Telugu Global
National

భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ... 20 మంది సైనికులు మృతి..?

భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ లోయ ప్రాంతం వద్ద సోమవారం రాత్రి ఇరు దేశాల మధ్య తీవ్ర హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాళ్లు, కర్రలు, ఇనుపరాడ్ల సహాయంతో ఇరు దేశ సైనికులు ఘర్షణలకు దిగడంతో 20 మంది భారత సైనికులు మృతి చెందగా 17 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. కాగా, గాయాల పాలైన సైనికుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింతగా […]

భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ... 20 మంది సైనికులు మృతి..?
X

భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ లోయ ప్రాంతం వద్ద సోమవారం రాత్రి ఇరు దేశాల మధ్య తీవ్ర హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాళ్లు, కర్రలు, ఇనుపరాడ్ల సహాయంతో ఇరు దేశ సైనికులు ఘర్షణలకు దిగడంతో 20 మంది భారత సైనికులు మృతి చెందగా 17 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం.

కాగా, గాయాల పాలైన సైనికుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. మరోవైపు చైనా సైనికులు కూడా పలువురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాల పాలైనట్లు తెలుస్తోంది. చైనా జవాన్లు 43 మంది చనిపోయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకటించింది. అయితే చైనా సైనికుల మృతుల సంఖ్యలో గందరగోళం నెలకొంది. అయితే మృతదేహాలు, క్షతగాత్రులను తరలించడానికి చైనా సైన్యం పదుల సంఖ్యలో హెలికాఫ్టర్లను రంగంలోకి దించినట్లు సమాచారం.

చైనా సైన్యం తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ సమీపంలో వందల సంఖ్యలో సైనికులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెండు నెలల క్రితం భారత ప్రభుత్వం కూడా సైన్యాన్ని అక్కడ మోహరించింది. ఈ నేపథ్యంలో మే 5 నుంచి ఇరు దేశ సైనికుల మధ్య హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పలుమార్లు తోపులాటలు, ఘర్షణలు జరగడంతో ఇరుదేశ ప్రభుత్వాలు సైనిక బలగాలను తగ్గించాలని భావించాయి.

దీంతో గత కొన్ని రోజులుగా గాల్వన్ లోయ ప్రాంతం నుంచి సైనికులను తరలిస్తున్నారు. సముద్రమట్టం నుంచి 17వేల అడుగుల ఎత్తుండే ఈ ప్రాంతంలో తీవ్రమైన చలి ఉంటుంది. అక్కడే సోమవారం రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రమైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దాదాపు నాలుగు గంటల సేపు ఈ ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కల్నల్ సంతోష్‌కుమార్ సహా 20 మంది సైనికులు మరణించారు.

1975 తర్వాత చైనా-ఇండియా మధ్య జరిగిన సైనిక ఘర్షణల్లో ప్రాణాలు పోవడం ఇదే తొలిసారి. ఈ ఉద్రిక్తతలకు కారణం చైనానే అని భారత్ ఆరోపిస్తోంది. తూర్పులద్దాఖ్ ప్రాంతంలో గాల్వన్ లోయ, పాంగాంగ్ సరస్సు, దౌలత్ బేగ్ ఓలిడీ ప్రాంతాల్లో చైనా గస్తీ కోసం వందలాది మంది సైనికులను అక్కడ మోహరించింది. అప్పటి నుంచే అటువైపు నుంచి కవ్వింపు చర్యలు ప్రారంభమయ్యాయని.. రెండు నెలల క్రితం పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో కూడా రాళ్లతో దాడి చేశారని భారత ప్రభుత్వం గుర్తు చేస్తోంది.

కాగా, చైనా ఇక్కడ సైన్యాన్ని మోహరించడానికి భారత ప్రభుత్వం నిర్మించే ఒక రోడ్డే కారణమని తెలుస్తోంది. లద్ధాఖ్ ప్రాంతంలోని దౌలత్‌బేగ్ ఓలిడీ నుంచి డర్బుక్ వరకు 255 కిలోమీటర్ల పొడవైన రహదారిని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఈ మార్గం పూర్తయితే దౌలత్‌బేగ్ ఓలిడీ నుంచి గాల్వన్ లోయ వరకు కేవలం అరగంటలో చేరుకోచ్చు. గతంలో ఈ పర్వాత ప్రాంతాల గుండా ప్రయాణించాలంటే 8 గంటల సమయం పట్టేది. ఈ కొత్త రహదారి వల్ల ఎలాంటి వాతావరణంలో అయినా ప్రయాణించే వీలుంది.

ఈ రోడ్డుపైనే చైనా అభ్యంతరం తెలుపుతోంది. భారత్‌కు అత్యంత కీలకమైన సియాచిన్‌కు చేరుకోవడానికి.. చైనా-పాకిస్తాన్ మధ్య ఉన్న కారంకోరం హైవేపై, అక్సాయ్ చిన్‌పై ఇండియా నిఘా పెట్టడానికి అనువుగా ఉంటుంది. అందుకే గాల్వన్ లోయ ప్రాంతం మాదేనని చైనా వాదిస్తోంది. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

First Published:  17 Jun 2020 1:08 AM IST
Next Story