Telugu Global
International

నవంబర్ నాటికి కరోనా ఉధృత స్థితికి....

దేశంలో రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. గత నాలుగైదు రోజులుగా రోజుకు 10 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే నవంబర్ నాటికి దేశంలో కరోనా ఉచ్ఛదశకు చేరుకుంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నియమించిన ఒక పరిశోధక బృందం చేసిన అధ్యయనంలో తేలింది. లాక్‌డౌన్ విధించడం వల్ల కరోనా వల్ల ఈ ఉచ్ఛ స్థితిని 34 రోజుల నుంచి 76 రోజుల వరకు ఆపగలిగామని ఆ అధ్యయనం […]

నవంబర్ నాటికి కరోనా ఉధృత స్థితికి....
X

దేశంలో రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. గత నాలుగైదు రోజులుగా రోజుకు 10 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే నవంబర్ నాటికి దేశంలో కరోనా ఉచ్ఛదశకు చేరుకుంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నియమించిన ఒక పరిశోధక బృందం చేసిన అధ్యయనంలో తేలింది.

లాక్‌డౌన్ విధించడం వల్ల కరోనా వల్ల ఈ ఉచ్ఛ స్థితిని 34 రోజుల నుంచి 76 రోజుల వరకు ఆపగలిగామని ఆ అధ్యయనం తేల్చింది. అంతే కాకుండా దేశంలో కరోనా వ్యాప్తి రేటును 97 శాతం నుంచి 67 శాతానికి తగ్గించగలిగామని స్పష్టం చేశారు.

మనకు లభించిన ఈ వ్యవధిలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోగలిగినట్లు.. మౌళిక వసతులు కూడా మెరుగుపరిచినట్లు ఈ బృందం చెప్పింది. లాక్‌డౌన్ కాలంలో 60 శాతం వసతులు మెరుగుపరిచారు. దీనివల్ల నవంబర్ తొలి వారం వరకు రోగులకు సరిపడ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఆ తర్వాత ఐసోలేషన్ బెడ్లు 5 నెలలు, ఐసీయూ బెడ్లు 4 నెలలు, వెంటిలేటర్లు 3 నెలల పాటు అందుబాటులో ఉండవని ఈ అధ్యయనంలో తేలింది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో మెరుగైన మౌళిక సదుపాయాలు పెంచామని.. ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడం వల్ల కోవిడ్-19ని ఎదుర్కోగలమని బృందం పేర్కొంది. ప్రస్తుతం మెరుగుపరిచిన వసతుల కారణంగా, లాక్‌డౌన్ విధించడం వల్ల ఉచ్ఛ స్థితిలో వచ్చే కేసుల సంఖ్యను 70 శాతం మేర తగ్గించగలిగినట్లు ఈ అధ్యయనంలో తేలింది.

కరోనాను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య వ్యవస్థ మెరుగుపరచడానికి దేశ జీడీపీలో 6.2 శాతం ధనాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జూన్ 9న తెలిపిన దాని ప్రకారం దేశవ్యాప్తంగా 958 కోవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రుల్లో 1,67,883 ఐసోలేషన్ బెడ్లు, 21,614 ఐసీయూలు, 73,469 ఆక్సిజన్ సరఫరా కలిగిన బెడ్లు ఉన్నాయి.

ఇక కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు 2,313 ఉండగా.. వీటిలో 1,33,037 ఐసోలేషన్ బెడ్లు, 10,748 ఐసీయూ బెడ్లు, 46,635 ఆక్సిజన్ సరఫరా బెడ్లు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా 7,525 కోవిడ్ కేర్ సెంటర్లు ఉండగా.. వీటిలో 7,10,642 బెడ్లు సిద్దంగా ఉన్నాయి. కోవిడ్ బెడ్ల కోసం 21,494 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

First Published:  15 Jun 2020 3:45 AM IST
Next Story