వీరికి కరోనా భయం ఉండదట!
కరోనా… ఈ మధ్యకాలంలో ఇంతగా మనుషులను వణికించిన మాట మరొకటి ఉండకపోవచ్చు. కరోనా వస్తుందేమో… అనే భయంతో డిప్రెషన్ కి గురవుతున్నవారు, టెస్ట్ కి వెళ్లి రిజల్ట్ రాకముందే భయంతో గుండె ఆగి మరణిస్తున్నవారు ఉంటున్నారు. కరోనాని ఎదుర్కోవటంలో రోగనిరోధక శక్తితో పాటు మానసిక స్థయిర్యమూ ముఖ్యమే. ఈ వైరస్ బారినపడి కోలుకున్నవారు అందరూ చెబుతున్న మాట ఒక్కటే… ధైర్యంగా ఉండండి…అని. కరోనాతో సహజీవనంలో ధైర్యం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఆ మానసిక స్థయిర్యానికి సంబంధించి ఒక […]
కరోనా… ఈ మధ్యకాలంలో ఇంతగా మనుషులను వణికించిన మాట మరొకటి ఉండకపోవచ్చు. కరోనా వస్తుందేమో… అనే భయంతో డిప్రెషన్ కి గురవుతున్నవారు, టెస్ట్ కి వెళ్లి రిజల్ట్ రాకముందే భయంతో గుండె ఆగి మరణిస్తున్నవారు ఉంటున్నారు.
కరోనాని ఎదుర్కోవటంలో రోగనిరోధక శక్తితో పాటు మానసిక స్థయిర్యమూ ముఖ్యమే. ఈ వైరస్ బారినపడి కోలుకున్నవారు అందరూ చెబుతున్న మాట ఒక్కటే… ధైర్యంగా ఉండండి…అని. కరోనాతో సహజీవనంలో ధైర్యం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఆ మానసిక స్థయిర్యానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఓ అధ్యయనంలో వెల్లడైంది.
సోషల్ సైకాలజీ అండ్ పర్సనాలిటీ సైన్స్ అనే పత్రికలో వెల్లడించిన వివరాల ప్రకారం… హారర్ సినిమాలు ఎక్కువగా చూసేవారు కరోనా మహమ్మారి గురించి వెల్లడవుతున్న వివరాలకు, పరిస్థితులకు తక్కువగా భయపడుతున్నారని, వారు మానసికంగా ధైర్యంగా ఉన్నారని తేలింది. భయం గొలిపే బీభత్సమైన సన్నివేశాలున్న చిత్రాలు చూసేవారికి ఇది మంచి వార్తే.
310 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. గ్రహాంతర వాసుల దాడులు, యుద్దాలు, ఇంకా దడపుట్టించే సన్నివేశాలున్న సినిమాలను చూసేవారు కరోనా మహమ్మారి విషయంలో మరీ అంతగా బెంబేలు పడరని… మానసికంగా స్థిరంగా స్థిమితంగా ఉంటారని ఈ అధ్యయన వేత్తలు అంటున్నారు. కరోనా భయంతో మానసిక సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో భయంకరమైన సినిమాలు చూసేవారు… అంతగా ఒత్తిడికి గురికాకుండా తమ రోజువారీ పనులను చేసుకోగలరని ఈ అధ్యయనం చెబుతోంది.
హింస, క్రూరత్వం, మరణం లాంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అడిగి వీటిలో వారికున్న కుతూహలాన్ని అంచనా వేశారు. కల్పిత సన్నివేశాల ద్వారా ప్రమాదకరమైన దృశ్యాలను చూసేవారు… వాటినుండి బయటపడే మార్గాలను, వ్యూహాలను ఆలోచిస్తారు కనుక, అది సాధ్యమేనని ఊహిస్తారు కనుక వారిలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే మానసిక స్థయిర్యం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.
తెరపైన హంతకులు, దయ్యాలు, భూతాలు లాంటివాటిని చూసినప్పుడు సాధారణంగా ఎవరికైనా భయం, అసహ్యం, ఆందోళన లాంటి నెగెటివ్ ఎమోషన్లే కలుగుతాయి. అయితే ఆ దృశ్యాలను ఎక్కువగా చూసేవారు తమలోని నెగెటివ్ ఎమోషన్లు మితిమీరకుండా నియంత్రించుకుంటారు. ఇది వారికి అలవాటుగా ఉండటం వల్లనే కరోనా గురించిన భయంకరమైన వార్తలు విన్నా చూసినా గానీ వారిలో మితిమీరిన భయాందోళనలు ఉండవన్నమాట.
అయితే… ఇప్పటినుండి మేము భయంకరమైన సినిమాలు చూస్తాం… నెగెటివ్ భావోద్వేగాలను వదిలించుకుని జీవితాన్ని ఆనందంగా గడుపుతాం…అని ఎవరైనా అనుకుంటే మాత్రం అది పొరబాటే అవుతుందని కూడా పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. తరచుగా అలవాటుగా వాటిని చూసే వారికి మాత్రమే జీవితంలో ఆందోళనని కలిగించే విషయాలను ఎదుర్కొనే మానసిక శక్తి లభిస్తుందని వారు చెబుతున్నారు.