Telugu Global
National

ముఖ్యమంత్రుల మౌనం వెనుక...

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం జోక్యాన్ని నివారించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోచన చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు పరస్పరం రివర్ బోర్డులకు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇదే అదనుగా కేంద్రం జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి కేంద్ర జల్‌శక్తి మంత్రి పిలుపునిచ్చినా ఇద్దరు సీఎంలు ఇప్పటి వరకు స్పందించలేదు. కారణంగా కేంద్రం జోక్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశమేనని చెబుతున్నారు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమకు నీరు అందించే విషయంలో తన వంతు […]

ముఖ్యమంత్రుల మౌనం వెనుక...
X

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం జోక్యాన్ని నివారించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోచన చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు పరస్పరం రివర్ బోర్డులకు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇదే అదనుగా కేంద్రం జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి కేంద్ర జల్‌శక్తి మంత్రి పిలుపునిచ్చినా ఇద్దరు సీఎంలు ఇప్పటి వరకు స్పందించలేదు. కారణంగా కేంద్రం జోక్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశమేనని చెబుతున్నారు.

కరువుతో అల్లాడుతున్న రాయలసీమకు నీరు అందించే విషయంలో తన వంతు సహకారం అందిస్తానని … జగన్‌ సీఎం అయిన కొత్తలో ప్రకటించిన కేసీఆర్ కూడా తొలుత ఈ అంశంపై మౌనంగా ఉన్నారు. కానీ తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీలు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపునివ్వడంతో తెలంగాణ ప్రభుత్వం … ఏపీ ప్రాజెక్టులపై కృష్ణారివర్‌ బోర్డుకు ఫిర్యాదు చేసింది.

దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి తమకు కేటాయించిన వాటా నుంచే రాయలసీమకు నీరు తీసుకెళ్తామని … ఇందులో పక్క రాష్ట్రాలకు జరిగే నష్టమేమీ ఉండదని వివరణ ఇచ్చారు. ఏపీ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, భక్తరామదాసు, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసింది.

అఫెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు చేపట్టిందని… మరి వాటి సంగతేంటని ఏపీ ప్రభుత్వం రివర్‌ బోర్డుల ముందు ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి రివర్ బోర్డులు తీసుకెళ్ళాయి. రంగంలోకి దిగిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి… అఫెక్స్ కౌన్సిల్ భేటీకి పిలుపునిచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అఫెక్స్ కౌన్సిల్ భేటీపై ఎలాంటి స్పందన లేదు.

అఫెక్స్ కౌన్సిల్ భేటీలో ఆయా రాష్ట్రాల ఎజెండాను పంపించాలని కోరినా రెండు ప్రభుత్వాలు సమాధానం ఇవ్వడం లేదు. అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే ఈనెల రెండో తేదీన కేంద్ర జల్‌శక్తి మంత్రి చైర్మన్‌గా, సభ్యుల హోదాలో ఇద్దరు ముఖ్యమంత్రులుగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుందని భావించారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు మాత్రం మౌనంగా ఉండడంతో భేటీ ఖరారు కాలేదు.

ఏపీనే కాకుండా తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కూడా అనుమతులు లేని నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్రం చేతిలో పెడితే రెండు రాష్ట్రాలకు ఇబ్బందేనన్న భావన వ్యక్తమవుతోంది. రెండు రాష్ట్రాలు గొడవపడితే ప్రాజెక్టులుపై కేంద్రం పెత్తనం పెరగడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్న భావనతోనే ముఖ్యమంత్రులు ఉన్నట్టు చెబుతున్నారు. పరస్పర ఫిర్యాదుల వల్ల రెండు రాష్ట్రాల ప్రాజెక్టులకు ఇబ్బందే కాబట్టి… పరస్పరం చర్చించుకుని ఇక్కడే సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రులు ఉన్నట్టు చెబుతున్నారు.

First Published:  6 July 2020 2:25 PM IST
Next Story