ఇదీ జగన్ చేసిన ఆదా
తొలి ఏడాదిలో సంక్షేమ పథకాలకు జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. అంత సొమ్ము ఎక్కడి నుంచి వస్తోంది అన్నది చాలా మంది అనుమానం. ప్రభుత్వంలోని వారు మాత్రం అవినీతిని పూర్తిగా కంట్రోల్ చేశాం… పథకాల అమలులో లీకేజీలు లేకుండా చేశాం, పలు శాఖల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా వేల కోట్ల ఆదా చేశామని చెబుతున్నారు. తొలి ఏడాదిలో ఏపీ ప్రభుత్వం ఆదా చేసిన డబ్బుకు సంబంధించి కొన్ని వివరాలను ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ […]
తొలి ఏడాదిలో సంక్షేమ పథకాలకు జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. అంత సొమ్ము ఎక్కడి నుంచి వస్తోంది అన్నది చాలా మంది అనుమానం. ప్రభుత్వంలోని వారు మాత్రం అవినీతిని పూర్తిగా కంట్రోల్ చేశాం… పథకాల అమలులో లీకేజీలు లేకుండా చేశాం, పలు శాఖల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా వేల కోట్ల ఆదా చేశామని చెబుతున్నారు. తొలి ఏడాదిలో ఏపీ ప్రభుత్వం ఆదా చేసిన డబ్బుకు సంబంధించి కొన్ని వివరాలను ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం మీడియాకు వివరించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో 15వందల కోట్ల విలువైన ఆస్తిని ఎలా కాపాడింది ఆయన వివరించారు. అజయ్ కల్లం చెప్పిన దాని ప్రకారం… రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ఏడాది మొత్తం 2వేల 72 కోట్లు ఆదా చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా 11వందల 39 కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో 196 కోట్లు, హౌసింగ్‌లో 361కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేశారు.
టీడీపీ ప్రభుత్వం మూడు లక్షల పది వేల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. అందులో కేవలం 64వేల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులలో మాత్రమే రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. మిగిలిన ఇళ్లు ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తి చేసుకోవడంతో వాటిని రివర్స్ టెండరింగ్ నిర్వహించలేకపోయామని అజయ్ కల్లం చెప్పారు. మొత్తం 3లక్షల పది వేల ఇళ్ల నిర్మాణంలోనూ రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే మరింత సొమ్ము ఆదా అయ్యేదని ఆయన వివరించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక్కో ఇంటి నిర్మాణంపై 75వేలు సేవ్ చేసింది ప్రభుత్వం.
జెన్‌కోలో బొగ్గు రవాణా కాంట్రాక్టుపైనా రివర్స్ టెండరింగ్ నిర్వహించగా 193 కోట్లు ఆదా అయింది. విద్యా శాఖలో 181 కోట్లు ఆదా చేశారు. ఇలా మొత్తం రివర్స్ టెండరింగ్ ద్వారా 2వేల 72 కోట్లు ప్రజాధనాన్ని సేవ్ చేసినట్టు అజయ్ కల్లం వివరించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో ప్రభుత్వానికి వేల కోట్ల ఆస్తి నిలిచేలా చేశామని అజయ్ కల్లం వివరించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు టీడీపీ ప్రభుత్వం రెండువేల 700 ఎకరాలు కేటాయించింది. ఎయిర్‌పోర్టుకు అంత భూమి అవసరం లేదని భావించిన జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం… జీఎంఆర్ సంస్థతో మరోసారి చర్చ జరిపింది. రెండువేల రెండు వందల ఎకరాలు సరిపోతుందని ఒప్పించింది . ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మించే ప్రాంతంలో ఎకరం మూడు కోట్ల వరకు పలుకుతోందని… ఈ లెక్కన 500 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకోవడం వల్ల 15వందల కోట్ల ఆస్తి కాపాడినట్టు అయిందని అజయ్ కల్లం వివరించారు. భవిష్యత్తులో ఈ భూమి విలువ వేల కోట్లలోకి వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
రాయలసీమలో సౌర, పవన విద్యుత్‌తో పాటు రివర్స్ హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని గ్రీన్ కో సంస్థ గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. గ్రీన్ కో సంస్థకు టీడీపీ ప్రభుత్వం 4600 ఎకరాల భూమిని కేటాయించింది. ఎకరం రెండున్నర లక్షలకు సదరు సంస్థకు భూమిని ఇచ్చారు. అయితే తాము మరోసారి చర్చలు జరిపి ఎకరం భూమికి ఐదు లక్షలు చెల్లించేలా చేశామని అజయ్ కల్లం వివరించారు. దీని వల్ల ప్రభుత్వానికి 120 కోట్లు అదనపు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
అలాగే గ్రీన్ కో సంస్థ అభివృద్ధి పన్ను కింద ఒక్కో మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి ఏడాదికి లక్ష రూపాయలు ప్రభుత్వానికి చెల్లించేలా కొత్తగా ఒప్పించామని అజయ్ కల్లం వివరించారు. ఈ షరతు వల్ల ఏడాదికి 40 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తుందని అజయ్ కల్లం వివరించారు.