Telugu Global
International

ప్రపంచానికే ధారావి ఆదర్శం

కరోనాను జయించిన మురికివాడ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నది. దేశంలో కూడా రోజు రోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఆందోళనలో ఉన్నది. ప్రస్తుతం రెండో దశలోనే ఉన్న వైరస్ వ్యాప్తి.. సమూహ వ్యాప్తిగా మారితే మరింత ముప్పు ఉంటుందని పలు రాష్ట్రాలు ఆందోళనగా ఉన్నాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబైలో కనీసం ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకనంత తీవ్రంగా కరోనా వ్యాపిస్తున్నది. […]

ప్రపంచానికే ధారావి ఆదర్శం
X
  • కరోనాను జయించిన మురికివాడ
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నది. దేశంలో కూడా రోజు రోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఆందోళనలో ఉన్నది. ప్రస్తుతం రెండో దశలోనే ఉన్న వైరస్ వ్యాప్తి.. సమూహ వ్యాప్తిగా మారితే మరింత ముప్పు ఉంటుందని పలు రాష్ట్రాలు ఆందోళనగా ఉన్నాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబైలో కనీసం ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకనంత తీవ్రంగా కరోనా వ్యాపిస్తున్నది.

ముంబైలో అత్యంత జనసాంద్రత కలిగిన ధారావిలో కరోనా కేసులు నమోదవడంతో ప్రపంచమంతా భయాందోళనకు గురైంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ధారావిలో కరోనా సమూహవ్యాప్తిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళికబద్దంగా వ్యవహరించడంతో ఇప్పుడు ధారావి ఒక రోల్ మోడల్‌గా అవతరించింది.

కరోనా మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేసి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, ధారావిని ఆదర్శంగా తీసుకుంటే ఎలాంటి మహమ్మారినైనా అదుపులో పెట్టొచ్చని ఏకంగా డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనామ్ వెల్లడించడం విశేషం. ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా సహా జనసమ్మర్ధం అధికంగా ఉండే దేశాలతో పోలిస్తే.. ముంబై వంటి మెట్రో సిటీలో కూడా జనాభా ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇలాంటి మహానగరంలో ధారావి ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రదేశమని.. ఇక్కడే కరోనాను సమర్థవంతంగా నిలువరించగలిగినట్లు టెడ్రోస్ వివరించారు.

ధారావిలో కరోనాను జయించడంలో ప్రజల పాత్రే ఎక్కువని.. ఈ ప్రాంతాల్లో జ్వర పీడుతులైన ప్రతి ఒక్కరికీ టెస్టులు, ట్రేసింగ్, ఐసొలేటింగ్, ట్రీట్‌మెంట్ ద్వారా వైరస్ శృంకలాలు తెంచేశారని, మహమ్మారిని నులిమేశారని తెలిపారు. కొన్ని దేశాల్లో ఇప్పటికీ కరోనా కేసులు పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయని, మరికొన్ని దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులతో మళ్లీ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే, పటిష్ట చర్యలతో కరోనాను కట్టడి చేయడం సాధ్యమేనని ధారావి నిరూపించిందని ఆయన చెప్పారు.

ధారావిలో ఇరుకిరుకుగా ఉండే ఇళ్లు, ఓపెన్ డ్రైనేజీ వంటి పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించడం అసాధ్యమే.. అయినా సరే అక్కడి ప్రజలు నిబంధనలను తూచా తప్పకుండా పాటించి.. తమను తాము కాపాడుకోవడమే కాకుండా… ముంబై నగరాన్నే రక్షించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

ధారావి ప్రజలు విజయం సాధించారు : సీఎం ఠాక్రే

పేషెంట్ల కోసం ఎదురుచూసి, వైరస్ సోకినవారికే ట్రీట్‌మెంట్ విధానానికి బదులు ముందుగానే అనుమానితులను గుర్తించి వేరు చేసి మహమ్మారి వ్యాప్తి కట్టడి చేసే వ్యూహం ఇక్కడ కీలకంగా పనిచేసిదని సీఎం ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. ధారావిలో కరోనా కట్టడిపై మాట్లాడుతూ.. ఇక్కడ కరోనా కట్టడికి ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ అనే నాలుగు ‘టీ’ల పద్ధతిని అవలంబించామని తెలిపారు. పేషెంట్ల కోసం ఎదురుచూడకుండా ముందస్తుగా ఇంటింటికి తిరిగి స్క్రీనింగ్‌లు చేశామని, ముందుగానే అనుమానితులను కనిపెట్టి ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లకు తరలించామని ఆయన చెప్పారు.

ధారావి ప్రాంతంలో 6 లక్షల మందికి థర్మల్ స్క్రీనింగ్ చేశామని, 14వేల మందికి కరోనా టెస్టులు నిర్వహించామని, 13వేల మందిని క్వారంటైన్‌లో ఉంచామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు ప్రాక్టీషనర్ల సహకారం తీసుకున్నామని, వారందరికీ పీపీఈ కిట్లు అందించి భాగస్వాములను చేశామని తెలిపారు.

ధారావిపై ప్రశంసలు కురిపించిన డబ్ల్యూహెచ్‌వోకు మహారాష్ట్ర సర్కారు ధన్యవాదాలు తెలిపింది. ఇప్పుడు ధారావి వరల్డ్‌కే రోల్ మోడల్ అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే పొగిడారు. కరోనా కట్టడి చేసిన విజయం అక్కడ శ్రమించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, స్వచ్ఛంద సంస్థలు, ధారావి ప్రజలకే చెందుతుందని పేర్కొన్నారు. ఇటువంటి నిదర్శనాలే కరోనాపై పోరాటానికి నైతిక స్థైర్యాన్నిస్తాయని సీఎంవో ట్వీట్ చేసింది. ధారావి రికార్డు ఈ పోరును మరింత ఉత్తేజకరంగా చేస్తుందని తెలిపింది.

First Published:  11 July 2020 8:33 PM GMT
Next Story