Telugu Global
International

చైనా కంపెనీలపై డీలిస్ట్‌ అస్త్రం

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కరోనా తర్వాత మరింత ముదిరింది. కరోనాపై సమాచారాన్ని చైనా దాచిపెట్టడం వల్లే ప్రపంచం, ముఖ్యంగా అమెరికా కరోనా కోరల్లో చిక్కుకుందని ఆరోపిస్తున్న ట్రంప్‌… చైనాపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. చైనాను మోసపూరిత దేశంగా ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పుడు చైనా కంపెనీలను అమెరికా స్టాక్‌ మార్కెట్ల నుంచి తరిమేసేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ మేరకు బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది. హోల్డింగ్‌ ఫారిన్‌ కంపెనీస్‌ అకౌంటబుల్‌ యాక్ట్‌ పేరిట ప్రవేశపెట్టిన […]

చైనా కంపెనీలపై డీలిస్ట్‌ అస్త్రం
X

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కరోనా తర్వాత మరింత ముదిరింది. కరోనాపై సమాచారాన్ని చైనా దాచిపెట్టడం వల్లే ప్రపంచం, ముఖ్యంగా అమెరికా కరోనా కోరల్లో చిక్కుకుందని ఆరోపిస్తున్న ట్రంప్‌… చైనాపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు.

చైనాను మోసపూరిత దేశంగా ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పుడు చైనా కంపెనీలను అమెరికా స్టాక్‌ మార్కెట్ల నుంచి తరిమేసేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ మేరకు బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.

హోల్డింగ్‌ ఫారిన్‌ కంపెనీస్‌ అకౌంటబుల్‌ యాక్ట్‌ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం అమెరికా సెక్యూరిటీస్‌ చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు గాను నాస్‌డాక్, ఎన్‌వైఎస్‌ఈ స్టాక్‌ ఎక్సైంజ్‌ల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్‌ చేసేందుకు వీలుంటుంది.

దీని ప్రకారం లిస్టెడ్‌ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ ప్రభుత్వ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు అమెరికాలో పబ్లిక్‌ కంపెనీల ఖాతాలను సమీక్షించే బోర్డు పీసీఏవోబీ తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు సమ్మతించాలి. ఏ కంపెనీ అయినా తనిఖీలకు వరుసగా మూడేళ్ల పాటు నిరాకరించిన పక్షంలో నిషేధం, డీలిస్టింగ్‌ ఖాయమైపోతోంది.

ఈ నిబంధన అన్ని దేశాలకు వర్తించేదే అయినా… సమాచారం అందించే విషయంలో చైనా కంపెనీలు మాత్రం చాలా మొండిగా వ్యవహరిస్తున్నాయి. చైనా సంగతి తేల్చేందుకే ఈ బిల్లును తెచ్చినట్టు భావిస్తున్నారు.

ఇప్పటికే సేల్స్‌ అకౌంటింగ్‌ మోసాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటు న్న చైనా సంస్థ ‘లకిన్‌ కాఫీ’ ను డీలిస్ట్‌ చేస్తున్నట్లు నాస్‌డాక్‌ ప్రకటించింది. ఇదివరకే 5జీ టెలికం పరికరాల చైనా దిగ్గజం హువావేపై అమెరికా అనేక ఆంక్షలు విధించి దానితో తమ దేశ సంస్థలేవీ వ్యాపార లావాదేవీలు జరపకుండా దాదాపు అడ్డుకుంది.

అమెరికా ఇలా తమ కంపెనీలను టార్గెట్ చేయడాన్ని పసిగట్టిన చైనా… లండన్‌ ఎక్సైంజ్ వైపు చూస్తోంది. ఒకవేళ అమెరికన్‌ ఎక్సైంజ్‌ల నుంచి డీలిస్ట్‌ అయిపోతే ప్రత్యామ్నాయంగా లండన్‌ ఎక్సైంజ్‌లో కంపెనీలను లిస్ట్‌ చేసే ప్రయత్నాల్లో చైనా ఉంది. లండన్‌లో లిస్ట్‌ కాదల్చుకున్న కంపెనీల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు చైనా సిద్దమవుతోంది.

అమెరికా మార్కెట్లలో 170 చైనా కంపెనీలు లిస్టయి ఉన్నాయి. అయితే ఇందులో చైనా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తూ అమెరికా మార్కెట్లలో లిస్టయిన కంపెనీలు చాలా ఉన్నాయి.

First Published:  22 May 2020 1:52 AM IST
Next Story