జేసీ కుటుంబం చేసిన నేరం ఇదీ...
కాలం చెల్లిన బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా చూపించిన వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. వారిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో జేసీ కుటుంబం అనేక నేరాలకు పాల్పడినట్టు రవాణా శాఖ అధికారులు, పోలీసులు తేల్చారు. 2017 మార్చిలో సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కాలుష్యాన్ని వెదజల్లుతున్న బీఎస్ 3 మోడల్ వెహికల్స్‌ను 2017 ఏప్రిల్ […]
కాలం చెల్లిన బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా చూపించిన వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. వారిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో జేసీ కుటుంబం అనేక నేరాలకు పాల్పడినట్టు రవాణా శాఖ అధికారులు, పోలీసులు తేల్చారు.
2017 మార్చిలో సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కాలుష్యాన్ని వెదజల్లుతున్న బీఎస్ 3 మోడల్ వెహికల్స్‌ను 2017 ఏప్రిల్ ఒకటి నుంచి విక్రయించడానికి వీల్లేదని ఆదేశించింది. బీఎస్ 3 వాహనాలను విక్రయించడాన్నే కాదు… వాటిని రిజిస్ట్రేషన్ చేయడాన్ని సుప్రీం కోర్టు నిషేధించింది.
బీఎస్3 వాహనాల విక్రయాలపై సుప్రీం కోర్టు నిషేధం అమలులోకి వచ్చే నాటికి అశోక్ లేలాండ్ కంపెనీ దగ్గర కొన్ని బీఎస్3 వాహనాలు మిగిలిపోయాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన జఠాధర కంపెనీ, ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు గోపాల్ రెడ్డికి చెందిన సి గోపాల్ రెడ్డి అండ్ కంపెనీలు … అశోక్ లేలాండ్ కంపెనీ వద్ద అమ్ముడుపోకుండా మిగిలిన పోయిన బీఎస్ 3 వాహనాలను కొనుగోలు చేశాయి.
బీఎస్3 వాహనాల విక్రయాలను నేరుగా చేయడాన్ని సుప్రీం కోర్టు నిషేధించడంతో… మిగిలిపోయిన వాహనాలను అశోక్ లేలాండ్ కంపెనీ స్క్రాప్ కింద విక్రయించింది. ఇలా 154 బీఎస్3 వాహనాలను స్క్రాప్ కింద జఠాధర, సీ గోపాల్ రెడ్డి అండ్ కో కంపెనీలు కొనుగోలు చేశాయి. స్క్రాప్ కింద కొనుగోలు చేశారు కాబట్టి ఆ వాహనాల విడి భాగాలను వాడుకోవచ్చు… కానీ వాటిని రోడ్డు మీద తిప్పడానికి లేదు. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వీల్లేదు.
కానీ జేసీ కుటుంబ కంపెనీలు ఇక్కడ కొత్త ఆలోచన చేశాయి. అశోక్ లేలాండ్ నుంచి స్క్రాప్ కింద కొనుగోలు చేసిన బీఎస్3 వాహనాలను…. బీఎస్4 వాహనాలుగా నమ్మించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ నకిలీ పత్రాల సాయంతో నాగాలాండ్‌లో బీఎస్3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు. నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే అక్కడి నుంచి ఎన్‌వోసీలు తెచ్చి తిరిగి అనంతపురంలో ఆ వాహనాలకు రీ రిజిష్ట్రేషన్ చేయించారని అధికారులు చెబుతున్నారు. ఇలా బీఎస్3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించి పలు రాష్ట్రాల్లో తిప్పుతున్నారు.
ఈ వాహనాలను ఇతరులకు విక్రయించారు. అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి స్క్రాప్ కింద తక్కువ ధరకే… ఒక్కో వాహనాన్ని 5 లక్షలకు కొనుగోలు చేసి… తిరిగి వాటిని బీఎస్4 వాహనాలు అని నమ్మించి ఇతరులకు ఒక్కో వాహనాన్ని 20 లక్షల రూపాయలకు విక్రయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ వ్యవహారాన్ని పసిగట్టిన రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నాగాలాండ్ వరకు వెళ్లి పరిశీలించారు. అక్కడ సమర్పించిన పత్రాల ఆధారంగా అశోక్ లేలాండ్ కంపెనీని రవాణా శాఖ అధికారులు సంప్రదించారు. దాంతో తాము బీఎస్4 వాహనాలను విక్రయించలేదని… బీఎస్ 3 వాహనాలనే స్క్రాప్ కింద విక్రయించామని అశోక్ లేలాండ్ కంపెనీ స్పష్టం చేసింది. ఇలా కాలం చెల్లిన బీఎస్3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా తమకు విక్రయించారని తెలుసుకున్న పలువురు… జేసీ కుటుంబంపై కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే అలా కేసులు పెట్టేందుకు సిద్ధమైన వారితో రాజీ చేసుకుని… తిరిగి సొమ్ము వెనక్కు చెల్లించి కేసులు పెట్టకుండా ఒప్పందం చేసుకున్నట్టు చెబుతున్నారు.
బీఎస్3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం, వాటిని ఇతరులకు అమ్మడమే కాకుండా… ఈ వాహనాలకు సంబంధించి నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను సృష్టించినట్టు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రవాణాశాఖకు సమర్పించిన ఇన్సూరెన్స్ పత్రాలను సదరు ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించి ఆరా తీయగా…. సదరు ఇన్సూరెన్స్ పత్రాలు తాము ఇచ్చినవి కావని ఇన్సూరెన్స్ కంపెనీ సమాచారం ఇచ్చింది. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు సృష్టించారని తేలింది.
వాహనాలకు ఇన్సూరెన్స్ చేయకుండా నకిలీ పత్రాలను సమర్పించారని… ఇలా చేయడం వల్ల సదరు వాహనాల్లో ప్రయాణించే వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు. లారీ, బస్సుల తయారీ నిర్మాణం వేరువేరుగా ఉంటుందని… అలాంటిది లారీలనే బస్సులుగా మార్చడం నేరమని అధికారులు చెబుతున్నారు. ఈ వాహనాలను ఇతర రాష్ట్రాల్లో తిప్పేందుకు అవసరమైన పోలీసు అనుమతులకు సంబంధించిన క్లియరెన్స్ పత్రాలను కూడా నకిలీవి సృష్టించారని అధికారులు చెబుతున్నారు.