్‌లోని మిడిల్‌సెక్స్ యూనివర్సిటీకి చెందిన మురాద్ బనాజీ రూపొందించిన విధానం. దీని ప్రకారం అయితే 2 నుంచి 5 కోట్ల మంది దేశంలో వైరస్ బారిన పడినట్లు తేలుతుంది.

మనం ఏ పద్దతిలో లెక్కించినా ప్రస్తుతం బయటకు వచ్చిన లెక్కల కంటే ఎక్కువగానే వైరస్ వ్యాప్తి చెందింది. ఐసీఎంఆర్ విధానంలో లెక్కిస్తే కనీసం 1 కోటి మందికి అత్యధికంగా 14 కోట్ల మందికి వైరస్ సోకినట్లు మనం అంచనా వేయవచ్చని డాక్టర్ జమీల్ స్పష్టం చేశారు. ప్రతీ రోజు దేశవ్యాప్తంగా 30 వేల కేసులు నమోదవతున్నాయి. మనం ఒక మిలియన్ కేసులను దాటి పోతున్నామంటే పరిస్థితి ఆందోళనకరమే అని ఆయన అన్నారు. ప్రతీ రోజు 3 శాతం కేసులు పెరగడం చాలా ప్రమాదకరమని డాక్టర్ జమీల్ చెప్పారు.

కేసుల పెరుగుదల రేటును గణనీయంగా తగ్గించడంలో ఢిల్లీ ప్రభుత్వం విజయవంతమయ్యింది. ప్రస్తుతం 1300 కేసుల కంటే తక్కువే నమోదవుతున్నాయి. అంటే ప్రతీ పది కేసుల్లో ఒకటి పాజిటివ్‌గా నిర్థారణ అవుతోంది. దీన్ని ప్రతీ 20 కేసులకు ఒక పాజిటివ్‌కు తీసుకొని రావల్సిన అవసరం ఉంది. పాజిటివిటీ రేటను మరో 5 శాతం తగ్గిస్తే కాని ఢిల్లీలో పరిస్థితి అదుపులోనికి రాదని జమీల్ స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కూడా పాజిటివిటీ రేటును తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు. జూన్ చివరి నాటికి 7.8 శాతం ఉన్న పాజిటివిటీ రేటు జులై 5 నుంచి 12 మధ్యలో ఒక్కసారిగా 11.4 శాతానికి పెరిగింది. పాజిటివిటీ రేటు పెరిగిందంటే మనం టెస్టులు సరిపడినంతగా చేయడం లేదనే అర్థం. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ చెప్పినట్లు ఇండియా తగినన్ని టెస్టులు చేయడం లేదనేది నిజమే. దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచి పాజిటివిటీ రేటను 5 శాతం కంటే తక్కువ చేయాలి.

రాబోయే మూడు నెలలు చాలా కీలకమైనవి. ప్రభుత్వం ఇందుకోసం తప్పకుండా సరైన వ్యహం సిద్దం చేయాలి. ముందుగా కరోనా సోకిన వారందరినీ భారీగా గుర్తించి వారిని ఐసోలేషన్‌కు పంపాలి. ఐసోలేషన్ కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే ఉండాలి. అంతే కానీ అందరినీ తీసుకొని వచ్చి ఒకే దగ్గర బంధీలుగా చేయకూడదు. ఏ ప్రాంతం, గ్రామంలో ప్రజలు అక్కడే ఐసోలేట్ అయితే చక్కని ఫలితాలు వస్తాయని జమీల్ చెప్పారు.

ఇప్పటి వరకు కరోనా సోకితే ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. కానీ కొన్ని అధ్యయనాల్లో కోవిడ్-19 సోకిన వారిలో మెదడు, గుండెపై కూడా ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇది శరీరంలోని పలు వ్యవస్థలపై ప్రభావం చూపే వ్యాధి అని డాక్టర్ జమీల్ చెప్పారు. ఇది నేరుగా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి పలు అవయవాలు పని చేయకుండా అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉంది.

ఇటీవల కొన్ని కేసులు పరిశీలిస్తే.. కరోనా బారిన పడిన వాళ్లు కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. అంతే కాకుండా ప్రతీ అవయవం నెమ్మదిగా రికవరీ కావడం, చాలా బాధాకరంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వైరస్ కొన్ని సార్లు చాలా అరుదైన లక్షణాలను చూపిస్తున్నది. అందుకే చికిత్సా విధానం కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటున్నది. ఇది చాలా కొత్త వైరస్ కాబట్టి దీనిపై అధ్యయనం చేయడానికి మరి కొంత సమయం పడుతుంది. అసలు ఈ వైరస్‌ను ఎదుర్కోవాలంటే ఎలాంటి రోగ నిరోధక శక్తి ఉండాలో కూడా ఇంకా తెలియలేదు.

ఇక యాంటీ బాడీల ద్వారా రికవరీ అనే దానిపై అధ్యయనం చేయాలి. ఒక వ్యక్తికి గతంలో వచ్చిన వ్యాధులు తిరిగి వస్తే ఎంత సమయంలో కోలుకున్నాడు. అతనిలో యాంటీ బాడీస్ ఎలా పని చేస్తున్నాయనేది అధ్యయనం చేస్తే కానీ కరోనా విషయంలో యాంటీ బాడీ థియరీని అర్థం చేసుకోలేమని జమీల్ అభిప్రాయపడ్డారు.

ఇక 239 మంది పరిశోధకలు ‘గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తున్నది’ అని డబ్ల్యూహెచ్‌వోకు రాసిన లేఖపై జమాల్ స్పందించారు. ఇది అసంబద్దంగా ఉందని అన్నారు. గాలి ద్వారా వ్యాప్తి చెందడాన్ని కొట్టి పారేయలేం.. కానీ ఒక వైరస్ గాలి ద్వారా ఇతరుల శరీరంలోకి ప్రవేశించి రోగాన్ని కలుగజేయాలంటే.. చాలా ఎక్కువ మొత్తంలో వైరస్‌ను పీల్చుకోవాలి. కానీ అంత మొత్తం గాలిలో ఎప్పుడూ ఉండదు అని డాక్టర్ చెప్పారు. మాస్కులు ధరించడం, రెండు మీటర్ల దూరం పాటించడం వల్ల వైరస్‌ను చాలా వరకు నియంత్రించ వచ్చని డాక్టర్ షాహిద్ జమీల్ చెప్పారు.

First Published:  16 July 2020 4:35 AM IST
Next Story