Telugu Global
NEWS

పవరో, పదవో, కిరీటమో కాదు... బాధ్యతగానే భావిస్తున్నాం...

జగన్‌మోహన్ రెడ్డి అప్పగించిన జిల్లాల పర్యవేక్షణ బాధ్యతలను తాము పదవిగానో, పవర్‌గానో, కిరీటంగానో భావించడం లేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, తాను తొలి నుంచి పార్టీలోనే ఉంటున్నామని… అనేక అంశాల్లో పనిచేశామని… తమ లాంటి వారు ఇంకా చాలా మంది పార్టీలో ఉన్నారని రామకృష్ణారెడ్డి వివరించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన… జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు కాబట్టి… పార్టీ పరంగా గ్యాప్ రాకుండా చూసుకునేందుకు తమ ముగ్గురికి జిల్లాల […]

పవరో, పదవో, కిరీటమో కాదు... బాధ్యతగానే భావిస్తున్నాం...
X

జగన్‌మోహన్ రెడ్డి అప్పగించిన జిల్లాల పర్యవేక్షణ బాధ్యతలను తాము పదవిగానో, పవర్‌గానో, కిరీటంగానో భావించడం లేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, తాను తొలి నుంచి పార్టీలోనే ఉంటున్నామని… అనేక అంశాల్లో పనిచేశామని… తమ లాంటి వారు ఇంకా చాలా మంది పార్టీలో ఉన్నారని రామకృష్ణారెడ్డి వివరించారు.

తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన… జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు కాబట్టి… పార్టీ పరంగా గ్యాప్ రాకుండా చూసుకునేందుకు తమ ముగ్గురికి జిల్లాల బాధ్యతలు అప్పగించారన్నారు. ఇది కేవలం ఒక బాధ్యత మాత్రమేనన్నారు. తొలి నుంచి పార్టీతో ఉండడం వల్ల పార్టీ శ్రేణులతో నేరుగా సంబంధాలు ఉండడం వల్లే తమకు జిల్లాల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారన్నారు. ముఖ్యమంత్రికి తాను, విజయసాయిరెడ్డి బంధువులం కూడా కాదన్నారు. కేవలం పార్టీతో తొలి నుంచి ఉండడం వల్లే కొన్ని బాధ్యతలు తమకు అప్పగించారన్నారు.

ప్రజలు జగన్‌కు ఆషామాషీగా పట్టం కట్టలేదని… ప్రజల కోసం అనేక పోరాటాలు చేస్తే ప్రజలు గెలిపించారన్నారు సజ్జల. చంద్రబాబు గానీ, ఆయన కుమారుడు గానీ ఏనాడైన ప్రజల కోసం పోరాటం చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు ఎంతసేపు ట్విట్టర్‌లో ట్వీట్లు పెట్టడం తప్ప ఏదైనా చేస్తున్నారా అని నిలదీశారు.

పథకాలకు వైఎస్ పేరు పెట్టారంటూ టీడీపీ గొట్టం చానల్‌లో ఒకాయన వరుసగా పేర్లు చదివారని… తాము ధైర్యంగానే వైఎస్‌ఆర్‌ పేరును పథకాలకు పెట్టామన్నారు. ఆ పథకాన్ని తాము పెట్టాం కాబట్టి వైఎస్‌ఆర్‌ పేరుపెట్టగలిగామన్నారు. తాము చంద్రబాబు బీమా, చంద్రన్న మరుగుదొడ్డి లాంటి పథకాలు కాకుండా…. ప్రజల జీవితాలను మార్చే పథకాలు తెచ్చామని సజ్జల చెప్పారు. గొట్టం చానల్‌లో పథకాలకు వైఎస్‌ పేరు పెట్టారని విమర్శించేందుకు వాటిని చదివినా… ఎన్ని పథకాలు ఉన్నాయో ప్రజలకు తెలిసిందన్నారు.

అవినీతి కోసమే పథకాలను తెచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదన్నారు. ఒక్క ఆస్తిని సృష్టించకుండా, ప్రజల జీవన ప్రమాణాలు పెరగకుండానే 90వేల కోట్ల అప్పును 2లక్షల 60వేల కోట్లకు చేర్చిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని విమర్శించారు. ఈ అప్పు కాక మరో 60వేల కోట్ల పెండింగ్‌ బిల్లులను వారసత్వంగా తమ ప్రభుత్వానికి అప్పగించి చంద్రబాబు రిటైర్ అయి పక్కకు తప్పకున్నారని సజ్జల విమర్శించారు. ఆ పెండింగ్ బిల్లులన్నీ తాము చెల్లించామన్నారు. డేటా మొత్తం పరిశీలించామని…ఈ స్థాయిలో 60వేల కోట్ల పెండింగ్‌ బిల్లులను గతంలో ఏ ప్రభుత్వం పెట్టి వెళ్లిన ఉదంతం లేదన్నారు.

రైతు భరోసా కింద 13 నెలల్లో 10వేల కోట్లకు పైగా తాము చెల్లించామన్నారు. చంద్రబాబు మొహానికి రుణమాఫి పేరుతో ఐదేళ్లలో రైతులకు ఇచ్చింది కేవలం 15వేల కోట్లు మాత్రమేనన్నారు. 87వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలను నేరుగా నగదు రూపంలో అందిస్తున్న ఘనత ఒక్క జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

వెయ్యి 88 … 108, 104 వాహనాలను తీసుకొస్తే దాంట్లో కూడా కుంభకోణం జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసలు ప్రాజెక్టు విలువ ఎంత?…. 300 కోట్ల కుంభకోణం ఎలా సాధ్యం అన్నది కూడా ఆలోచించకుండా తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. జీతాలు పెంచడం వల్ల వ్యయం పెరిగితే దానికి కూడా అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నసంస్థలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

పైగా చంద్రబాబు తన హయాంలోనూ 18వందల అంబులెన్స్‌లు ఉండేవని చెబుతున్నారని… ఇలా పచ్చిగా అబద్దాలు ఎలా చెప్పగలుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 18వందల అంబులెన్స్‌లు టీడీపీ హయాంలో ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఉన్న అంబులెన్స్‌లనే మూలనపడేసిన దృశ్యాలను అందరూ చూశారన్నారు.

ఆరోగ్య శ్రీ కింద పేదలు ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకోకుండా ఆంక్షలు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని సజ్జల విమర్శించారు. గ్రామ సచివాలయాలకు వేసిన రంగులకు 13వందల కోట్లు ఖర్చు పెట్టారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని… దీన్ని బట్టి ఆయనలాగే అందరూ దోపిడి చేస్తుంటారన్న భావనతో చంద్రబాబు ఉన్నట్టుగా అనిపిస్తోందన్నారు.

ఒక్కో గ్రామ సచివాలయానికి రంగులు వేయడానికి 13లక్షల ఖర్చు అయినట్టు టీడీపీ ప్రచారం చేస్తోందని… కానీ తాము ఒక్కో సచివాలయానికి కేటాయించిన మొత్తం 30వేల రూపాయలు మాత్రమేనన్నారు. మొత్తం ఖర్చు 30 కోట్ల నుంచి 35కోట్ల వరకు ఉంటుందన్నారు. కావాలంటే సమాచారహక్కు చట్టం కింద వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

రంగులతో ఏదో వస్తుందని తాము వేయలేదన్నారు. ఆ రంగులకు అర్థం ఉంది కాబట్టే వేశామన్నారు. ఇప్పుడు విమర్శిస్తున్న టీడీపీ వాళ్లు… అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్‌లకు చివరకు మరుగుదొడ్లకు కూడా పచ్చ రంగు వేసుకున్నారని గుర్తు చేశారు. పైగా టీడీపీ రంగు వేయడంతోపాటు మరుగుదొడ్లపై చంద్రబాబు ఫొటో కూడా ముద్రించి… చంద్రన్న మరుగుదొడ్డి అని రాయించుకున్నారని ఎద్దేవా చేశారు. కరెంట్ స్థంభాలకు, కుర్చీలకు, శ్మశానాలకు పచ్చ రంగులేసుకుని తిరిగారన్నారు. కానీ తాము నాడు ఇలాంటి చిల్లర అంశాలపై కోర్టులకు వెళ్లలేదన్నారు.

దమ్ముంటే తమ అవినీతిని నిరూపించండి అని సవాళ్లు చేసిన టీడీపీ నేతలు… ఇప్పుడు అచ్చెన్నాయుడి వంటివారు చేసిన అవినీతిని బయటకు తెస్తే ఇప్పుడు మాత్రం వేధింపులంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. అచ్చెన్నాయుడు అవినీతి చేశారా లేదా అని చెప్పమంటే… దాన్ని వదిలేసి అచ్చెన్నాయుడు ఏదో వెంటిలేటర్‌పై ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. అవినీతి చేసిన వ్యక్తులకు కులాన్ని ఆపాదించడం ఏమిటన్నారు. అచ్చెన్నాయుడుపై నిజంగానే ప్రభుత్వానికి కక్ష ఉంటే రెండు వారాల పాటు ఆస్పత్రిలో ఉండేవారా అని ప్రశ్నించారు. జేసీ ట్రావెల్స్‌లో అక్రమాలు నిజామా? కాదా? చెప్పమంటే… అక్కడ కూడా కక్ష సాధింపు అంటూ గగ్గోలు పెడుతున్నారన్నారు.

విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి, రోజాను కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడో తిప్పడం, చెవిరెడ్డిని అరెస్ట్ చేసి రాత్రంతా తిప్పడం లాంటి వాటిని వేధింపులు అంటారన్నారు. టీడీపీ హయాంలో జరిగిన వేధింపులను తీస్తే వేలల్లో ఉదంతాలు ఉన్నాయన్నారు. శాచురేషన్ విధానం, పక్కా అడిట్‌ ఈ రెండింటి వల్లనే పారదర్శకత ఉంటుందని ముఖ్యమంత్రి తమకు పదేపదే చెబుతుంటారని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. టీడీపీ వైఖరి ఇలాగే ఉంటే ఇంకో వందేళ్లు అయినా తెలుగుదేశం పార్టీ కోలుకునే అవకాశం ఉండదన్నారు.

First Published:  2 July 2020 2:19 PM IST
Next Story