కరోనా రెండో దశ " సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు గడ్డు కాలం
దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కోవిడ్-19 వ్యాధి బారిన పడే వాళ్ల సంఖ్య కూడ ఎక్కువగా ఉండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ప్రతీ దేశంలో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్నది. అయితే సెప్టెంబర్-నవంబర్ నెలల మధ్య ఈ వైరస్ రెండో దశ ప్రారంభం కానున్నట్లు అంటువ్యాధుల నిపుణులు తెలియజేస్తున్నారు. రెండో దశలో తీవ్రత ఎక్కువగా ఏమీ ఉండదని కొంత మంది చేస్తున్న వ్యాఖ్యలను వారు ఖండించారు. రెండో దశలోనూ కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర […]
దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కోవిడ్-19 వ్యాధి బారిన పడే వాళ్ల సంఖ్య కూడ ఎక్కువగా ఉండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ప్రతీ దేశంలో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్నది. అయితే సెప్టెంబర్-నవంబర్ నెలల మధ్య ఈ వైరస్ రెండో దశ ప్రారంభం కానున్నట్లు అంటువ్యాధుల నిపుణులు తెలియజేస్తున్నారు.
రెండో దశలో తీవ్రత ఎక్కువగా ఏమీ ఉండదని కొంత మంది చేస్తున్న వ్యాఖ్యలను వారు ఖండించారు. రెండో దశలోనూ కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపడం ఖాయమని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ హెచ్చరించింది.
రెండో దశలో వైరస్ ఎక్కువగా అమెరికా, దక్షిణాసియా, మధ్య ప్రాచ్యంలోనే ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పింది. వైరస్ ఇప్పటికే వేగంగా వ్యాప్తి చెందుతోందని.. త్వరలో ఇది మరింత ఘోరంగా మారబోతోందని.. ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని లాన్సెట్ రూపొందించిన అధ్యయనంలో తెలిపింది.
వందేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన స్పానిష్ ఫ్లూ తరహాలోనే కరోనా విస్తరించనున్నట్లు తెలిపింది. అప్పట్లో స్పానిష్ ఫ్లూ తొలి దశ మార్చి నుంచి జులై మధ్య కొనసాగిందని, తర్వాత దశ అగస్ట్-డిసెంబర్ మధ్య ఉందని చెప్పింది. ఇప్పుడు కరోనా కూడా అదే విధంగా విజృంభించడం ఖాయమని లాన్సెట్ జర్నల్ పేర్కొంది.
స్పానిష్ ఫ్లూ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది మరణించారని.. దానిలో ఎక్కువ మంది రెండో దశలో చనిపోయినవారేనని తెలిపింది. అప్పట్లో మొదటి దశలోనే వైరస్‌ను కట్టడి చేయలేకపోవడం వల్ల రెండో దశ ప్రాణాంతకంగా మారిందని.. ఇప్పటికైనా కరోనాను సాధ్యమైనంత మేర కట్టడి చేయకుంటే ప్రపంచం మరో పెద్ద విపత్తు బారిన పడటం ఖాయమని లాన్సెట్ వెల్లడించింది.
ఈ మధ్య కరోనా ఎలాంటి లక్షణాలు లేకుండానే వస్తున్నదని.. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనపడే వరకు నిరీక్షించ వద్దని లాన్సెట్ సూచించింది. కండరాల నొప్పి, అలసట, విరేచనాలు, దద్దుర్లు వంటి లక్షణాలు కనపడినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని చెప్పింది.
కరోనా బారిన పడిన వ్యక్తులు సాధ్యమైనంత వరకు ఐసోలేషన్ అవడం వల్ల ఇతరులకు అంటించకుండా ఉండగలరని.. ఎంత త్వరగా వైరస్‌ను గుర్తించి చికిత్స తీసుకోగలిగితే అంత మంచిదని లాన్సెట్ చెబుతోంది. కరోనా కట్టడిలో ప్రాథమిక రోగ నిర్ధారణ, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ అత్యంత కీలకమైనవని లాన్సెట్ నివేదిక తెలిపింది.
ఇక ప్రస్తుత సమయంలో దీర్ఘకాలికంగా లాక్‌డౌన్‌లు విధించడం కూడా సరైన పరిష్కారం కాదని చెబుతోంది. సామూహికంగా పరీక్షలు పెంచి, వ్యాధిగ్రస్తులను గుర్తించి వారిని ఐసోలేషన్ చేయడమే సరైన పరిష్కారమని పేర్కొంది. లాక్‌డౌన్‌ల వల్ల ప్రజల మానసిక ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంది. కరోనా వచ్చిన వ్యక్తులు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండాలని లాన్సెట్ చెప్పింది.