Telugu Global
CRIME

నేనెందుకు రేప్ చేశానంటే ...

హీరో ప్రేమించానంటూ వెంటబడుతుంటాడు.. హీరోయిన్ తప్పించుకుని తిరుగుతుంటుంది. ఆమె అతడిని తిడుతుంది, అసహ్యించుకుంటుంది…. చివరికి అదే వ్యక్తితో ప్రేమలో పడుతుంది…. ఇలా మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఆడవాళ్లు ముందు కాదు… వద్దు అంటారు… కానీ వారి మనసు మాత్రం అందుకు సుముఖంగానే ఉంటుంది… అనే భావాలను బలంగా చెప్పే చిత్రీకరణలు ఇవి. కొన్ని వందల సంవత్సరాలుగా ఇలాంటి ధోరణులే… మన సాహిత్యంలోనూ, వివిధ కళా రూపాల్లోనూ కనబడుతున్నాయి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే… కాదంటే అవుననిలే… […]

నేనెందుకు రేప్ చేశానంటే ...
X

హీరో ప్రేమించానంటూ వెంటబడుతుంటాడు.. హీరోయిన్ తప్పించుకుని తిరుగుతుంటుంది. ఆమె అతడిని తిడుతుంది, అసహ్యించుకుంటుంది…. చివరికి అదే వ్యక్తితో ప్రేమలో పడుతుంది…. ఇలా మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఆడవాళ్లు ముందు కాదు… వద్దు అంటారు… కానీ వారి మనసు మాత్రం అందుకు సుముఖంగానే ఉంటుంది… అనే భావాలను బలంగా చెప్పే చిత్రీకరణలు ఇవి. కొన్ని వందల సంవత్సరాలుగా ఇలాంటి ధోరణులే… మన సాహిత్యంలోనూ, వివిధ కళా రూపాల్లోనూ కనబడుతున్నాయి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే… కాదంటే అవుననిలే… లాంటి మాటలు, పాటలు సైతం…. ఈ భావాలనుండే పుట్టుకుని వచ్చాయి. అంటే ఒక అమ్మాయికి నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించాలని ఉన్నా, ముందు…. కాదు అని చెప్పాలన్నమాట…. అప్పుడే ఆమె మంచి కుటుంబం నుండి వచ్చిన సంస్కారం ఉన్న అమ్మాయి అవుతుంది.

అంటే ఆడవాళ్లు ఎలా మాట్లాడాలి, తమ మనసులోని భావాలను ఏ విధంగా వ్యక్తం చేయాలి…. అనేది కూడా అల్రెడీ…. రాసిపెట్టి ఉంది. మరి ఇలాంటి భావాలు అత్యంత సహజమైనవిగా భావిస్తున్న అబ్బాయిలు… తమకి నో చెబుతున్న అమ్మాయి అభిప్రాయాలను గౌరవిస్తారా….ఆమెకు నో చెప్పే హక్కు ఉందన్న విషయాన్ని గుర్తిస్తారా…. ఈ భావజాలం, ఇలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు సైతం రేప్ లకు కారణంగా మారుతున్నాయా…. ఈ ప్రశ్నలకు తన రచన ద్వారా సమాధానం చెబుతున్నారు తారా కౌశల్ అనే రచయిత్రి.

మగవాళ్లు ఎందుకు రేప్ చేస్తారు… ఇదే పేరుతో ఈ రచయిత్రి ఒక పుస్తకాన్ని రాశారు. ఇటీవలే అది వెలువడింది. సాధారణంగా అత్యాచారం జరిగిన సందర్భాల్లో… ఆడపిల్ల ఒంటరిగా ఉందని, ఆమె అనవసరంగా రాత్రివేళ బయటకు వెళ్లిందనీ, ఇంకా… అమ్మాయిల వస్త్ర ధారణ సరిగ్గా లేదని… ఇలాంటి కారణాలు వినబడుతుంటాయి. అభం శుభం తెలియని పసిపిల్లలపై, ఇంట్లో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న చిన్నారులపై కూడా ఈ దారుణాలు జరుగుతున్నాయి కదా… అనే ప్రశ్నకు సమాధానం ఉండదు.

మగవారి వైపు నుండి ఆల్కహాల్ తీసుకుని ఉండటం, సినిమాల ప్రభావం లాంటివి రేప్ కి ప్రధాన కారణాలుగా వినబడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తారా కౌశల్ ఏ కారణాల వల్ల మగవాళ్లు ఇలాంటి అఘాయిత్యాలు చేస్తారు… అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ అనేక కోణాల్లో ఈ అంశాన్ని అధ్యయనం చేశారు. తార ఇప్పటివరకు లైంగికత, సమాన హక్కులు లాంటి అంశాలపై విస్తృతంగా రాసి ఉన్నారు.

2012లో నిర్భయ ఘటన జరిగినప్పటినుండే తారా కౌశల్ లో ఈ పుస్తకం రాయాలనే ఆలోచన మొదలైంది. తన టీనేజిలో నోయిడాలో ఉన్న తార…చిన్నతనంలోనే లైంగిక హింసకు గురికావటం, సామూహిక అత్యాచారాన్ని త్రుటిలో తప్పించుకోవటం జరిగింది. మగవాడి దౌర్జన్యం, దాష్టీకం తన జీవితాన్ని నిర్దేశించడం ఏమిటనే ఆగ్రహం కలిగింది ఆమెలో. ఆ ఆలోచనల ప్రభావంతోనే ఈ పుస్తకం రాశారామె.

ఈ రచన కోసం తారా కౌశల్ సినిమా రంగానికి చెందిన పరిశోధకురాలిగా తనను తాను పరిచయం చేసుకుంటూ తొమ్మిది మంది రేపిస్టులతో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించారు. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులతో సైతం మాట్లాడారు. ఇందులో… పన్నెండేళ్ల అమ్మాయి అయిన తన పేషంట్ పై అత్యాచారం చేసిన వైద్యుడు, తన మాజీ ప్రేయసిని రేప్ చేసిన నిరుద్యోగి, గ్యాంగ్ రేప్ లో పాల్గొన్న యువకుడు తదితరులు ఉన్నారు. తారా కౌశల్ వీరు చేసిన నేరవివరాలనే కాకుండా… వారి కుల మతాలు, ఆర్థిక పరిస్థితులు, ఎలాంటి వాతావరణంలో పెరిగారు, వారి భాష, ఆలోచనలు ఎలా ఉన్నాయి… లాంటి అనేక అంశాలను సైతం సేకరించారు.

పుస్తకం రాసే క్రమంలో తాను అర్థం చేసుకున్న అంశాలను ఆమె ఒక ఇంటర్వ్యూ లో వివరించారు. రేప్ కి పాల్పడే వారిలో… చాలామందిలో తాము చేస్తున్న పని అత్యంత దారుణమనే అవగాహన ఉండటం లేదని తార అన్నారు. చాలామంది ఆ అఘాయిత్యాన్ని స్త్రీని హింసించడంగా, అవమానించడంగా కూడా భావించడం లేదని… పైపెచ్చు ఆడవాళ్లకు అందులో ఆనందం లభిస్తుందని, వారు వద్దని అంటే కావాలనే అర్థమని కూడా భావిస్తున్నారని తార అన్నారు. ఈ నవనాగరిక సమాజంలో కూడా మహిళల జీవితాల చుట్టూ ఎన్నో అనాగరికమైన, అసహ్యకరమైన భావాలు అలుముకుని ఉన్నాయని దీనిని బట్టి మనకు అర్థమవుతోంది.

తారా కౌశల్ ఇంటర్వ్యూ చేసిన ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చాలాకాలం పాటు తీవ్రంగా వేధించాడు. చివరికి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయినా అతనిలో మార్పు లేదు. అమ్మాయి ఓకే అనే వరకు వెంటాడుతూనే ఉండాలని అతను బలంగా నమ్ముతున్నాడు. అదే ప్రేమ అని కూడా భావిస్తున్నాడు. అబ్బాయి ఎంతగా వెంటబడుతున్నా అమ్మాయి నో… అని చెబుతూనే ఉండాలి… అలాగే అమ్మాయి ఎస్ చెప్పేవరకు అబ్బాయి వెంటబడుతూనే ఉండాలి. దానిని ప్రేమగా భావించడం వల్లనే… కాదు అంటే ఔను అని అర్థం చేసుకోవటం వల్లనే… ఈ భావజాలానికి కొనసాగింపుగానే కొందరు అత్యాచారాలకు పాల్పడుతున్నారని తారా కౌశల్ అభిప్రాయపడుతున్నారు.

మహిళ తనను కాపాడుకునేందుకు అత్యంత జాగురూకతతో నిరంతరం ఉండాలని పితృస్వామ్య సమాజం మొదలైనప్పటినుండీ చెబుతున్న మాట అంటారు తార. అదే పితృస్వామ్య సమాజం… స్త్రీ కాదన్నా మగవాడు ఆమె వెంటబడవచ్చంటోంది. ఎంత వైరుధ్య వైఖరి కదా….అత్యాచారాలకు కారణాలు ఒకటి రెండని చెప్పలేము కానీ… నన్ను అడిగితే ఇలా చెబుతాను… అంటూ తన అభిప్రాయాలు వెలిబుచ్చారు తార.

తారాకౌశల్ భావాలు మరికొన్ని…

  • మగవాడు స్త్రీని వస్తువుగా చూడటం వలన…నీకంటే నేనే ముఖ్యం, నీ భావాలకంటే నా కోరికే ముఖ్యం అనే భావంతో అత్యాచారం చేస్తాడు. తనతో రిలేషన్ లో ఉన్న ఆడవారిని తమ ఆస్తిగా చూడటం వలన కూడా మగవారు ఇలాంటి హింసకు పాల్పడుతుంటారు.
  • మరొక కోణంలో చెప్పాలంటే… మగవారు ఆడవారిని పూర్తిగా మనుషుల్లాగే చూస్తూ… తమ శక్తిని, అధికారాన్ని చూపించి వారిని బాధపెట్టాలనుకుంటారు.
  • కొన్ని రేప్ వీడియోల్లో మగవారు అమ్మాయి ఏడుస్తుంటే తాము నవ్వుతుంటారు. అంటే ఆమె బాధ వారికి ఆనందం కలిగిస్తోంది. అలాగే వారిలో అణచిపెట్టి ఉన్న కోపం ఆవేశం లాంటి వాటికి ఈ హింస పరిష్కారంగా వారికి కనబడుతుంటుంది. సమాజంలో ఉన్న దోపిడీ, కుల వ్యవస్థ, అసమానతలు, అవినీతి ఇవన్నీ వారిలోని కోపానికి ఆవేశానికి కారణాలు కావచ్చు.
  • పితృస్వామ్య భావజాలం పోతే కానీ ఈ పరిస్థితులు మారవు.
First Published:  2 July 2020 1:31 PM IST
Next Story