Telugu Global
Cinema & Entertainment

మార్గదర్శిగా మారాలనుకుంటున్న చిరు

ఇప్పటికే పరిశ్రమకు పెద్దదిక్కుగా మారారు చిరంజీవి. దాసరి నారాయణరావు లేని లోటును భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు కరోనా కష్టకాలంలో కూడా టాలీవుడ్ కు మార్గదర్శిగా మారాలనుకుంటున్నారు మెగాస్టార్. దీనికోసం అందరి కంటే ముందుగా తనే షూటింగ్ స్టార్ట్ చేసి, మిగతా నిర్మాతలు-హీరోకు దిశానిర్దేశం చేయాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, ఆదేశాల ఆధారంగా వచ్చేనెల రెండో వారం నుంచి షూటింగ్స్ మొదలుపెట్టుకోవచ్చు. కానీ చాలా షరతులు ఉన్నాయి. దాదాపు 200 మంది ఉండే షూటింగ్ సిబ్బందిని వందకు […]

మార్గదర్శిగా మారాలనుకుంటున్న చిరు
X

ఇప్పటికే పరిశ్రమకు పెద్దదిక్కుగా మారారు చిరంజీవి. దాసరి నారాయణరావు లేని లోటును భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు కరోనా కష్టకాలంలో కూడా టాలీవుడ్ కు మార్గదర్శిగా మారాలనుకుంటున్నారు మెగాస్టార్. దీనికోసం అందరి కంటే ముందుగా తనే షూటింగ్ స్టార్ట్ చేసి, మిగతా నిర్మాతలు-హీరోకు దిశానిర్దేశం చేయాలనుకుంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, ఆదేశాల ఆధారంగా వచ్చేనెల రెండో వారం నుంచి షూటింగ్స్ మొదలుపెట్టుకోవచ్చు. కానీ చాలా షరతులు ఉన్నాయి. దాదాపు 200 మంది ఉండే షూటింగ్ సిబ్బందిని వందకు కుదించి పనిచేయాలి. అడుగడుగునా శానిటైజర్లు ఏర్పాటుచేయాలి, ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. ఇన్ని నిబంధనల మధ్య షూటింగ్ ఎలా చేయాలనే విషయంపై టాలీవుడ్ తర్జనభర్జన పడుతోంది. అందుకే ముందుగా తన ఆచార్య సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని చిరంజీవి నిర్ణయించారు. అలా ఓ అడుగు ముందుకేస్తే, ఆ తర్వాత తన దారిలో మిగతా ఇండస్ట్రీ అంతా నడుస్తుందనేది చిరు భావన.

కరోనా వైరస్ వ్యాపించిన కొత్తలో కూడా చిరంజీవి ఇలానే వ్యవహరించారు. ప్రభుత్వం చెప్పకముందే, నిపుణులు హెచ్చరించకముందే.. తన ఆచార్య సినిమా షూటింగ్ ను రద్దుచేసుకున్నారు. అలా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తపడ్డారు. టాలీవుడ్ కు మార్గదర్శిగా నిలిచారు. ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత కూడా తన సినిమా షూటింగ్ నే ముందుగా స్టార్ట్ చేసి, టాలీవుడ్ కు మార్గదర్శిగా నిలవాలనుకుంటున్నారు

First Published:  28 May 2020 3:33 PM IST
Next Story