మండలి దెబ్బ... ఏపీలో ఒక్క రూపాయి డ్రా చేయలేని స్థితి
ఆంధ్రప్రదేశ్‌లో ఖజానా స్తంభించింది. ఇటీవల శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంతో ఈనెల 1న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఖజాన నుంచి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా డ్రా చేయలేని పరిస్థితి. చట్టసభల్లో ఇప్పటి వరకు మనీ బిల్లును అడ్డుకున్న దాఖలాలు లేవు. కానీ ఇటీవల జరిగిన సమావేశాల్లో మండలిలో తనకున్న మెజారిటీ ఆధారంగా ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ అడ్డుకుంది. మండలి చైర్మన్, డిప్యూటీ […]
ఆంధ్రప్రదేశ్‌లో ఖజానా స్తంభించింది. ఇటీవల శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంతో ఈనెల 1న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఖజాన నుంచి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా డ్రా చేయలేని పరిస్థితి.
చట్టసభల్లో ఇప్పటి వరకు మనీ బిల్లును అడ్డుకున్న దాఖలాలు లేవు. కానీ ఇటీవల జరిగిన సమావేశాల్లో మండలిలో తనకున్న మెజారిటీ ఆధారంగా ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ అడ్డుకుంది.
మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులే కావడంతో టీడీపీ కనుసన్నల్లోనే సభ నడిచిందని అధికార పార్టీ ఆరోపించింది. ప్రభుత్వం ఆరోపించినట్టుగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించకుండా సభను వాయిదా వేసుకుని వెళ్లిపోయారు.
మండలి ఆమోదించినా, ఆమోదించకపోయినా 14 రోజుల తర్వాత బిల్లును గవర్నర్‌కు పంపే వెసులుబాటు ఉంటుంది. ఈ 14 రోజుల గడువు బుధవారం అర్థరాత్రిలో ముగిసింది. దాంతో గురువారం బిల్లును ప్రభుత్వం గవర్నర్‌కు పంపుతోంది. గవర్నర్ ఎంతసమయం తీసుకుంటారన్న దానిపైనే ఖజానా నుంచి డబ్బులు డ్రా చేసే పరిస్థితి ఆధారపడి ఉంటుంది.
గవర్నర్ తక్షణమే బిల్లును ఆమోదిస్తారా లేదంటే రెండు మూడు రోజులు సమయం తీసుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. గవర్నర్ సమయం తీసుకుంటే జీతాల చెల్లింపు మరికొన్నిరోజులు ఆలస్యం కావొచ్చు.
గవర్నర్ వీలైనంత త్వరగానే బిల్లును ఆమోదించి నోటిఫికేషన్ జారీకి అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. గవర్నర్ వద్దకు వెళ్తున్న ద్రవ్యవినిమయ బిల్లు శనివారం నాటికి ఆమోదం పొందవచ్చని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం అభిప్రాయపడ్డారు.