Telugu Global
National

కరోనా కాలంలోనూ ఆగని ‘మేఘా’ పనులు

ఇంజనీరింగ్ చరిత్రలో మేఘా అద్భుతాలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో నిర్మించి రికార్డు సృష్టించింది. మేఘా సంస్థ రాక ముందు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలంటే దశాబ్దాల కాలం పట్టేది. కానీ మేఘా సంస్థ మాత్రం అలాంటి చెత్త రికార్డులకు దూరంగా ఉంది. నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా రికార్డు స్థాయిలో ప్రాజెక్టులను నిర్మిస్తూ రైతుల పొలాలను సాగునీటితో నింపుతోంది. కాళేశ్వరంతో తెలంగాణలో సాగునీటి చరిత్రలో కొత్తశకం సృష్టించిన మేఘా.. ఆంధప్రదేశ్ లోనూ అదే అద్భుతాలను సృష్టించేందుకు […]

కరోనా కాలంలోనూ ఆగని ‘మేఘా’ పనులు
X

ఇంజనీరింగ్ చరిత్రలో మేఘా అద్భుతాలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో నిర్మించి రికార్డు సృష్టించింది. మేఘా సంస్థ రాక ముందు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలంటే దశాబ్దాల కాలం పట్టేది. కానీ మేఘా సంస్థ మాత్రం అలాంటి చెత్త రికార్డులకు దూరంగా ఉంది.

నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా రికార్డు స్థాయిలో ప్రాజెక్టులను నిర్మిస్తూ రైతుల పొలాలను సాగునీటితో నింపుతోంది. కాళేశ్వరంతో తెలంగాణలో సాగునీటి చరిత్రలో కొత్తశకం సృష్టించిన మేఘా.. ఆంధప్రదేశ్ లోనూ అదే అద్భుతాలను సృష్టించేందుకు మేఘంలా గర్జిస్తుంది. చంద్రబాబు హయాంలో నత్తనడకగా సాగిన పోలరం ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్పీడుకు మేఘా సంస్థ తోడవడంతో పోలవరం పనులు జెట్ స్పీడుతో దూసుకెళుతున్నాయి.

లాక్డౌన్ లోనూ ఆగని పనులు..

దేశంలోకి కోవిడ్-19 ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించింది. గత మూడునెలలుగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఇటీవల లాక్డౌన్ లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో కార్మికులంతా తమ సొంత గ్రామాలకు వలస వెళ్లారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు నిలిచిపోయాయి.

ఈ తరుణంలో ఆంధ్ర్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు ఆగుతుందని అందరూ భావించాయి. అయితే వాటన్నింటిని మేఘా సంస్థ పటాపంచాలు చేసింది. పోలవరం ఆగిపోవడం అటుంచితే.. జెట్ స్పీడుతో పనులు జరుగుతుండటంతో ప్రజలంతా అవాక్కవుతున్నారు. ప్రాజెక్ట్‌లోని పనులు కీలకదశకు చేరుకున్నాయి.

నత్తకు.. చిరుత వేగం నేర్పిన మేఘా..

కరోనా కాలంలోనూ పొలవరం పరుగులు పెడుతోంది. చంద్రబాబు హయంలో 2018లో పోలవరం పనులు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి ఈ ప్రాజెక్టు పనులు నత్తను తలపించాయి. స్పిల్‌వే, కాఫర్‌ డ్యాం పనులు కొంత మేరకు జరగడం మినహా మిగిలిన పనులేవి ప్రారంభించలేదు.

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గత ప్రభుత్వం చేపట్టిన పనులను రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలిచారు. దీని ద్వారా ప్రభుత్వానికి వ్యయం తగ్గించడంతో పాటు (ప్రభుత్వానికి ఆదా) అన్ని పనులు ముమ్మరం అయ్యేలా చర్యలు చేపట్టారు. జగన్ స్పీడుకు మేఘా తోడవడంతో పోలవరం పనులు పరుగులు తీస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్‌వే కలిగిన ఈ ప్రాజెక్ట్‌ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్‌ లక్ష్యం మేరకు పనులను ప్రణాళికబద్ధంగా సాగిస్తోంది.

50లక్షల క్యూసెక్కుల వరదనీటిని ఒడిసిపట్టనున్న మేఘా…

ఈ ప్రాజెక్ట్‌లో 50లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించేలా స్పిల్‌వే నిర్మిస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు అతిపెద్ద ప్రాజెక్ట్‌గా పరిగణించే చైనాలోని త్రిగాడ్జేస్‌ జలాశయ స్పిల్‌వే వరదనీటి విడుదల సామర్థ్యం 47లక్షల క్యూసెక్కులు. ఈ ప్రాజెక్టును తలదన్నేలా పోలవరం ప్రాజెక్ట్‌ మరో మూడులక్షల క్యూసెక్కుల అధిక సామర్థ్యంతో మేఘా ఇంజనీరింగ్‌ నిర్మిస్తోంది.

2019 నవంబర్‌లో మేఘా పనులను ప్రారంభించగా అప్పటికే జలాశయ నిర్మాణ ప్రాంతంలో ముందు, వెనకా వరదనీరు చేరాయి. గత ప్రభుత్వం ఇంజనీరింగ్‌ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల దాదాపు 4టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికే అధిక సమయం పట్టింది.

ఆ తర్వాత జనవరిలో పనులు వేగవంతం చేయడం సాధ్యమైంది. నిర్మాణ పనులకు వేసవిలో ముఖ్యంగా మార్చి, ఏప్రిల్‌, మే నెలలు కీలకమైనవి. ఇదిలా ఉంటే కరోనా కష్టాలతో దేశ వ్యాప్తంగా ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు మందగించాయి. పోలవరం నిర్మాణంపై కూడా ఈ ప్రభావం పడింది.

కరోనా ఎఫెక్ట్.. సొంతూళ్లకు వలస కార్మికులు..

పొలవరం ప్రాజెక్టు కోసం నిరంతరం పని చేస్తున్న 2వేల మందికి పైగా కార్మికులు కరోనా భయంతో తమ సొంత రాష్ట్రాలకు తరలివెళ్లారు. ఫలితంగా నామమాత్ర కార్మికులు, సిబ్బందితోనే పనులు చేయించాల్సి వచ్చింది. ఈ ప్రభావం ప్రాజెక్టుపై పడకుండా మేఘా పనులను ముందుకు సాగించింది.

అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మేఘా ఇంజనీరింగ్‌ చాలా సమర్థంగా డీల్ చేశాయి. పనుల్లో స్పిల్‌వే, స్పిల్‌ ఛానెల్‌, జల విద్యుత్‌ కేంద్రం, మట్టి, రాతి పనులు ఈ సమయంలోనే చెప్పుకోదగ్గ స్థాయిలోనే జరిగాయి. నవంబర్‌-డిసెంబర్ లో నీటి సమస్య వల్ల మందకోడిగా జరిగాయి. నవంబర్‌లో 206, డిసెంబర్ లో 5628 ఘనపు మీటర్ల పనులు జరిగాయి. జనవరి నుంచి పనులు ఊపందుకున్నాయి. 20,639 ఘనపు మీటర్లు, ఫిబ్రవరిలో 32,443, మార్చిలో 36,129 ఘనపు మీటర్ల స్పిల్‌వే, స్పిల్‌ ఛానెల్‌ కాంక్రీట్‌ పనులు జరిగాయి. ఏప్రిల్‌, మే నెలలో కరోనా ప్రభావం పోలవరంపై పడకుండా అటు నిర్మాణ సంస్థ, ఇటు ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించాయి.

నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లు, మేఘా సిబ్బంది

గత ప్రభుత్వంలో స్పిల్ ఛానల్ పనులు మొదలు కానేలేదు. దీనిని జగన్మోమోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. ఏప్రిల్‌లో స్పిల్‌వే కాంక్రీట్‌ పని 18714 ఘ.మీ, స్పిల్‌ ఛానెల్‌ 9511 ఘ.మీ కాంక్రీట్‌ పని జరిగింది. మొత్తం మీద 28,225 ఘ.మీ కాంక్రీట్‌ పనిని పూర్తిచేశారు. మే నెలలో అంతకన్నా దాదాపు రెట్టింపు పని జరిగింది. స్పిల్‌ వే 10909, స్పిల్‌ ఛానెల్‌ 42354 ఘ.మీ చొప్పున జరిగాయి. మొత్తం మీద 53263 ఘనపు మీటర్ల పనిని మే నెలలో చేశారు.

ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించినప్పటి నుంచి అంతకు ముందు ఏ నెలలోనూ చేయనంతగా మే నెలలో కరోనాని సైతం ఎదుర్కొని ఆ మేరకు పనిచేశారంటే ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. కరోనా, లాక్డౌన్ సమయంలో ఎక్కడా పనులు ఆగకుండా ఇంజనీర్లు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ పొలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

నిర్లక్ష్యానికి గురైన పనులపై ఫోకస్..

ఈ ప్రాజెక్ట్‌లో మట్టి తవ్వకం, బండరాళ్లు తొలగించడం, మట్టికట్ట నిర్మాణం, జల విద్యుత్‌ కేంద్రం పనులు, ఎర్త్‌ కమ్‌ ర్యాక్‌ ఫిల్‌ డ్యాం పనులు కీలకమైనవి. గతంలో ఈ పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రాజెక్ట్‌లో స్పిల్‌వే కాంక్రీట్‌, లోయర్‌ కాఫర్‌ డ్యాం, అప్పర్‌ కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు.

ప్రాజెక్ట్‌లో అన్ని పనులు సకాలంలో పూర్తయితేనే ప్రాజెక్ట్‌ ప్రయోజనం నెరవేరుతుంది. కానీ అప్పట్లో అప్పర్‌ కాఫర్‌ డ్యాంను మాత్రమే నిర్మించి 2018లో నీటిని నిల్వ చేయడం ద్వారా ప్రాజెక్ట్‌ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఇలా చేయడం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నియమ నిబంధనలకు(ఇంజనీరింగ్‌ ప్రోసిజర్స్‌) విరుద్ధం. అయితే అప్పట్లో ఆ పనిని కూడా పూర్తి చేయలేకపోయారు.

కీలక పనులు షూరు…

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులు కొనసాగించారు. దీంతోపాటు కీలకమైన ఎర్త్‌ కమ్‌ ర్యాక్‌ ఫిల్‌ డ్యాం (3గ్యాపులు) నిర్మించడానికి అవసరమైన మట్టి పటుత్వ పరీక్షలు(వైబ్రో కంప్యాక్షన్‌ పనులు) మేఘా ఇంజనీరింగ్‌ చేపట్టింది. అలాగే స్పిల్‌ ఛానెల్‌ పనులు మొదలయ్యాయి.

ఇందులో ప్రధానంగా మట్టి తవ్వకం ఊపందుకుంది. స్పిల్‌ ఛానెల్‌కు సంబంధించిన కాంక్రీట్‌ బ్లాక్‌ నిర్మాణం కీలక దశకు చేరుకుంది. ఫిబ్రవరిలో ఈ పనులను మేఘా ఇంజనీరింగ్‌ ప్రారంభించగా ప్రతినెలా పని సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతుంది.

గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యంగా వదిలేసిన అన్ని పనులను మేఘా చక్కబెడుతోంది. ప్రభుత్వం పోలవరానికి ప్రాధాన్యత ఇవ్వడంతో జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం (బ్లాస్టింగ్‌) పనులు ఊపందుకున్నాయి.

‘మేఘా’పై నమ్మకంతో తిరిగొస్తున్న కార్మికులు..

ప్రభుత్వం, మేఘా సంస్థపై నమ్మకంతో పోలవరంలో పనిచేసి స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తిరిగి వస్తూ పనుల్లో చేరుతున్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి ఎలాగైనా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్న మేఘా సంస్థ దాదాపు 2000 మంది కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా తిరిగి వెనక్కు తీసుకొచ్చింది.

ఇలా వచ్చినవారికి ప్రత్యేక ఇన్సెంటివ్స్ తో పాటు ఇతర సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. అలాగే ప్రత్యేక మెడికల్ టీం ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తరువాతనే పనుల్లోకి అనుమతిస్తున్నారు. పనిచేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో పనులను మరింత వేగవంతం చేయనున్నారు. ఏదేమైనా తిరిగి వచ్చే కార్మికుల సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేసి వర్షాకాలం మొదలై వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా పనులు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది మేఘా సంస్థ.

మరో రికార్డు దిశగా మేఘా పరుగులు…

జగన్మోహన్ రెడ్డి స్పీడు.. మేఘా దూకుడు చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు కూడా రికార్డు స్థాయిలో పూర్తి చేయడం ఖాయంగా కన్పిస్తుంది. మేఘా సంస్థ తెలుగు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టుల్లో ఓ నూతన శకానికి నాంది పలికింది. పోలవరాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షను.. రైతుల కలలను తీర్చేందుకు మేఘా సంస్థ నిరంతరం శ్రమిస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే సాగునీటి చరిత్రలో మరో అద్భుతాన్ని మేఘా పేరిట లిఖించడం ఖాయంగా కన్పిస్తుంది.

First Published:  9 Jun 2020 12:16 PM IST
Next Story