Telugu Global
NEWS

లేఖలు ఇచ్చి ఉంటే నీకూ అచ్చెం పరిస్థితే లోకేష్‌

అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఇష్టానుసారం దోపిడీలు, దాడులు, అకృత్యాలకు పాల్పడ్డారని… ఇప్పుడు అది సాధ్యంకాకపోవడంతో తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన… నిన్న పట్టపగలు మచిలీపట్నంలో వైసీపీ నేతను హత్య చేశారని… దీన్ని బట్టే టీడీపీ నేతల ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. కరోనా కట్టడిలో అత్యధిక పరీక్షలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుంటే  చంద్రబాబు మాత్రం కడుపుమంటతో అసత్యప్రచారాలు చేసుకుంటున్నారన్నారు. […]

లేఖలు ఇచ్చి ఉంటే నీకూ అచ్చెం పరిస్థితే లోకేష్‌
X

అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఇష్టానుసారం దోపిడీలు, దాడులు, అకృత్యాలకు పాల్పడ్డారని… ఇప్పుడు అది సాధ్యంకాకపోవడంతో తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన… నిన్న పట్టపగలు మచిలీపట్నంలో వైసీపీ నేతను హత్య చేశారని… దీన్ని బట్టే టీడీపీ నేతల ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.

కరోనా కట్టడిలో అత్యధిక పరీక్షలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుంటే చంద్రబాబు మాత్రం కడుపుమంటతో అసత్యప్రచారాలు చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్ల పాటు పరిశ్రమలకు బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌ పెట్టి వెళ్తే వాటిని ఈ ప్రభుత్వం తీరుస్తుంటే దానిపైనా లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు ప్రతి రంగంలోనూ బకాయిలు పెండింగ్ పెట్టివెళ్లారన్నారు. వెళ్తూవెళ్తూ కొత్త ప్రభుత్వం నెత్తిన 60వేల కోట్ల పెండింగ్ బిల్లులతో పాటు, రెండు లక్షల 75వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి వెళ్లారన్నారు.

వైఎస్‌ హయాంలో నెలనెల గ్రామాలకు వచ్చిన 104 వాహనం చంద్రబాబు హయాంలో ఎక్కడైనా కనిపించిందా అని ప్రశ్నించారు. గతంలో 20 నిమిషాల్లో ఘటనాస్థలికి 108 అంబులెన్స్‌లు వస్తే… చంద్రబాబు హయాంలో మాత్రం డీజిల్ లేదు, డ్రైవర్‌ లేరు అంటూ సమాధానం వచ్చేదన్నారు.

రేపు వెయ్యికి పైగా అంబులెన్స్‌లను ఒకేసారి బెంజి సర్కిల్‌లో ప్రారంభిస్తుంటే కడుపు మంటలో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. అంబులెన్స్‌ల విలువ 200 కోట్లు అవుతుంటే… 300 కోట్లు అక్రమాలు అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. అంబులెన్స్‌లు ఉన్నాయో లేవో రేపు బెంజి సర్కిల్‌ వచ్చి గానీ, లేదా ఇంట్లో కూర్చుని టీవీల్లో గానీ చూడాలని టీడీపీకి నేతలకు సలహా ఇచ్చారు.

ప్రతి పనిలోనూ మాకేంటి అనడం టీడీపీ విధానమని… మిగిలిన వారు కూడా అలాగే ఉంటారని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క ఇల్లు అయినా నిర్మించి ఇచ్చారా అని ప్రశ్నించారు. గృహనిర్మాణంలో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తే 3వేల కోట్ల పనిలో 400 కోట్లు మిగిలాయన్నారు. దీన్ని బట్టి ఏ స్థాయిలో అవినీతి చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇలాంటి వాటిని సరిచేస్తుంటే చంద్రబాబు కడుపుమంటతో రగిలిపోతున్నారన్నారు.

30లక్షల ఇళ్ల స్థలాలను ఇవ్వబోతుంటే దాన్ని తట్టుకోలేక కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పేదల జీవితాలు బాగు చేసే చర్యలకు అడ్డుపడడం ఎంత పాపం అని ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేస్తున్న చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని బొత్స వ్యాఖ్యానించారు. పేదలకు నీడ లేకుండా చేయాలని చూస్తే… చంద్రబాబునాయుడికి, టీడీపీకి రాజకీయంగా నిలువ నీడ లేకుండాపోతుందని హెచ్చరించారు.

విశాఖలో ల్యాండ్ పూలింగ్‌ చేస్తున్నామని…. రైతులు స్వచ్చందంగా వచ్చి ఇచ్చిన భూములను మాత్రమే తీసుకుంటున్నామని… ఎవరినీ ఇబ్బంది పెట్టి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ఎక్కడ చిన్న అవకతవకలు జరిగినా బాధ్యత వహిస్తానని ఇదివరకే చెప్పానని… ఆ మాటకు ఇప్పటికీ తాను కట్టుబడే ఉన్నానన్నారు. ఇలా చెప్పే దమ్ము గత ప్రభుత్వంలో ఉండేదా అని ప్రశ్నించారు.

వెయ్యికి పైగా అంబులెన్స్‌లను ఒకేసారి ప్రారంభిస్తుంటే దానిపైనా విమర్శలు చేస్తున్నారని… ఇలాంటి గొప్ప ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబుకు వచ్చిందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మంచి మనసుతో ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటోందని… ఇందుకు దేవుడు కూడా సహకరిస్తారన్నారు.

పోలవరంలో అవినీతి జరగలేదని కేంద్రం చెప్పిందంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని… దీన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. సాక్ష్యాత్తు దేశ ప్రధానే పోలవరంను చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని చెప్పారని గుర్తు చేశారు. అంటే ప్రధాని అవాస్తవాలు చెప్పారని టీడీపీ చెప్పగలదా అని నిలదీశారు.

అచ్చెన్నాయుడు అక్రమాలు చేసినట్టు తేలిందని… అయితే ఈ కుంభకోణంలో డబ్బులు అధిక మొత్తం చంద్రబాబుకే వెళ్లి ఉంటాయన్న అనుమానం ఉందన్నారు. అందుకే ఇప్పటికీ కూడా అచ్చెన్నాయుడు అరెస్ట్ తప్పు అంటూ మాట్లాడుతున్నారే గానీ… అవినీతి జరగలేదు అని మాత్రం చంద్రబాబు చెప్పలేకపోతున్నారన్నారు. అవినీతి జరగలేదని, ఒకవేళ జరిగి ఉంటే బాధ్యత వహిస్తామని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని బొత్స వ్యాఖ్యానించారు.

రోజుకు వంద సిఫార్సు లేఖలు ఇచ్చి ఉంటానని లోకేష్ చెప్పుకుంటున్నారని… సిఫార్సు లేఖలు ఇవ్వడం తప్పుకాదని… కానీ వాటిని ఎందుకు ఇస్తున్నామన్నది ముఖ్యమన్నారు. లోకేష్‌ కూడా అచ్చెన్నాయుడు తరహాలోనే లేఖలు ఇచ్చి ఉంటే ఆయనకు అదే పరిస్థితి తప్పదన్నారు. ఒక మంత్రిగా చేసి ఇంత బాధ్యతారహితంగా లోకేష్‌ ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

బీసీ రిజర్వేషన్లపై చర్చ వచ్చినప్పుడు 50శాతం మించి ఇవ్వడానికి లేదని తానే స్వయంగా ముఖ్యమంత్రికి చెప్పానని… లేదు బీసీలకు న్యాయం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చెప్పారన్నారు. కానీ ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ నేతలను కోర్టులకు పంపించింది చంద్రబాబు కదా అని ప్రశ్నించారు. అసలు చంద్రబాబుది నోరేనా అని వ్యాఖ్యానించారు.

ప్రతి పనిలోనూ, అన్ని పదవుల్లోనూ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నది ఒక్క జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమేనన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా నామినేటెడ్‌ పదవుల్లో , ఆలయకమిటీల నియామకాల్లో వెనుకబడిన వర్గాల వారికి 50 శాతం పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒక్క ఈ ప్రభుత్వంలో మాత్రమే అది సాధ్యమైందన్నారు.

రాజధాని ప్రజలను ఇంకా మభ్యపెట్టేందుకు వర్చువల్‌ మీటింగ్ జరుపుతామని టీడీపీ నేతలు చెబుతున్నారన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కరకట్ట రోడ్డు వేయలేకపోయిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని బొత్స మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా అనైతికమైన, నీచమైన పనులకు టీడీపీ తెగబడుతోందని….తప్పు చేస్తే 70ఏళ్ల వ్యక్తులను అరెస్ట్‌ చేస్తారా అంటూ మాట్లాడుతున్నారన్నారు.70ఏళ్ల వయసు వచ్చిన వ్యక్తులు ఆ వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలన్నారు. 70 ఏళ్లు ఉన్నాయని వెధవ పనులు చేసినా చర్యలు తీసుకోకుండా వదిలేయాలా అని ప్రశ్నించారు. తప్పుడు పనులు చేస్తే ఏ వయసు వారిపైనైనా చర్యలు తప్పవన్నారు.

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో ఘటన జరిగితే చంద్రబాబు కనీసం అక్కడికి వెళ్లారా అని ప్రశ్నించారు. ఒక డాక్టర్‌ తాగి వచ్చి రోడ్డు మీద తందనాలు ఆడుతుంటే, ప్రజలకు ఇబ్బందికలిగిస్తుంటే చట్టం తన పని తాను చేసుకుపోయినా చంద్రబాబు తప్పుపట్టారన్నారు బొత్స సత్యనారాయణ.

First Published:  30 Jun 2020 3:48 PM IST
Next Story