సోషల్ మీడియా ఒక మురికిగుంట... మాకు సంబంధం లేదు... నోటీసులు ఇవ్వండి తప్పేంటి?
హైకోర్టులపై వ్యాఖ్యలు చేసిన వారిని వెనుకేసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిరాకరించారు. కోర్టుల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కేసులు పెట్టినప్పుడే కోర్టుల గురించి జగన్ ఏనాడు తప్పుగా మాట్లాడలేదని… ఇప్పుడు కోర్టులపై తమకు మరింత గౌరవం పెరిగిందన్నారు. తాము కోర్టుల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టంగా మీడియా సమావేశంలో చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు ఎవరైనా దిగజారి వ్యాఖ్యలు చేసినా, సంకుచితంగా పోస్టులు పెట్టినా అలాంటి వారిని […]
హైకోర్టులపై వ్యాఖ్యలు చేసిన వారిని వెనుకేసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిరాకరించారు. కోర్టుల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కేసులు పెట్టినప్పుడే కోర్టుల గురించి జగన్ ఏనాడు తప్పుగా మాట్లాడలేదని… ఇప్పుడు కోర్టులపై తమకు మరింత గౌరవం పెరిగిందన్నారు. తాము కోర్టుల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టంగా మీడియా సమావేశంలో చెప్పారు.
తమ పార్టీ కార్యకర్తలు ఎవరైనా దిగజారి వ్యాఖ్యలు చేసినా, సంకుచితంగా పోస్టులు పెట్టినా అలాంటి వారిని ఎంటర్‌టైన్ చేసే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి వారిని జగన్‌మోహన్ రెడ్డి దగ్గరకు కూడా రానివ్వరన్నారు సజ్జల. సోషల్ మీడియాలో పోస్టుల తర్వాత న్యాయవ్యవస్థలోని పెద్దలు ఫీల్ అయ్యారని… అయితే సోషల్ మీడియాలో ఏమైందో కూడా తమకు గానీ, తమ పార్టీకి గానీ తెలియదన్నారు.
సోషల్ మీడియా అన్నది మురికిగుంట అని అభివర్ణించారు. అనేక మురికి గుంటలు ఉన్నట్టుగానే సోషల్ మీడియా కూడా ఒక మురికి గుంటగా మారిందన్నారు. సోషల్ మీడియాలో కింద అంతా మురికిగుంటలో ఉన్నట్టుగా ఉందని… పైకి ఈ సోషల్ మీడియా ప్రజా చైతన్యాన్ని సూచిస్తుందన్నారు. అక్కడ జరిగేదంతా బ్రహ్మాండం అని చెప్పలేం… అదే సమయంలో అంతా చెత్త అని కూడా చెప్పలేమన్నారు.
అత్యంత కుట్రపూరితంగా నడుస్తున్నది టీడీపీ సోషల్ మీడియానే అని సజ్జల విమర్శించారు. తమకు అసలు బూతులు వినడం కూడా ఇష్టం ఉండదన్నారు. సోషల్ మీడియా పోస్టులను పట్టించుకోవడం, వాటిని చూడడం టైం వేస్ట్ అని జగన్ చెప్పారన్నారు. సోషల్ మీడియాలో అసమర్థులు, ఏమీ చేయలేని వారు ఉంటారని … అలాంటివారు ఎదుటివారిపై విషం కక్కుతూ ఉంటారని విమర్శించారు.
కోర్టుపై కొందరు వ్యాఖ్యలు చేస్తే టీడీపీ పత్రికలు ఏకంగా తలలు నరికేస్తారా అంటూ పెద్దపెద్ద కథనాలు రాశాయని… ఆ వ్యాఖ్యలు ఏమైనా ముఖ్యమంత్రి చేశారా? పార్టీ నాయకులు చేశారా? అని సజ్జల ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎవరో చేసి ఉంటే వారికి నోటీసులు ఇవ్వండి తప్పేముంది అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా సంగతేంటో తమకు అర్థం కావడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థకు… ప్రభుత్వానికి ఘర్షణ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారని… మధ్యలోకి సోషల్ మీడియా ఎందుకు దూరిందో తమకు అర్థం కావడం లేదన్నారు.