విజృంభిస్తున్న కరోనా... ప్రమాదంలో ఇండియా
ప్రపంచ వ్యాపంగా లాక్‌డౌన్ నిబంధనలు సడలించినా.. కరోనా వైరస్ మాత్రం విజృంభిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో మన దేశంలో కరోనా కేసులు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసుల్లో ప్రపంచంలోనే ఆరవ స్థానంలోకి భారత్ చేరుకుంది. ఒక రోజు వ్యవధిలో అత్యధిక స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో తొలి స్థానంలో ఉంది. మూడవ లాక్‌డౌన్ సందర్భంగా ప్రపంచంలో 14వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఐదవ విడత లాక్‌డౌన్‌లో ఆరవ స్థానానికి చేరుకుంది. […]
ప్రపంచ వ్యాపంగా లాక్‌డౌన్ నిబంధనలు సడలించినా.. కరోనా వైరస్ మాత్రం విజృంభిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో మన దేశంలో కరోనా కేసులు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసుల్లో ప్రపంచంలోనే ఆరవ స్థానంలోకి భారత్ చేరుకుంది. ఒక రోజు వ్యవధిలో అత్యధిక స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో తొలి స్థానంలో ఉంది. మూడవ లాక్‌డౌన్ సందర్భంగా ప్రపంచంలో 14వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఐదవ విడత లాక్‌డౌన్‌లో ఆరవ స్థానానికి చేరుకుంది.
ఈ విషయం స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,887 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించినప్పటి నుంచి ఒక రోజులో నమోదైన అత్యధిక పాజిటివ్ కేసుల సంఖ్య ఇదే.
దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 2,36,657. ఒక్కరోజే కరోనాతో 294 మంది చనిపోవడంతో ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 6,642కు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 1,14,072 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా ఇంకా 1,15,942 మంది చికిత్స పొందుతున్నారు.
కరోనా కేసులతో సంక్షోభంలో కూరుకుపోయిన ఇటలీ దేశాన్ని దాటి భారత్ 6వ స్థానానికి చేరుకుంది. చైనాతో పోలిస్తే భారత్‌లోని కేసులు మూడు రెట్లకు చేరువలో ఉన్నాయి.
వరల్డోమీటర్ కొవిడ్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద అత్యధిక కొత్త కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఇప్పటివరకూ అమెరికా, బ్రెజిల్ దేశాలు ఉండగా ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ ఆక్రమించింది.
జాన్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం శనివారం రాత్రి 9 గంటల సమయానికి భారత్‌లో మొత్తం కేసులు 2,43,733గా ఉన్నాయని, ప్రపంచంలో ఐదవ స్థానానికి చేరుకుందని పేర్కొంది. ఇప్పటివరకూ ఐదవ స్థానంలో ఉన్న స్పెయిన్‌లో 2,40,978 కేసులు ఉన్నాయని, భారత్ ఆ సంఖ్యను అధిగమించిందని పేర్కొంది.
మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలోనే ఇప్పటివరకు ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఒక్కరోజే 2,739 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డ్ అయిన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 82,968కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 21 రోజులుగా 2వేలకు పైనే కొత్త కేసులు రికార్డ్ అవుతున్నాయి. ఇక్కడ ఒక్కరోజులోనే 129 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2, 969కి చేరింది.
రాజధాని ముంబైలో ఒక్కరోజే 1274 పాజిటివ్ కేసులు నమోదు కాగా 57 మంది కరోనాతో మరణించారు. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 47,128కి చేరింది.
తమిళనాడులో ఒక్కరోజే 1458 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 30,152కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే 19 మంది మరణించడంతో ఇక్కడ ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 251కి చేరింది.
రాజధాని చెన్నై నగరంలో ఒక్కరోజే 1,146 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో చెన్నై నగరంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,993కు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 1,320 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 27,654కు చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో కరోనాతో 761 మంది మరణించగా 16,229 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గుజరాత్‌లో ఒక్కరోజే 498 కొత్త కేసులు నమోదవగా… రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,617కి చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 29 మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటివరకు ఇక్కడ వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 1219కి చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 3588కి చేరింది. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో మొత్తం 4460 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ప్రస్తుతం 1192 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 73 మంది మరణించారు.