Telugu Global
National

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లే యోచన...

కరోనాపై కొందరు పనిగట్టుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. కరోనాపై కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో జరుగుతున్న ప్రచారం, హైకోర్టు ఆగ్రహం అంశంపైనా చర్చ జరిగింది. కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సమావేశంలో అభిప్రాయపడ్డారు. పలు అంశాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. గాంధీ ఆస్పత్రి కరోనా బాధితులతో కిక్కిరిసిపోయిందంటూ ప్రచారం చేస్తున్నారని… కానీ అక్కడ కేవలం […]

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లే యోచన...
X

కరోనాపై కొందరు పనిగట్టుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. కరోనాపై కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో జరుగుతున్న ప్రచారం, హైకోర్టు ఆగ్రహం అంశంపైనా చర్చ జరిగింది.

కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సమావేశంలో అభిప్రాయపడ్డారు. పలు అంశాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

గాంధీ ఆస్పత్రి కరోనా బాధితులతో కిక్కిరిసిపోయిందంటూ ప్రచారం చేస్తున్నారని… కానీ అక్కడ కేవలం 247 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

కరోనా బాధితుల సంఖ్య పెరిగితే వైద్యం అందించేందుకు ఏర్పాట్లు లేవంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని అధికారులు కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గాంధీ ఆస్పత్రిలో రెండువేల మందికి చికిత్స అందించే అవకాశం ఉంది… వెయ్యి మందికి ఆక్సిజన్ అందించే సదుపాయం ఉందని వివరించారు. కానీ ప్రచారం మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు.

వైద్య సిబ్బందికి కరోనా సోకుతోందని ప్రచారం చేయడం ద్వారా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ….సిబ్బందికి కరోనా సోకడం కొన్నిసార్లు సహజమని… కానీ అది ఒక్క తెలంగాణలోనే జరుగుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

కొందరు పనిగట్టుకుని పదేపదే హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారని… దీని వల్ల ఉన్నతాధికారులు కోర్టు కేసులపై దృష్టి పెట్టాల్సి వస్తోందని, ఇతర వ్యవహారాలను పర్యవేక్షించలేకపోతున్నారని సీఎంకు వివరించారు.

మరణించిన ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కాదని సమావేశంలో చర్చ జరిగింది. రోజుకు రాష్ట్రంలో వెయ్యి మంది వరకు వివిధ కారణాలతో చనిపోతున్నారని… వారందరికీ కరోనా పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని సీఎంతో జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించారు.

First Published:  9 Jun 2020 2:55 AM IST
Next Story