పీపీఈ కిట్ తో సేవలు... పీరియడ్స్ లో సమస్యలు
గంటల తరబడి సహనంగా, సమర్ధవంతంగా వైద్యం చేయటమే ఒక సవాల్ అయితే… ఈ కరోనా కాలంలో ఒళ్లంతా కవర్ చేసే పీపీఈ కిట్ ని ధరించి పనిచేయటం వైద్య సిబ్బందికి మరొక ఛాలెంజ్. వైద్య రంగంలో ఉన్న మహిళా సిబ్బందికి ఈ ప్రత్యేక పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్ లతో నెలసరి సమయంలో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పీరియడ్స్ ఉన్న సమయంలో పీపీఈ కిట్ ను ధరించి ఎనిమిది గంటల సుదీర్ఘమైన షిఫ్టులు ఏకధాటిగా […]
గంటల తరబడి సహనంగా, సమర్ధవంతంగా వైద్యం చేయటమే ఒక సవాల్ అయితే… ఈ కరోనా కాలంలో ఒళ్లంతా కవర్ చేసే పీపీఈ కిట్ ని ధరించి పనిచేయటం వైద్య సిబ్బందికి మరొక ఛాలెంజ్. వైద్య రంగంలో ఉన్న మహిళా సిబ్బందికి ఈ ప్రత్యేక పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్ లతో నెలసరి సమయంలో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పీరియడ్స్ ఉన్న సమయంలో పీపీఈ కిట్ ను ధరించి ఎనిమిది గంటల సుదీర్ఘమైన షిఫ్టులు ఏకధాటిగా పనిచేయాలంటే వారికి చాలా కష్టంగా ఉంటోంది. న్యూఢిల్లీలోని ఫార్టీస్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న లిండా రోస్ సిన్ని ఒక వీడియో ద్వారా ఈ విషయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
సాధారణంగా పీరియడ్స్ ఉన్నపుడు ఆడవారిలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక ఆ సమయంలో పీపీఈ కిట్ ని ధరించి ఉంటే చెమటలు ఎక్కువగా పట్టి భరించలేని స్థితి ఏర్పడుతోంది. దీంతో తీవ్రమైన అసౌకర్యంతో పాటు నోరు తడారిపోవటం లాంటి సమస్యలు సైతం ఏర్పడుతున్నాయి.
నెలసరి సమయంలో విపరీతమైన నొప్పులతో బాధపడేవారు టాబ్ లేట్స్ వేసుకుని ఉపశమనం పొందుతారని, అలాగే అధిక రక్తస్రావం సమస్య కొందరిలో ఉంటుందని… ఇలాంటి సమయంలో వారికి తక్కువ పనిగంటలు ఉన్న షిఫ్టులు ఉంటే… ఈ బాధలు మరింత తీవ్రం కాకుండా ఉంటాయని, అంతేకాకుండా షిఫ్టు అయిపోయిన వెంటనే స్నానం చేసి, ద్రవాహారం, మంచినీళ్లు ఎక్కువగా తీసుకునే వీలు ఉంటుందని లిండా రోస్ అన్నారు.
ప్రపంచమంతా కోవిడ్ 19తో పోరాడుతున్న ఈ విపత్కర కాలంలో తమ విలువైన సేవలు అందిస్తున్న మహిళా వైద్య సిబ్బందికి నెలసరి సమయంలో కాస్త వెసులుబాటు ఉండేలా విధానాలను మార్చడం మంచిదని దీనిని బట్టి అర్థమవుతోంది. మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా బలంగా మార్చడంలో భాగంగా ఈ మార్పులను పరిగణించాల్సి ఉంటుంది.