Telugu Global
National

ఏపీ హైకోర్టు సీజేపై విచారణకు ఆదేశించండి " రాష్ట్రపతి, సుప్రీం సీజేకు లేఖ

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి తీరుపై అంతర్గత విచారణకు ఆదేశించాలంటూ ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ హన్స్‌రాజ్.. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ రాశారు. హైకోర్టు సీజే మహేశ్వరి నిర్లక్ష్యం, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు తలెత్తాయని లేఖలో వివరించారు. ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మరణానికి కూడా సీజే నిర్ల్యక్షమే కారణమని ఆరోపించారు హన్స్‌రాజ్. జిల్లా జడ్జిల స్థాయిలో ఎస్‌సీ, […]

ఏపీ హైకోర్టు సీజేపై విచారణకు ఆదేశించండి  రాష్ట్రపతి, సుప్రీం సీజేకు లేఖ
X

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి తీరుపై అంతర్గత విచారణకు ఆదేశించాలంటూ ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ హన్స్‌రాజ్.. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ రాశారు.

హైకోర్టు సీజే మహేశ్వరి నిర్లక్ష్యం, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు తలెత్తాయని లేఖలో వివరించారు. ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మరణానికి కూడా సీజే నిర్ల్యక్షమే కారణమని ఆరోపించారు హన్స్‌రాజ్.

జిల్లా జడ్జిల స్థాయిలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ న్యాయాధికారుల రిజర్వేషన్లను దూరం చేసే విధంగా డ్రాఫ్ట్‌రూల్స్ సిద్ధం చేస్తున్నారని… ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినే తిరిగి ఆ పోస్టులో నియమిస్తున్నారని… కాబట్టి తక్షణం అంతర్గత విచారణకు ఆదేశించాలని లేఖలో కోరారు.

జస్టిస్‌ మహేశ్వరి నిర్లక్ష్య చర్యలు, నిర్ణయాల వల్ల ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ బి.రాజశేఖర్‌ మరణం సంభవించిందని, కొందరు ఉద్యోగులకు కరోనా సోకిందని, అంతిమంగా వారం పాటు కోర్టు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని హన్స్‌రాజ్‌ లేఖలో వివరించారు.

న్యాయమూర్తులు, అధికారులు, ఉద్యోగులు, కక్షిదారుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ప్రమాదరహితంగా హైకోర్టు, కింది కోర్టుల కార్యకలాపాలు సాగేలా మార్గదర్శకాలు జారీ చేయాలని నాలుగు పేజీల లేఖలో కోరారు. .

హైకోర్టు సీజే విషయంలో మరికొన్ని విషయాలను కూడా లేఖలో హన్స్‌రాజ్‌ వివరించారు. హైకోర్టు సీజే అసమర్థంగా వ్యవహరించారని… మే 8న హైకోర్టులో మూసి ఉన్న చిన్న ఏసీ హాల్‌లో ముగ్గురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందన్నారు. మాస్కులు లేకుండానే, భౌతిక దూరం పాటించకుండానే హాల్‌ మొత్తం కిక్కిరిసిపోయిన సమయంలో కార్యక్రమం జరిగిందని… ఈ కార్యక్రమ ఏర్పాట్ల కోసం ఇటీవల చనిపోయిన రాజశేఖర్ తెల్లవారుజామున 3 గంటల వరకు పనిచేశారన్నారు.

చనిపోవడానికి కొద్దిరోజుల ముందు రాజశేఖర్ అనారోగ్యానికి గురయ్యారని… ఆయన గుండె జబ్బుతో అప్పటికే బాధపడుతున్నారని…అయినా సరే బదిలీల పేరుతో కోర్టుకు పిలిపించారన్నారు. జస్టిస్ జేకే మహేశ్వరి తనపై చెప్పలేనంత భయంకరమైన ఒత్తిడి మోపుతున్నారని రాజశేఖర్ తన సన్నిహితులు, కుటుంబసభ్యుల వద్ద చెబుతూ వచ్చారని రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసిన లేఖలో వివరించారు.

ఈ ఒత్తిడి మధ్యే గత నెల 24న హైకోర్టులోనే రాజశేఖర్ కుప్పకూలిపడిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయారని… రాజశేఖర్‌ను రోజూ కలుస్తూ వచ్చిన హైకోర్టు ప్రధానన్యాయమూర్తి ఈరోజుకీ కూడా కరోనా పరీక్షలు చేయించుకోలేదని హన్స్‌రాజ్‌ వెల్లడించారు.

జస్టిస్‌ జేకే మహేశ్వరికి విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మూడు సూట్‌లను గతంలో కేటాయించిందని… ప్రధాన న్యాయమూర్తి నివాసం కోసం ఓ అధికారిక భవనాన్ని కూడా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.2.5 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఫిబ్రవరిలో సీజే అధికారిక భవనంలోకి వెళ్లినా ప్రభుత్వ అతిథి గృహంలోని మూడు సూట్‌లను ఇప్పటివరకు ఖాళీ చేయలేదని… ఇది రాష్ట్రానికి వచ్చే వీఐపీలకు ఇబ్బందికరంగా మారిందని లేఖలో వివరించారు.

ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై పూర్తిస్థాయి అంతర్గత విచారణకు ఆదేశించాలని రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రిని ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ హన్స్‌రాజ్ కోరారు.

First Published:  2 July 2020 2:20 AM IST
Next Story